Mumbai terrorist attack
-
భద్రతా సవాళ్ల సమీక్ష లేనందునే...
పదిహేనేళ్ల క్రితం, 2008 నవంబరు 26న దేశ ఆర్థిక రాజధానిపై జరిగిన ఉగ్రదాడి తొలిదశలో భారత భద్రతా వ్యవస్థ దాదాపుగా అచేతనమైందంటే అతిశ యోక్తి కాబోదు. నిస్సహాయులైన, నిరాయుధులైన జన సామాన్యంపై పేట్రేగిన ఉగ్రమూక వందల ప్రాణాలను బలితీసుకున్న దుర్ఘటన అది. భారతదేశ సార్వభౌమత్వం, భద్రతపై ఇంత స్థాయిలో ఎన్నడూ దాడి జరగలేదని చెప్పాలి. ఈ ఘటన జాతీయ భద్రత అంశంలోని సంస్థా గత లోపాలను ఎత్తి చూపింది. దేశం మరోసారి 26/11 లాంటి ఘటనను ఎదుర్కోరాదంటే... అంతర్గత భద్రత సవాళ్లపై సమీక్షించుకోవడం మన తక్షణ అవసరం కావాలి. ముంబై దాడుల్లో ఉగ్రవాదులు అనుసరించిన పద్ధతులు... సరిహద్దులకు అవతలి నుంచి వారికి అందిన సూచనల వంటివన్నీ మనకు అనూహ్యమైనవే. అదే సమ యంలో ఢిల్లీ, ముంబైల్లోని జాతీయ స్థాయి భద్రత వ్యవస్థలు సంపూర్ణంగా విఫలమయ్యాయి. 1999 నాటి కార్గిల్ యుద్ధంలోనూ సంస్థాగతమైన నిఘా లోపాలు బయటపడ్డాయి. దివంగత కె. సుబ్రమణ్యం నేతృత్వంలోని కార్గిల్ రివ్యూ కమిటీ కూడా ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ‘‘ఏజెన్సీల మధ్య సమన్వయానికి, నిర్దిష్ట లక్ష్యానికి అనుగుణంగా కలిసి పనిచేసేందుకు తగిన వ్యవస్థ లేకుండా పోయింది. అలాగే ఏజెన్సీ లకు పనులు చెప్పేందుకు, వాటిని పర్యవేక్షించేందుకు, సామర్థ్యాలను పరీక్షించేందుకు, నాణ్యత ప్రమాణాలను సమీక్షించేందుకు కూడా తగిన వ్యవస్థలు లేవు. అన్ని నిఘా సంస్థలు ఎలా పనిచేస్తున్నాయో చూసే ఏర్పాట్లు కూడా లేవు’’ అని విస్పష్టంగా పేర్కొందీ కమిటీ. ఈ రకమైన లోపాల కారణంగా భారత్ నివారించ దగ్గ ఎదురుదెబ్బలు ఎన్నో చవిచూడాల్సి వస్తోంది. గల్వాన్ లోయ సంఘటన ఇక్కడ చెప్పుకోవాల్సిన ఒక అంశం. 2020లో జరిగిన ఈ ఘటనలో చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సైనికులు భారతీయ సైనికులను ఒకరకంగా ‘ఆశ్చర్యానికి’ గురిచేస్తూ తీవ్రస్థాయి దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. మిలిటరీ సంస్కరణల ఫలితం? భద్రత వ్యవహారాలపై ఏర్పాటైన కేబినెట్ కమిటీకి ప్రాతినిధ్యం వహించే ‘ద నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్’ మిలిటరీ సంస్కరణలను అమలు చేసే విషయంలో దశాబ్దాల సమయం తీసుకుంది. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) పోస్ట్‌ను సృష్టించేందుకు 1990లలో పీవీ నర సింహారావు ప్రధానిగా ఉన్నప్పుడే ప్రయత్నాలు మొదల య్యాయి. ఆఖరికి ఇది 2019లో నరేంద్ర మోదీ ప్రధానిగా ఉండగా సాకారమైంది. ఈ జాప్యం చెప్పే విషయం ఏమిటి? జాతీయ భద్రత అంశాల విషయంలో సంస్క రణలు, సంస్థాగత సమీక్షలకు కొంత నిరోధం ఉందీ అని. అది కూడా స్వప్రయోజనాల కోసం పాకులాడే వారి వల్ల అని అర్థమవుతుంది. భారతీయ నిఘా ఏజెన్సీల్లో... ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ), రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (ఆర్ అండ్ ఏడబ్ల్యూ– క్లుప్తంగా ‘రా’), నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఎన్టీఆర్ఓ), నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ ఐఏ)లు ఉన్నాయి. ప్రధానమంత్రి కార్యాలయం,కేంద్ర హోంశాఖల కింద ఈ ఏజెన్సీలన్నీ పనిచేస్తాయి. వీటికి డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, ప్రతి సాయుధ దళంలోనూ తమదైన ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్లు అదనం. అంతేకాదు... రెవెన్యూ, ఆర్థిక రంగాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించేందుకు, నిఘా పెట్టేందుకు ప్రత్యే కమైన విభాగాలు కూడా ఉన్నాయి. సమాచార రంగంలో వచ్చిన సరికొత్త మార్పులను పరిగణనలోకి తీసుకుంటే ప్రభుత్వాలు రోజంతా తమ నిఘా కార్యక్రమాలను కొన సాగించాల్సిందే అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవస రమే లేదు. చాలా ఏజెన్సీలను ఐపీఎస్‌ల నుంచి ఎంపిక చేసిన సీనియర్ స్థాయి అధికారులు నడుపుతూంటారు. సంస్కరణలు కష్టం అవుతూండేందుకు ఇది కూడా ఒక కారణం. పాతికేళ్ల నివేదికలు... మిలిటరీ సంస్కరణల విషయంలో దాదాపు 24 ఏళ్లుగా చాలా నివేదికలు వెలువడ్డాయి. నిశితంగా శ్రద్ధ పెట్టి సమీక్షిస్తే ఉన్నత స్థాయిలోని పోలీసు వర్గాలు, రాజ కీయ నాయకులు ఇప్పుడున్న పరిస్థితినే కొనసాగించాలనే స్వార్థంతో పనిచేస్తున్నట్లు స్పష్టమవుతుంది. 