రక్షణ శాస్త్రవేత్తలపై దాడికి ప్లాన్!
భారతదేశంలో.. అందునా ముంబై నగరంలో ఉగ్రదాడులు చేయాలని లష్కరే తాయిబా 2007 సంవత్సరంలోనే లష్కరే తాయిబా నిర్ణయించిందని 26/11 దాడుల సూత్రధారి, ఉగ్రవాది డేవిడ్ హెడ్లీ చెప్పాడు. ముంబై ఉగ్రదాడుల కేసులో అప్రూవర్‌గా మారిన హెడ్లీ.. వీడియోలింకు ద్వారా గుర్తుతెలియని ప్రదేశం నుంచి ముంబై ప్రత్యేక కోర్టు విచారణలో పాల్గొన్నాడు. అల్ కాయిదా గురించి తనకు తెలుసని, అది ఒక ఉగ్రవాద సంస్థ అని హెడ్లీ అంగీకరించాడు. అలాగే, లష్కరే తాయిబాకు జకీవుర్ రెహ్మాన్ ఆపరేషనల్ కమాండర్ అని కూడా అంగీకరించాడు. లష్కరే తాయిబా, జైషే మహ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ అన్నీ యునైటెడ్ జీహాద్ కౌన్సిల్ కింద పనిచేస్తున్నాయని, ఇవన్నీ భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్థాన్‌లో పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థలేనని హెడ్లీ అంగీకరించాడు.
2007 నవంబర్ - డిసెంబర్ నెలల్లో పాకిస్థాన్‌లోని ముజఫరాబాద్‌లో ఓ సమావేశం జరిగిందని, దానికి సాజిద్ మీర్, అబు ఖఫా, తాను హాజరయ్యామని హెడ్లీ చెప్పాడు. ఆ సమావేశంలోనే ముంబైలోని తాజ్‌మహల్ ప్యాలెస్ హోటల్ వద్ద రెక్కీ చేయాల్సిందిగా తనకు బాధ్యతలు అప్పగించారన్నాడు. తాజ్‌మహల్ ప్యాలెస్ హోటల్లో కొంతమంది రక్షణ శాస్త్రవేత్తలు సమావేశం అవుతున్నారన్న సమాచారం అప్పటికే లష్కర్ వద్ద ఉందని, సరిగ్గా ఆ సమావేశం జరిగే సమయానికి దాడి చేయాలని వాళ్లు అనుకున్నారని హెడ్లీ చెప్పాడు. తాను తొలిసారి జకీవుర్ రెమ్మాన్ లఖ్వీని 2003లో ముజఫరాబాద్‌లో లష్కర్ ప్రధాన కార్యాలయంలో కలిశానని హెడ్లీ తెలిపాడు. కాగా, అదే సమయంలో లఖ్వీ ఫొటో చూపించగా.. అతడేనని గుర్తుపట్టాడు.