హెడ్లీ వివరాలు చెప్పిన మాజీ భార్య
న్యూఢిల్లీ: ముంబై ఉగ్రదాడితోపాటు పలు ఉగ్రవాద సంస్థలతో డేవిడ్ హెడ్లీకి ఉన్న సంబంధాలను అతడి మాజీ భార్య ఫైజా ఔటాల్హా ఎన్‌ఐఏకు వెల్లడించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మొరాకో దేశంలో ఉన్న ఆమెకు.. లెటర్ ఆఫ్ రొగేటరీ ద్వారా ప్రశ్నలను పంపించి వివరాలు రాబట్టింది. ఆ వివరాలను ఎన్‌ఐఏ బహిరంగపర్చలేదు. ఫైజా 2007లో హెడ్లీని వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఏడాది కాలానికే వారు విడాకులు తీసుకున్నారు. అయితే ఆ ఏడాది కాలంలోనే హెడ్లీతో కలసి ఫైజా రెండు సార్లు భారత్‌కు వచ్చారు. ముంబైతో పాటు కశ్మీర్‌లో తిరిగారు.
పాక్‌లో సయీద్ సహా పలువురు ఉగ్రవాదులను కలిశారు. కొంతకాలానికి హెడ్లీ విపరీత ప్రవర్తన, ఉగ్రవాదులతో సంబంధాలతో విసిగిపోయిన ఫైజా.. అతడిపై లాహోర్‌లోని పోలీస్‌స్టేషన్‌లో, అమెరికన్ ఎంబసీలో ఫిర్యాదు చేశారు. ఉగ్రవాదులు తహవూర్ రాణా, సయీద్, లఖ్వీలతో సంబంధాలు, ముంబై కుట్ర అంశాల వివరాలను వెల్లడించినట్లు సమాచారం. అమెరికాలో నివసించే హెడ్లీ సోదరుడి నుంచీ ఎన్‌ఐఏ వివరాలు రాబట్టింది. 1997లో న్యూయార్క్‌లో వీడియో పార్లర్ పెట్టిన హెడ్లీ... కొంతకాలానికి పూర్తిగా ముస్లిం మతవాదిగా మారిపోయాడని, ఆ తర్వాత వీడియో పార్లర్‌కు వచ్చేవాడు కాదని అతడి సోదరుడు వెల్లడించినట్లు సమాచారం.