2024 ఎన్నికల సమయం దగ్గరపడింది. కాబట్టి వ్యవస్థాగతమైన సంస్కరణలకు ఇదేమంత మంచి సమయం కాదు. కానీ వచ్చే ప్రభుత్వం ఏదైనా ఈ విష యాన్ని కచ్చితంగా చేపట్టాల్సిందే. ఇప్పటివరకూ ఈ అంశంపై వెలువడ్డ నివేదికలన్నింటినీ కూలంకుషంగా సమీక్షించి ఒక టాస్క్‌ఫోర్స్ ద్వారా ప్రస్తుత పరిస్థితుల్లో ఏ రకమైన చర్యలు తీసుకోవాలో నిర్ధారించుకుని ముందడుగు వేయాలి. ఈ సంస్కరణలకు పునాదులుగా నిలిచే అంశాలు ఇరవై ఏళ్లుగా నిఘా వర్గాల్లో నైపుణ్యం సాధించిన వారి నివేదికల ఆధారంగా ఉంటాయని నమ్ము తున్నాను. వృత్తిపరమైన నిబద్ధత, వ్యక్తిగతంగా నైతిక నియ మాలున్న వారు నిఘా వ్యవస్థల్లో ఉండటం చాలా అవసరం. ఎందుకంటే ప్రజా పరిశీలనకు దూరంగా, పారదర్శకం కాని తెర వెనకాల ఈ వ్యవస్థలు పనిచేస్తూంటాయి మరి. కాబట్టి వీరి పనితీరును బహిరంగంగా సమీక్షించడం అసాధ్యమే కాదు, వాంఛనీయం కూడా కాదు. కెనడా ఇటీవలే భారతీయ నిఘా వ్యవస్థలపై కొన్ని ఆరోపణలు గుప్పించింది. అమెరికా కూడా ఈ అంశంలో తన ఆందోళన వ్యక్తం చేసింది. ఉగ్రవాదంపై పోరులో భారత్, అమెరికా కలిసి పనిచేస్తున్న నేపథ్యంలో ఈ రకమైన ఆరోపణలు ఏమంత మంచివి కాదు. 26/11 ఉగ్రదాడి మనలోని లోపాలు ఎన్నింటినో ఎత్తి చూపింది. వాటిని పరిష్కరించే విషయంలో ఇప్పటికే జరిగిన జాప్యం చాలు. ఈ విషయంలో వీలైనంత తొంద రగా సంస్కరణల ప్రక్రియ ప్రారంభం కావడం దేశ హితం దృష్ట్యా అవసరం. సి. ఉదయ్ భాస్కర్ వ్యాసకర్త డైరెక్టర్, సొసైటీ ఫర్ పాలసీ స్టడీస్ (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
ముంబై ఉగ్రదాడి మాస్టర్‌మైండ్‌కు శిక్ష ఖరారు
సాక్షి, న్యూఢిల్లీ : ముంబై ఉగ్రదాడి సూత్రధారి లష్కరే తోయిబా ఆపరేషన్స్ కమాండర్ జకీ ఉర్ రెహ్మాన్ రెహ్మాన్ లఖ్వికి (61) పాకిస్తాన్ కోర్టు భారీ షాకే ఇచ్చింది. ఉగ్రవాద కార్యకలాపాలకు ఆర్థిక సాయం అందిస్తున్నాడన్న ఆరోపణలపై 15 ఏళ్ళ జైలు శిక్ష విధించింది. ఉగ్రవాద నిరోధక చట్టం 1997 లోని వివిధ సెక్షన్ల కింద ఈ శిక్షను ఖరారు చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి ఎజాజ్ అహ్మద్ బుట్టార్ శుక్రవారం తీర్పు చెప్పారు. లఖ్వీకి మూడు కౌంట్స్ చొప్పున ఐదేళ్ల కఠిన కారాగార జైలు శిక్ష విధించారు. అలాగే లక్ష పాకిస్తాన్ రూపాయల జరిమానా కూడా విధించారు. జరిమానా చెల్లించడంలో విఫలమైతే, ఒక్కోదానికి ఆరు నెలల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. తీర్పు అనంతరం లఖ్విని తరలించామని అధికారి తెలిపారు. (ముంబై ఉగ్రదాడి సూత్రధారి లఖ్వీ అరెస్టు) ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తున్నాడన్న ఆరోపణలపై రెహ్మాన్ లఖ్వీని ఇటీవల అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా ముంబై దాడుల తర్వాత ఐక్యరాజ్యసమితి లఖ్వీని ప్రపంచ ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది. అనంతరం లఖ్వీని పాక్ పోలీసులు అరెస్టు చేశారు. ఆరు సంవత్సరాల జైలు శిక్ష అనంతరం.. 2015లో రావల్పిండి జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యాడు. లఖ్విని పంజాబ్ ప్రావిన్స్‌కు చెందిన తీవ్రవాద నిరోధక విభాగం (సీటీడీ) గత వారం అరెస్ట్ చేసింది. సిటిడి నమోదు చేసిన కేసులో లఖ్వీని యాంటీ టెర్రరిజం కోర్ట్ (ఎటిసి) లాహోర్ దోషిగా తేల్చింది. అయితే ఈ కేసులో తనను తప్పుగా ఇరికించారని లఖ్వీ కోర్టుకు విజ్ఞప్తి చేశాడు. -
26/11 ఉగ్రదాడి : రియల్ హీరోలు వీళ్లే..
ముంబై : దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 2008 నవంబర్26న జరిగిన ఉగ్రదాడికి నేటికి సరిగ్గా 12 ఏళ్లు. పాకిస్తాన్ నుంచి లష్కరే తోయిబా ఉగ్రసంస్థకు చెందిన 10 మంది ఉగ్రవాదులు సముద్రమార్గం నుంచి ముంబైకి చేరుకొని అమాయక ప్రజలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్, ఒబెరాయ్ ట్రైడెంట్, తాజ్ మహల్ హోటల్, లియోపోల్డ్ కేఫ్, కామా హాస్పిటల్, నరిమన్ హౌస్ యూదు కమ్యూనిటీ సెంటర్ వంటి 12 ప్రముఖ ప్రదేశాల్లో ముష్కరులు ఏకధాటిగా కాల్పులు జరిపారు. దాదాపు 60 గంటల పాటు సాగిన ఈ మారణహోమంలో 166 మంది చనిపోగా వారిలో 18 మంది భద్రతా సిబ్బంది ఉన్నారు. కాల్పుల ధాటికి వేల మంది గాయపడ్డారు. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. (ఎఫ్ఐఏ జాబితాలో ముంబై ఉగ్రవాదులు) రంగంలోకి దిగిన భద్రతా సిబ్బంది దారుణకాండకు పాల్పడిన పదిమంది ముష్కరుల్లో 9 మందిని హతమార్చగా, ఉగ్రవాది కసబ్‌ను మాత్రం ప్రాణాలతో పట్టుకున్నారు. ఉగ్రవాదులను నిలువరించే క్రమంలో ఉగ్రవాద నిరోధక దళం (ఎటిఎస్) చీఫ్ హేమంత్ కర్కరే, ఆర్మీ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్, ముంబై అదనపు పోలీసు కమిషనర్ అశోక్ కామ్టే, సీనియర్ పోలీస్ ఇన్స్పెక్టర్ విజయ్ సలాస్కర్, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (ఎఎస్ఐ) తుకారాం ఓంబుల్లు అమరులయ్యారు. ముంబై పేలుళ్లు జరిగి 12 ఏళ్లు పూర్తైన సందర్భంగా హోంమంత్రి అమిత్ షా సహా పలువురు ప్రముఖులు అమరులకు నివాళులు అర్పించారు. ముంబై పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి, సీఎం ఉద్దవ్ ఠాక్రే, హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ నివాళులు అర్పించారు. (ఢిల్లీ సరిహద్దుల్లో హై టెన్షన్ ) -
