మంజీరా నీరు మెదక్‌కే..
సాక్షి, హైదరాబాద్: మంజీరా నీటిని మెదక్ జిల్లా సాగునీటి అవసరాల కోసం వినియోగిస్తామని.. హైదరాబాద్‌కు కృష్ణా నది జలాలను తరలిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు చెప్పారు. ప్రస్తుతం మంజీరా నీటిని హైదరాబాద్ తాగునీటి అవసరాలకు వినియోగించడం వల్ల మెదక్ జిల్లా రైతులు నష్టపోతున్నారని ఆయన పేర్కొన్నారు. అందువల్ల మంజీరా నీటిని మొత్తంగా మెదక్ అవసరాల కోసం వినియోగించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు.
బుధవారం మెదక్ జిల్లా కొల్చారం మండలంలో మంజీరా నదిపై నిర్మించిన ఘనపూర్ ఆనకట్ట (ఆనికట్)తో పాటు మంజీరా నదిపై మంత్రి హరీశ్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, ఇతర అధికారులతో కలిసి సీఎం ఏరియల్ సర్వే చేశారు. అనంతరం ఘన పూర్ ఆనకట్ట అంశంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. మంజీరా నది నుంచి దీనికి 4.06 టీఎంసీల నీరు కేటాయించారని, దాని ద్వారా 25 వేల ఎకరాలకు సాగునీరు అందాలని కేసీఆర్ పేర్కొన్నారు. కానీ ప్రస్తుతం 12 వేల ఎకరాలకు మాత్రమే నీరందుతోందని, ఎట్టి పరిస్థితుల్లోనూ 25 వేల ఎకరాలకు నీరందాలని, వీలైతే అదనంగా మరో ఐదువేల ఎకరాలకు నీరివ్వాలని చెప్పారు.
కాలువల్లో పూడిక తొలగించాలని అధికారులను ఆదేశించారు. కాలువలకు లైనింగ్ వేయడం వల్ల చివరి భూములకు నీరందుతుందన్నారు. ఘనపూర్ ఆనకట్ట వద్ద పూర్తిస్థాయి నీటిమట్టం ఉంటే పరిసర పొలాలు మునిగే అవకాశం ఉందని, దీన్ని నివారించడానికి కరకట్టలు నిర్మించాలని సీఎం సూచించారు. పంట పొలాలు మునగకుండా ఈ ఆనకట్ట నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచే మార్గాలను అన్వేషించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మదన్‌మోహన్‌రెడ్డి, చింత ప్రభాకర్, మహిపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.