
దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 2008 నవంబర్26న జరిగిన ఉగ్రదాడికి నేటికి సరిగ్గా 12 ఏళ్లు.
ముంబై : దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 2008 నవంబర్26న జరిగిన ఉగ్రదాడికి నేటికి సరిగ్గా 12 ఏళ్లు. పాకిస్తాన్ నుంచి లష్కరే తోయిబా ఉగ్రసంస్థకు చెందిన 10 మంది ఉగ్రవాదులు సముద్రమార్గం నుంచి ముంబైకి చేరుకొని అమాయక ప్రజలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్, ఒబెరాయ్ ట్రైడెంట్, తాజ్ మహల్ హోటల్, లియోపోల్డ్ కేఫ్, కామా హాస్పిటల్, నరిమన్ హౌస్ యూదు కమ్యూనిటీ సెంటర్ వంటి 12 ప్రముఖ ప్రదేశాల్లో ముష్కరులు ఏకధాటిగా కాల్పులు జరిపారు. దాదాపు 60 గంటల పాటు సాగిన ఈ మారణహోమంలో 166 మంది చనిపోగా వారిలో 18 మంది భద్రతా సిబ్బంది ఉన్నారు. కాల్పుల ధాటికి వేల మంది గాయపడ్డారు. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. (ఎఫ్ఐఏ జాబితాలో ముంబై ఉగ్రవాదులు)
రంగంలోకి దిగిన భద్రతా సిబ్బంది దారుణకాండకు పాల్పడిన పదిమంది ముష్కరుల్లో 9 మందిని హతమార్చగా, ఉగ్రవాది కసబ్‌ను మాత్రం ప్రాణాలతో పట్టుకున్నారు. ఉగ్రవాదులను నిలువరించే క్రమంలో ఉగ్రవాద నిరోధక దళం (ఎటిఎస్) చీఫ్ హేమంత్ కర్కరే, ఆర్మీ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్, ముంబై అదనపు పోలీసు కమిషనర్ అశోక్ కామ్టే, సీనియర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ విజయ్ సలాస్కర్, అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎఎస్ఐ) తుకారాం ఓంబుల్‌లు అమరులయ్యారు. ముంబై పేలుళ్లు జరిగి 12 ఏళ్లు పూర్తైన సందర్భంగా హోంమంత్రి అమిత్ షా సహా పలువురు ప్రముఖులు అమరులకు నివాళులు అర్పించారు. ముంబై పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి, సీఎం ఉద్దవ్ ఠాక్రే, హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ నివాళులు అర్పించారు. (ఢిల్లీ సరిహద్దుల్లో హై టెన్షన్ )