సయీద్‌కు 11 ఏళ్ల జైలు
లాహోర్: ముంబై ఉగ్రదాడుల సూత్రధారి, జమాత్ ఉద్ దవా అధ్యక్షుడు హఫీజ్ సయీద్‌కు పాక్‌లో జైలు శిక్ష పడింది. ఉగ్రవాదానికి నిధులు అందించారన్న కేసులో విచారణ జరిపిన పాకిస్తాన్‌లోని ఉగ్రవ్యతిరేక (ఏటీసీ) పదకొండేళ్ల జైలుశిక్ష విధిస్తూ బుధవారం తీర్పు చెప్పింది. సయీద్‌తోపాటు అతడి సన్నిహిత సహచరుడు జఫర్ ఇక్బాల్‌కూ 11 ఏళ్ల శిక్ష విధిస్తూ ఏటీసీ జడ్జి అర్షద్ హుస్సేన్ భుట్టా ఆదేశాలు జారీ చేశారు. సయీద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐక్యరాజ్య సమితి గతంలోనే ప్రకటించింది. అతడి తలకు అమెరికా గతంలో కోటి డాలర్ల వెలకట్టింది. గత ఏడాది జూలై 17న అరెస్ట్ అయిన సయీద్ లాహోర్‌లోని కోట్ లఖ్‌పత్ జైల్లో ఉన్నారు. లాహోర్, గుజ్రన్‌వాలాల్లో దాఖలైన రెండు కేసుల్లో సయీద్‌కు శిక్ష విధించారని, ఒక్కో కేసులో ఐదున్నర ఏళ్లు జైలు శిక్ష, మొత్తం 15 వేలరూపాయల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చిందని, రెండు శిక్షలు ఒకేసారి అమలవుతాయని కోర్టు అధికారి ఒకరు తెలిపారు. ఏటీసీ కోర్టు గత ఏడాది డిసెంబర్ 11న సయీద్, అతడి సన్నిహిత సహచరులను దోషులుగా ప్రకటించగా..శిక్ష ఖరారును ఫిబ్రవరి 11వ తేదీ వరకూ వాయిదా వేయడం తెల్సిందే. ఉగ్రవాదానికి ఆర్థిక సాయం అందిస్తున్న వ్యక్తులు, సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామన్న పాకిస్తాన్ హామీని నెరవేర్చాలని పారిస్ కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ ఒకటి ఇచ్చిన పిలుపుతో పాక్ ప్రభుత్వం సయీద్, అతడి అనుచరులపై విచారణ ప్రారంభించింది. -
ఉగ్ర సయీద్ దోషే
లాహోర్: ముంబై ఉగ్రదాడుల వ్యూహకర్త, నిషేధిత ఉగ్రవాద సంస్థ జమాత్ ఉద్ దావా అధ్యక్షుడు హఫీజ్ సయీద్‌ను పాకిస్తాన్ కోర్టు ఒకటి దోషిగా ప్రకటించింది. పంజాబ్ ప్రాంతంలోని పలు నగరాల్లో సయీద్ ఉగ్రవాదానికి ఆర్థిక సాయం అందించారని స్పష్టం చేస్తూ యాంటీ టెర్రరిజమ్ కోర్టు జడ్జి మాలిక్ అర్షద్ భుట్టా తీర్పునిచ్చారు. పంజాబ్ ప్రావిన్స్‌కు చెందిన ఉగ్రవాద వ్యతిరేక విభాగం ఈ ఏడాది జూలైలో సయీద్, అతడి అనుచరులపై ఈ కేసు దాఖలు చేసింది. హఫీజ్ సయీద్‌ను అరెస్ట్ చేసి కోట్ లఖ్‌పత్ జైల్లో ఉంచింది. పంజాబ్‌తోపాటు లాహోర్, గుజ్రన్‌వాలా, ముల్తాన్ నగరాల్లో ఉగ్రవాదానికి ఆర్థిక సాయం అందించే లక్ష్యంతో సయీద్, అతడి అనుచరులు నిధులు సేకరించారని పోలీసులు ఆరోపిస్తున్నారు. -
సయీద్‌కు ఐరాస షాక్
న్యూఢిల్లీ: ముంబై మారణహోమం సూత్రధారి, జమాత్ ఉద్ దవా(జేయూడీ) అధినేత హఫీజ్ సయీద్‌కు ఐక్యరాజ్యసమితి(ఐరాస) షాక్ ఇచ్చింది. నిషేధిత ఉగ్రవాదుల జాబితా నుంచి సయీద్ పేరును తొలగించేందుకు ఐరాస నిరాకరించింది. ఈ సందర్భంగా సయీద్‌పై నిషేధం ఎత్తివేతను భారత్, అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ వ్యతిరేకించగా, పాక్ మౌనంగా ఉండిపోయింది. కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘సయీద్‌కు వ్యతిరేకంగా భారత్ బలమైన సాక్ష్యాలను సమర్పించింది. అతని ఉగ్రవాద కార్యకలాపాలపై పూర్తిస్థాయి ఆధారాలను ఐరాసకు అందజేసింది. దీంతో సయీద్‌పై నిషేధాన్ని కొనసాగిస్తామని ఐక్యరాజ్యసమితి ఆయన న్యాయవాది హైదర్ రసూల్ మిర్జాకు తెలియజేసింది’ అని వెల్లడించారు. లష్కరే తోయిబా సహ–వ్యవస్థాపకుడైన సయీద్ ప్రస్తుతం పాకిస్తాన్లో గృహనిర్బంధంలో కొనసాగుతున్నాడని పేర్కొన్నారు. జేయూడీపై ఐరాస 2008లో నిషేధం విధించిందన్నారు. ఈ కేసులో స్వతంత్ర అంబుడ్స్‌మెన్‌గా వ్యవహరిస్తున్న డానియెల్ కిఫ్సెర్ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో ఈ విషయంలో నిర్ణయం తీసుకోవడం ఆలస్యమయిందని తెలిపారు. సయీద్‌పై నిషేధానికి ఐరాస 1267 ఆంక్షల కమిటీ ఆమోదం తెలిపిందన్నారు. ఐరాస ఆంక్షల కమిటీ ప్రధానంగా ఆస్తుల జప్తు, ప్రయాణ నిషేధం, ఆయుధాల అమ్మకం నిలిపివేత అనే మూడు అంశాలను పర్యవేక్షిస్తుంది. ఆంక్షల కమిటీ నిబంధనల మేరకు నిషేధిత జాబితాలోని సంస్థలు లేదా వ్యక్తుల ఆస్తులను సభ్యదేశాలు తక్షణం జప్తుచేయాలి. వీరికి ప్రభుత్వాలు ఎలాంటి సహాయసహకారాలు అందించరాదు. -
త్వరలో భారత్‌కు ముంబై ఉగ్రదాడి నేరస్తుడు?
వాషింగ్టన్: 2008 ముంబై ఉగ్రదాడిలో విచారించేందుకు పాకిస్తానీ కెనడియన్ తహవ్వుర్ హుస్సేన్ రాణాను 2021లోపే భారత్‌కు రప్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. షికాగోలో నివసించే రాణాను ముంబై ఉగ్రదాడికి సంబంధించి 2009లో అమెరికా పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో లష్కరే తోయిబా ఉగ్ర సంస్థకు సహకరించినట్లు విచారణలో బయటపడటంతో 2013లో కోర్టు రాణాకు 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అతడి శిక్షా కాలం డిసెంబర్ 2021 లో ముగియనుంది. ఈ కేసులో రాణాను విచారించేందుకు భారత ప్రభుత్వం అమెరికా అధికార యంత్రాంగంతో చర్చలు జరుపుతోంది. అయితే ముంబై ఉగ్రదాడికి సంబంధించే రాణా ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తుండటంతో.. అదేకేసు విచారణపై భారత్ కు అతన్ని అప్పగించే అవకాశం లేదు. దీంతో భారత ప్రభుత్వం ఢిల్లీలోని నేషనల్ డిఫెన్స్ కాలేజీ, చాబాద్ హౌస్‌లపై దాడి కేసులతోపాటు ఫోర్జరీ కేసుపై భారత్‌కు రప్పించేలా ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవల జాతీయ దర్యాప్తు సంస్థ అమెరికాలో పర్యటించిన సమయంలో ఇరు దేశాల మధ్య ఉన్న పలు అధికారిక విధానాల్లో సడలింపు చేసుకోవాలని ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీంతో ఎలాగైనా రాణాను శిక్షాకాలం పూర్తయ్యేలోపే భారత్‌కు రప్పించే అవకాశాలు మెరుగ్గా ఉన్నట్లు తెలుస్తోంది. -
‘వారు బిర్యాని తినిపిస్తే.. మేం తూటాలు తినిపించాం’
జైపూర్ : కాంగ్రెస్ ఉగ్రవాదులకు బిర్యానీ పెట్టి పోషించింది కాబట్టే దేశంలో 26/11 దాడులు జరిగాయంటూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ మండిపడ్డారు. రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మక్రానాలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న యోగి.. కాంగ్రెస్ పార్టీ మీద విమర్శల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా యోగి మాట్లాడుతూ.. కాంగ్రెస్ విభజన రాజకీయాలు చేస్తోంది. అందువల్లే దేశంలో ఉగ్రవాదం పెరిగిపోయిందని ఆరోపించారు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉగ్రవాదులకు బిర్యాని పెట్టి పోషిస్తే.. నేడు తాము అదే ఉగ్రవాదుల చేత తూటాలు తినిపించామని యోగి తెలిపారు. Congress has done divisive politics. As a result of that, terrorism was at its peak in the country. Today you can see that the terrorists which were fed Biryani by Congress are now being fed bullets by us: UP CM Yogi Adityanath in Makrana, Rajasthan pic.twitter.com/TEhaGf2a1r — ANI (@ANI) November 26, 2018 ముంబైలో 26/11 మరణహోమం జరిగి నేటికి పదేళ్లు పూర్తయ్యాయి. పలు ముఖ్యమైన ప్రాంతాల్లో జరిగిన ఈ దాడుల్లో దాదాపు 175 మంది మరణించారు. ఈ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదుల్లో అజ్మల్ కసబ్ ఒక్కడే పోలీసులకు ప్రాణాలతో పట్టుబడ్డాడు. ఈ కేసు విచారణ సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వాల్ నికామ్, ముంబై జైళ్లో ఉన్నప్పుడు కసబ్ ప్రతిరోజు బిర్యాని కావాలని అడిగినట్లు పేర్కొన్నాడు. దాంతో అప్పట్లో ఈ విషయంపై పెద్ద వివాదమే చేలరేగింది. దాంతో దిద్దుబాటు చర్యల్లో భాగంగా ఉజ్వాల్ వివరణ ఇస్తూ కసబ్‌కు అనుకూలంగా ఏర్పడిన సానుకూల వాతావరణాన్ని విచ్ఛిన్నం చేసేందుకు గాను తాను ఇలాంటి వ్యాఖ్యలు చేశానని వెల్లడించారు. అంతేకాక ప్రభుత్వం కసబ్‌కు ఎప్పుడు బిర్యానీని అందించలేదని కూడా వివరించారు. ముంబై 26/11 కేసులో దోషిగా నిర్ధారించబడిన కసబ్‌ను 2012 నవంబర్‌లో ఉరి తీశారు. -
‘ఇప్పటికైనా ఆ నెత్తుటి మరకలు తుడిచేయాలి’
తను నోరు తెరచి ఏం చెప్పడు. కానీ చీకటి పడిందంటే చాలు ఇంట్లో ఉన్న లైట్లన్నీ వేయమంటాడు. కాస్త వెలుతురు తక్కువగా ఉన్నా సరే తనకి నిద్ర పట్టదు. చీకటి అంటే అంతలా భయపడిపోతాడు మోషె- సాండ్రా సామ్యూల్, 26/11 ఉగ్రదాడిలో బాలుడిని రక్షించిన మహిళ సరిగ్గా పదేళ్ల క్రితం... రోజూలాగానే తన విధులు నిర్వర్తిస్తున్నాడు రబ్బీ గావ్రిల్. చాబాద్ హౌజ్‌ను దర్శించడానికి వచ్చిన వారికి యూదు మత ప్రాశస్త్యం, చాబాద్ ఉద్యమాల గురించి చెబుతున్నాడు. ఆ సమయంలో గావ్రిల్తో పాటు గర్భవతి అయిన భార్య రివిక, ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. అంతా సజావుగానే సాగుతోంది. కానీ అంతలోనే ఒక్కసారిగా బాంబుల శబ్దం వినబడింది. ఏదో ప్రమాదం జరగబోతోందని ఊహించిన గవ్రిల్తో పాటు అక్కడున్న టూరిస్టులంతా అప్రమత్తమయ్యారు. అయితే అప్పటికే చాబాద్ హౌజ్‌ను ముట్టడించిన లష్కరే ముష్కరులు బాంబులతో దాడి చేసి 9 మంది ప్రాణాలను పొట్టనబెట్టకున్నారు. ఈ దుర్ఘటనలో గావ్రిల్ చిన్న కొడుకు మోషె మాత్రమే ప్రాణాలతో మిగిలాడు. ప్రాణాలకు తెగించి మరీ అతడిని కాపాడింది.. అతడి ఆయా సాండ్రా సామ్యూల్. ఆమె సాహసానికి గానూ ఇజ్రాయిల్ ప్రభుత్వం.. 2010లో ఇజ్రాయిల్ పౌరసత్వం ఇచ్చి సత్కరించింది. తన కొడుకు, కోడలు ముద్దులొలికే ఇద్దరు మనుమలు మరణించారనే విషయం తెలియగానే గావ్రిల్ తండ్రి మోషెను ఇజ్రాయెల్‌కు తీసుకువెళ్లాడు. మోషెకు ఇప్పుడు పన్నెండేళ్లు. ప్రస్తుతం ఏడో తరగతి చదువుతున్నాడు. ఈ ఏడాది.. బామ్మాతాతయ్య, ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతాహ్యుతో పాటు మరోసారి భారత్‌కు వచ్చాడు. తన తల్లిదండ్రులు, తోబుట్టువులతో కలిసి చాబాద్ హౌజ్(ప్రస్తుతం నారీమన్ లైట్‌హౌజ్‌గా నామకరణం చేశారు)లో ఆఖరిసారిగా గడిపిన క్షణాలను గుర్తు చేసుకున్నాడు. బహుషా తనకు వాళ్ల రూపం పూర్తిగా గుర్తుండకపోవచ్చు. ఎందుకంటే ఈ ఘటన జరిగే నాటికి అతడు రెండేళ్ల పిల్లాడు. కానీ ఆ ఘటన తాలూకు ప్రభావం ఇప్పటికీ తనపై ఉందంటున్నారు సాండ్రా. 26/11 ఉగ్రదాడిలో ఎంతో మంది సామాన్య ప్రజలు, వీరులు అసువులు బాసారు.. కానీ ఏదో అద్భుతం జరిగినందు వల్లే నేను మోషె ప్రాణాలతో బయటపడ్డామని పేర్కొన్నారు. ఈ ఘటన జరిగిన తర్వాత రెండు వారాల పాటు ఆస్పత్రిలోనే ఉన్నారు సాండ్రా. ఇలా ఎందుకు చేశారో అర్థం కావడం లేదు : సాండ్రా మోషెతో పాటు సాండ్రా కూడా ప్రస్తుతం ఇజ్రాయిల్‌లోనే ఉంటున్నారు. అలే జెరూసలేం సెంటర్లో దివ్యాంగులైన పిల్లల బాగోగులను చూసే సాండ్రా.. ప్రతీ శనివారం మోషెను కలుస్తారట. ’ తను నోరు తెరచి ఏం చెప్పడు. కానీ చీకటి పడిందంటే చాలు ఇంట్లో ఉన్న లైట్లన్నీ వేయమంటాడు. కాస్త వెలుతురు తక్కువగా ఉన్నా సరే తనకి నిద్ర పట్టదు. చీకటి అంటే అంతలా భయపడిపోతాడు’ అంటూ ప్రస్తుతం మోషె ఎదుర్కొంటున్న మానసిక సంఘర్షణ గురించి చెప్పుకొచ్చారు సాండ్రా. ‘చాబాద్ హౌజ్‌లోని నాలుగో, ఐదో అంతస్తులను అలాగే ఉంచేసారు. మూడో అంతస్తులో ఉన్న నిర్మాణాలన్నీ ధ్వంసం చేశారు. అక్కడున్న పిల్లర్లపై ఇంకా రక్తపు మరకలు అలాగే ఉన్నాయి. అదంతా చూసినపుడు నా ఒళ్లు గగుర్పొడించింది. భయంతో వణికి పోయా. నాకొక విషయం మాత్రం అర్థం కాలేదు. ఆరోజు మరో తొమ్మిది చోట్ల కూడా ఉగ్రవాదులు రక్తపాతం సృష్టించారు. అయితే అక్కడ కూడా ఇందుకు సంబంధించిన చేదు ఙ్ఞాపకాలను అలాగే ఉంచారా లేదా కేవలం ఒక్క చాబాద్ హౌజ్లోనేనా? కానీ అలా ఉంచడం వెనుక వారి లాజిక్ ఏంటో నాకు అర్థం కాలేదు. మేలో ఇక్కడికి వచ్చినపుడు గమనించలేదు. కానీ మరోసారి ఆ ఫొటోలు చూస్తుంటే ఇవన్నీ గుర్తుకువస్తున్నాయి. కానీ నెత్తుటి మరకలు తుడిచేస్తే బాగుంటుంది’ అని ఆనాటి ఘటనకు ప్రత్యక్ష సాక్షిగా నిలిచిన సాండ్రా తన అభిప్రాయయాన్ని వెలిబుచ్చారు. ఏదేమైనా సరే ప్రతీ రెండేళ్లకోసారి కుమారులను చూసేందుకు ముంబైకి కచ్చితంగా వస్తారట. -
26/11 పదేళ్ల ఉగ్ర జ్ఞాపకం
‘అల్లా కసమ్, ఐసి గల్తీ దొబార నహీ హోగీ’. ఉరితీసే ముందు అజ్మల్ కసబ్ చివరి మాటలివి. ‘అల్లా మీద ప్రమాణం. ఇలాంటి తప్పు మళ్లీ చెయ్యను’ అని! పాకిస్తానీ టెర్రరిస్ట్ కసబ్. ముంబైపై ఉగ్రదాడుల సూత్రధారి! 2008 నవంబర్ 26–27 మధ్య.. ఆ అర్ధరాత్రి, ముంబైలో ఏకకాలంలో కనీసం పదిచోట్ల బాంబు దాడులు జరిపించి, 174 మంది దుర్మరణానికి, మూడొందల మందికి పైగా క్షతగాత్రులవడానికి కారణమైన లష్కరే తోయిబా టెర్రరిస్ట్. అతడి చివరి మాటలివి. కసబ్‌ని 2012లో భారత ప్రభుత్వం ఉరితీసింది. అంతకు నాలుగేళ్ల క్రితమే.. ముంబై పేలుళ్లు జరిగిన మరుసటి రోజు.. మళ్లీ ఇలాంటి ఘోరం జరగనిచ్చేది లేదని భారత ప్రభుత్వం ప్రతిన పూనింది. మరి అప్పటికీ ఇప్పటికీ పరిస్థితి ఏమైనా మారిందా? మారిందని మనకు అనిపించవచ్చు. అయితే టెర్రరిస్టులను సజీవంగా పట్టుకునే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయిన ఐదుగురు పోలీస్ అధికారుల కుటుంబాల పరిస్థితి మాత్రం ఏం మారలేదని అంటున్నారు. అసలు పరిస్థితిని మార్చుకోవలసినంతగా ఎందుకు మనం నిర్లక్ష్యం వహించామని అడుగుతున్నారు. ఆ ఐదుగురి గురించి ఒక మననం. ఆ కుటుంబాల గురించి ఒక అవలోకనం. హేమంత్ కర్కరే ముంబై యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) చీఫ్. దాదర్‌లోని తన ఇంట్లో భార్యతో కలిసి భోజనం చేస్తున్నప్పుడు ఫోన్ వచ్చింది కర్కరేకి. ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్ రైల్వే స్టేషన్లోకి ఉగ్రవాదులు చొరబడ్డారని సమాచారం! కర్కరే రైల్వే స్టేషన్‌కి వెళ్లే సరికే ఉగ్రవాదులు అక్కడి నుంచి కామా ఆల్బ్లెస్ హాస్పిటల్‌కి మూవ్ అయ్యారు. కర్కరే మిగతా ఆఫీసర్స్‌ని కలుపుకుని ఆల్బ్లెస్కి వెళ్లారు. కొంతమందిని అక్కడ ఉంచి.. కర్కరే, కామ్తే, సలాస్కర్ క్వాలిస్ జీప్ ఎక్కారు. ఒక ఎర్ర కారు వెనుక టెర్రరిస్టులు నక్కి ఉన్నారని వైర్లెస్లో ఇన్ఫర్మేషన్ రావడంతో అక్కడికి Ðð ళ్లారు. ఎర్ర కారులోని టెర్రరిస్టులు వీళ్లను గుర్తించి కాల్పులు జరిపారు. మొదట కర్కరే ఏకే 47 కింద పడింది. ఆ వెంటనే కర్కరే నేలకు ఒరిగాడు. హేమంత్ కర్కరే, కవిత కుటుంబం: భార్య కవిత, కొడుకు ఆశాశ్, కూతుళ్లు సయాలి, జూయీ. ఇదీ హేమంత్ కుటుంబం. కవిత (57) 2014లో బ్రెయిన్ హెమరేజ్‌తో చనిపోయారు. ఆమె అభీష్టానుసారం పిల్లలు.. తల్లి అవయవాలను ఆసుపత్రికి డొనేట్ చేశారు. తన భర్త మరణానికి కారణం భద్రతా లోపాలేనని కవిత ఎప్పుడూ అంటుండేవారు. పోలీస్ సిబ్బందికి అధునాతనమైన ఆయుధాలను ఇవ్వాలని, వాళ్లను ఎప్పటికప్పుడు సుశిక్షితులను చేసే వ్యవస్థ ఉండాలని ప్రభుత్వానికి లేఖలు కూడా రాశారు. తుకారామ్ ఆంబ్లే అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్. టెర్రరిస్టులు మెరైన్ డ్రైవ్ వైపు వెళుతున్నారని సమాచారం రావడంతో.. ఆ దారిని బ్లాక్ చేసే డ్యూటీని తుకారామ్‌కి అప్పజెప్పింది డిపార్ట్మెంట్. కారును ఆపాడు. ఒట్టి చేతుల్తో కసబ్‌తో కలియబడి అతడి దగ్గరున్న బుల్లెట్లన్నీ లాగేసుకున్నాడు. తుకారామ్ ఆ పని చేయకపోయుంటే.. కసబ్ తనని తను కాల్చుకుని ఉండేవాడేమో. టెర్రరిస్టులతో జరిగిన ఆ ఘర్షణలోనే తుకారామ్ మరణించాడు. తుకారామ్ ఆంబ్లే, తారాబాయి కుటుంబం: తుకారామ్ ఆంబ్లేకి నలుగురు కూతుళ్లు. పవిత్ర, వందన, వైశాలి, భారతి. కొడుకులు లేరు. భార్య తారాబాయి. ఉగ్రదాడుల్లో తుకారామ్ చనిపోయే నాటికి పవిత్రకు, వందనకు పెళ్లిళ్లు అయిపోయాయి. ఆ ఇంట్లో ప్రస్తుతం తారాబాయి, వైశాలి, భారతి ఉంటున్నారు. ‘‘ఇప్పటికీ.. మా నాన్న డ్యూటీ అయిపోయాక, ఇంట్లోకి రాగానే తలపై నుంచి టోపీ తీసి రోజూ పెట్టే చోటే తగిలించి, మా వైపు చూసి నవ్వుతూ ‘ఏంటి విశేషాలు..’ అని అడుగుతున్నట్లే ఉంటుంది. కానీ మాకు తెలుసు మా నాన్న తిరిగి రారని. వస్తే బాగుండని అనిపిస్తుంది’’ అని అంటుంది వైశాలి. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ సందీప్ ఆర్మీ ఆఫీసర్. తాజ్ హోటల్లోని ఆరో ఫ్లోర్లో ఉగ్రదాడి జరుగుతున్నప్పుడు అక్కడికి ఎన్.ఎస్.సి. (నేషనల్ సెక్యూరిటీ గార్డ్) టీమ్‌ని లీడ్ చేసింది సందీపే. మొత్తం పదిమంది కమాండోలు. వారికి గైడ్‌లైన్స్ ఇస్తున్న సమయంలో వెనుక నుంచి జరిగిన కాల్పుల్లో సందీప్ చనిపోయాడు. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్, అమ్మ ధనలక్ష్మి కుటుంబం: అమ్మ ధనలక్ష్మి, నాన్న ఉన్నికృష్ణన్.. సందీప్, వీళ్ల ముగ్గురే. సందీప్ ఒకడే సంతానం. పెళ్లి కావలసి ఉంది. ఉగ్రవాదులతో తలపడుతున్నప్పుడు.. ‘‘ముందుకు వెళ్లకండి. నేను హ్యాండిల్ చేస్తాను’’ అన్నవి అతడి చివరి మాటలు. ఆపరేషన్‌లో పాల్గొన్న మిగతా కమాండోలను ఉద్దేశించి ఆ మాటలు అన్నాడు. ‘‘నా కొడుకు చనిపోలేదు. బతికే ఉన్నాడు’’ అని అంటుంటారు ధనలక్ష్మి.. ఎవరు ఆనాటి సంఘటనను ప్రస్తావించినా. అశోక్ కామ్తే అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్. ఎటాక్ జరుగుతున్న ఏరియా అతడి పరిధిలోని కాదు. కానీ టెర్రరిస్టులు అనగానే అక్కడి ఆఫీసర్స్కి సహకారం అందించడానికి బయల్దేరాడు. సి.ఎస్.ఎం.టి. రైల్వే స్టేషన్లో హేమంత్ కర్కరేకి, విజయ్ సలాస్కర్కి జత కలిశాడు. వారితో కలిసి క్వాలిస్ జీప్ ఎక్కాడు. వీళ్ల జీప్‌పై టెర్రరిస్టులు కాల్పులు జరుపుతుంటే.. చివరి వరకు అతడి తుపాకీ గర్జిస్తూనే ఉంది. కర్కరే, సలాస్కర్, తర్వాత అశోక్ కామ్తే టెర్రరిస్టుల బులెట్లకు బలి అయ్యాడు. అశోక్ కామ్తే, వినీత కుటుంబం: అశోక్, ఆయన భార్య వినీత, ఇద్దరు కొడుకులు రాహుల్, అర్జున్, అశోక్ తల్లిదండ్రులు, చెల్లి షర్మిల అంతా ఒకే ఇంట్లో ఉండేవారు. అశోక్ మరణంతో ఆ కుటుంబం ఆత్మస్థయిర్యం సడలింది కానీ, అశోక్ భార్య ధీశాలిగా కుటుంబం కోసం నిలబడ్డారు. భర్త జీవిత చరిత్రను ‘టు ద లాస్ట్ బుల్లెట్’ అనే పుస్తకంగా తెచ్చారు. వినీత లా చదివారు. కార్మికుల కేసులను వాదిస్తుంటారు. అశోక్ చనిపోయాక, ఆయన ఉండే గదికి ఆ కుటుంబం ఒక బోర్డును పెట్టింది. ‘‘మిమ్మల్ని చూసి మేం గర్వపడుతున్నాం. మీరు మా హీరో’ అని అందులో రాసి ఉంటుంది. డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం వల్లే తన భర్త.. ఉగ్రవాదుల ఘాతుకానికి బలయ్యాడని వినీత ఇప్పటికీ బలంగా నమ్ముతున్నారు. విజయ్ సలాస్కర్ పోలీస్ ఇన్స్పెక్టర్. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. యాంటీ–ఎక్స్టార్షన్ (బలవంతపు వసూళ్ల నిరోధం) హెడ్డు. కర్కరే, కామ్తేలతో పాటు ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించాడు. విజయ్ సలాస్కర్ భార్య స్మిత కుటుంబం: విజయ్ సలాస్కర్ భార్య స్మిత. కూతురు దివ్య ఏకైక సంతానం. విజయ్ చనిపోయేటప్పటికే ఆమె వయసు 21. ‘‘డాడీ ఎప్పుడూ త్వరగా ఇంటికి రారు. కానీ ఆ రోజు రాత్రి (నవంబర్ 26) త్వరగా వచ్చారు. ‘‘త్వరగా వచ్చారేంటి డాడీ’’ అన్నాను. ‘‘నిన్ను సర్ప్రైజ్ చేద్దామనీ’’ అని నవ్వుతూ అన్నారు. ‘‘అయితే లాంగ్ డ్రైవ్‌కి వెళ్లి ఐస్‌క్రీమ్ తినాల్సిందే’’ అన్నాను. మమ్మీ తిట్టింది. ‘‘ముందు ఆయన్ని భోజనం చెయ్యనివ్వు. తర్వాత వెళ్దువు’’ అంది. నేను.. నా బెడ్రూమ్లోకి వెళ్లాను. అంతే. ఆ తర్వాత డాడీకి ఏదో కాల్ వచ్చింది. వెంటనే వెళ్లిపోయారు. 11.57 కి ‘‘ఎక్కడున్నారు?’’ అని మమ్మీ డాడీకి ఫోన్ చేసింది. ‘‘స్పాట్’లో అని చెప్పారట డాడీ. చెప్పుడూ చెప్పే జవాబే! ‘‘ఇదేం బాగోలేదు’’ అంటోంది మమ్మీ. కొంతసేపటి తర్వాత టీవీ స్క్రోలింగ్‌లో డాడీ చనిపోయినట్లు వచ్చింది’’.. అని మాత్రం షేర్ చేసుకోగలుగుతున్నారు దివ్య. ఆ తర్వాతి ఘటనలు గుర్తు చేసుకోడానికి ఆమె ఇష్టపడడం లేదు. వీళ్లైదుగురే కాదు. బ్రేవ్ హార్ట్స్ ఇంకా ఉన్నాయి. హవల్దార్ గజేంద్రసింగ్, నాగప్ప మహాలే, కిశోర్, షిండే, సంజయ్ గోవిల్కర్ వంటి ఎందరో ఉగ్రమూకలతో ప్రాణాలకు ఒడ్డి పోరాడారు. వీరిలో కొందరు చనిపోయారు. కొందరు క్షతగాత్రులయ్యారు. పాణాలకు ఒడ్డి పోరాడారు. వీరిలో కొందరు చనిపోయారు. కొందరు క్షత గాత్రులయ్యారు. -
సయీద్ ర్యాలీలో పాలస్తీనా దూత
న్యూఢిల్లీ: ముంబై ఉగ్రదాడుల ప్రధాన సూత్రధారి, లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్‌తో కలిసి పాకిస్తాన్‌లోని పాలస్తీనా రాయబారి అబు అలీ వేదిక పంచుకోవడాన్ని భారత్ తప్పుపట్టింది. పాలస్తీనా రాయబారి అద్నన్ హైజాను విదేశాంగ కార్యాలయానికి పిలిపించి భారత్ అసంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో పాలస్తీనా.. పాక్‌లోని తమ రాయబారికి ఉద్వాసన పలికింది. ఈ అంశంపై భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేస్తూ.. ‘పాలస్తీనా రాయబారితో పాటు రమల్లాలోని ఆ దేశ విదేశాంగ శాఖకు మా ఆందోళనల్ని స్పష్టం చేశాం. ఐరాస అంతర్జాతీయ ఉగ్రవాదిగా పేర్కొన్న సయీద్‌తో కలిసి శుక్రవారం రావల్పిండిలో నిర్వహించిన కార్యక్రమంలో పాలస్తీనా రాయబారి పాల్గొనడం ఎంత మాత్రం అంగీకారం కాదని ఆ దేశానికి గట్టిగా చెప్పాం’ అని పేర్కొంది. ఈ సంఘటనపై తీవ్ర పశ్చాత్తాపం వెలిబుచ్చడంతో పాటు సయీద్ కార్యక్రమంలో తమ రాయబారి పాల్గొనడాన్ని తీవ్రంగా పరిగణిస్తామని పాలస్తీనా స్పష్టం చేసినట్లు భారత్ తెలిపింది. ‘ఈ అంశాన్ని తగిన విధంగా పరిష్కరిస్తాం. భారత్‌లో సంబంధాలకు పాలస్తీనా అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఉగ్రపోరులో ఆ దేశానికి అండగా ఉంటాం. భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడిన వారితో సంబంధాలు పెట్టుకోం’ అని పాలస్తీనా పేర్కొన్నట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. -
ఉగ్ర సయీద్‌కు ఎదురుదెబ్బ
-
ఉగ్ర సయీద్‌కు ఎదురుదెబ్బ
ఇస్లామాబాద్: ముంబై ఉగ్రదాడిలో కీలక సూత్రధారి, పాక్ ఉగ్రవాది, జమాత్ ఉద్ దవా ఉగ్రవాద సంస్థ చీఫ్ హఫీజ్ సయీద్‌కు పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్సు గట్టి ఝలక్ ఇచ్చింది. ఉగ్రవాద వ్యతిరేక చట్టం (ఏటీఏ) నాలుగో జాబితాలో అతని పేరును శనివారం చేర్చింది. పాక్ ప్రభుత్వం ఆదేశాల మేరకు హఫీజ్ నిర్వహించే సంస్థలను కూడా ఈ జాబితాలో చేర్చినట్లు పాక్ మీడియా వెల్లడించింది. ఈ జాబితా ప్రకారం.. ఉగ్రవాదిగా అనుమానమున్న వ్యక్తులపై నిఘా ఉంచుతారని తెలిపింది. అంతేకాకుండా సదరు అనుమానితులు స్థానిక పోలీస్ స్టేషన్లలో అడిగిన ప్రతీసారి కచ్చితంగా హాజరుకావలసి ఉంటుందని వివరించింది. పాకిస్తాన్ హోంమంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ఉగ్రవాద నిరోధక శాఖ (సీటీడీ) హఫీజ్ పేరును ఏటీఏ జాబితాలో చేర్చింది. కాగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాక్‌ను ఉగ్రవాద దేశంగా పరిగణించే అవకాశం ఉందని భావించిన పాక్ అధికార యంత్రాంగం హఫీజ్ సయీద్ సహా పలువురిని గతనెల 30న లాహోర్‌లో గృహ నిర్భందం చేసిన సంగతి తెలిసిందే. అలాగే దేశం విడిచి పారిపోకుండా ఎగ్జిట్ కంట్రోల్ జాబితాలో కూడా హఫీజ్‌ను చేర్చింది. -
హెడ్లీ వివరాలు చెప్పిన మాజీ భార్య
న్యూఢిల్లీ: ముంబై ఉగ్రదాడితోపాటు పలు ఉగ్రవాద సంస్థలతో డేవిడ్ హెడ్లీకి ఉన్న సంబంధాలను అతడి మాజీ భార్య ఫైజా ఔటాల్హా ఎన్ఐఏకు వెల్లడించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మొరాకో దేశంలో ఉన్న ఆమెకు.. లెటర్ ఆఫ్ రొగేటరీ ద్వారా ప్రశ్నలను పంపించి వివరాలు రాబట్టింది. ఆ వివరాలను ఎన్ఐఏ బహిరంగపర్చలేదు. ఫైజా 2007లో హెడ్లీని వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఏడాది కాలానికే వారు విడాకులు తీసుకున్నారు. అయితే ఆ ఏడాది కాలంలోనే హెడ్లీతో కలసి ఫైజా రెండు సార్లు భారత్‌కు వచ్చారు. ముంబైతో పాటు కశ్మీర్లో తిరిగారు. పాక్‌లో సయీద్ సహా పలువురు ఉగ్రవాదులను కలిశారు. కొంతకాలానికి హెడ్లీ విపరీత ప్రవర్తన, ఉగ్రవాదులతో సంబంధాలతో విసిగిపోయిన ఫైజా.. అతడిపై లాహోర్‌లోని పోలీస్‌స్టేషన్‌లో, అమెరికన్ ఎంబసీలో ఫిర్యాదు చేశారు. ఉగ్రవాదులు తహవూర్ రాణా, సయీద్, లఖ్వీలతో సంబంధాలు, ముంబై కుట్ర అంశాల వివరాలను వెల్లడించినట్లు సమాచారం. అమెరికాలో నివసించే హెడ్లీ సోదరుడి నుంచీ ఎన్ఐఏ వివరాలు రాబట్టింది. 1997లో న్యూయార్క్‌లో వీడియో పార్లర్ పెట్టిన హెడ్లీ... కొంతకాలానికి పూర్తిగా ముస్లిం మతవాదిగా మారిపోయాడని, ఆ తర్వాత వీడియో పార్లర్‌కు వచ్చేవాడు కాదని అతడి సోదరుడు వెల్లడించినట్లు సమాచారం. -
ముంబై దాడుల నిందితులను ఎందుకు విచారించలేదు?
వాషింగ్టన్: కాశ్మీర్ విషయంలో జోక్యం చేసుకోండని అడగడానికి వచ్చిన పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్.. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నుంచి అనుకోని ప్రశ్నలు ఎదుర్కోవలసి వచ్చింది. 2008 ముంబై దాడుల నిందితులపై విచారణ ఎందుకు ప్రారంభించలేదని షరీఫ్‌ను ఒబామా నిలదీశారు. అంతేకాక సీమాంతర తీవ్రవాదం, ఉగ్రవాద సంస్థ జమాత్ ఉద్ దవా కార్యకలాపాలపై ఆరా తీశారు. వైట్‌హౌస్‌లో ఒబామాను కలిసి రెండు గంటలు చర్చించిన అనంతరం ఈ విషయాల్ని నవాజ్ షరీఫ్ వెల్లడించారు. భారత్‌తో సంబంధాలు, కాశ్మీర్ అంశం కూడా తమ మధ్య చర్చకు వచ్చిందని షరీఫ్ తెలిపారు. ముంబై దాడుల నిందితుల విచారణపై, ఒసామా బిన్ లాడెన్ ఆచూకీ తెలిపిన తర్వాత నిర్బంధంలో ఉన్న డా. షకీల్ ఆఫ్రిదీ గురించి కూడా ఒబామా ప్రశ్నించినట్లు షరీఫ్ తెలిపారు. కానీ ఇతర వివరాలు బహిర్గతం చేయలేదు. అనంతరం ఒబామా విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ.. భారత్-పాక్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగు పడడానికి షరీఫ్ విజ్ఞతతో అడుగులు వేస్తున్నారని కొనియాడారు. ఆయుధ కొనుగోలుకు వినియోగించే నిధుల్ని సామాజిక అభివృద్ధికి ఖర్చు చేస్తే ఉపఖండంలో శాంతి నెలకొంటుందని ఒబామా అభిప్రాయపడ్డారు. ఉగ్రవాద నిర్మూలనకు నిర్మాణాత్మక చర్యలు తీసుకోవడానికి అంగీకరించామన్నారు. చర్చల అనంతరం సంయుక్త ప్రకటన విడుదల చేశారు. దక్షిణాసియాలో నిలకడైన అభివృద్ధి సాధించడానికి అన్ని పక్షాలు నిరంతరాయంగా కృషి చేయాలని ఇరు దేశాలు తీర్మానించాయి. అయితే అమెరికా ద్రోన్ దాడులు, కాశ్మీర్ సమస్యపై మాత్రం ఒబామా నుంచి ఏవిధమైన హామీ షరీఫ్‌కు దక్కలేదని తెలుస్తోంది. అంతేకాక కాశ్మీర్ సమస్యను ద్వైపాక్షికంగానే పరిష్కరించుకోవాలని అమెరికా ఇంతకుముందే స్పష్టం చేసింది. కాగా, ఈ మధ్యనే ముగిసిన ఐరాస సర్వసభ్య సమావేశంలో, ఒబామాను కలిసినపుడు భారత ప్రధాని మన్మోహన్ సింగ్ పాక్ ఉగ్రవాద ప్రేరేపిత చర్యలను ప్రస్తావించడం ఇప్పుడు ఒబామా షరీఫ్‌ను ప్రశ్నించడం గమనార్హం.