మంజీర | sangareddy name changed to manjeera | Sakshi
Sakshi News home page

మంజీర

Published Thu, Jun 30 2016 1:27 AM | Last Updated on Tue, Oct 9 2018 4:48 PM

మంజీర - Sakshi

మంజీర

ఈ పేరుతోనే ‘సంగారెడ్డి జిల్లా’!


తెరపైకి కొత్త ప్రతిపాదనలు
మెదక్‌లో కలవడానికి ఖేడ్, అందోల్, నర్సాపూర్ నేతల ‘నో’
పరిష్కారం చూపిన మంత్రి హరీశ్
అయిష్టంగానే అంగీకరించిన ప్రజాప్రతినిధులు
ప్రతి జిల్లాకు రెండేసి రెవెన్యూ డివిజన్లు
తీర్మానం చేసి కేకేకు అందజేసిన జిల్లా ప్రజాప్రతినిధులు
రాజధానిలో ముగిసిన టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధుల సమావేశం

మంజీర జిల్లా..
సంగారెడ్డి, కొండాపుర్, సదాశివపేట, పటాన్‌చెరు, రామచంద్రాపురం, జిన్నారం, అందోల్, పుల్కల్, మునిపల్లి, రాయికోడ్, హత్నూర, జహీరాబాద్, కోహీర్, న్యాల్‌కల్, ఝరాసంగం. నారాయణఖేడ్, మనూరు, కల్హేర్, కంగ్టితోపాటు కొత్త మండలాలైన కంది, అమీన్‌పుర్, గుమ్మడిదల, మొగుడంపల్లి (జహీరాబాద్ నియోజకవర్గం), సిర్గాపూర్, నాగల్‌గిద్ద(నారాయణఖేడ్), వట్‌పల్లి(అందోల్) మండలాలు.

 రెవిన్యూ డివిజన్లు: సంగారెడ్డితోపాటు జహీరాబాద్ లేదా నారాయణఖేడ్‌లో ఏదో ఒకటి.

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: మరో ముందడుగు పడింది. కొత్త జిల్లాల ఏర్పాటు కసరత్తు ఊపందుకుంది. ప్రజాప్రతినిధుల అభిప్రాయ సేకరణతో కీలక ఘట్టం ముగిసింది. బుధవారం జిల్లా ప్రజాప్రతినిధులు హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు. కొత్త జిల్లాల్లోని ప్రాంతాల పంపకాలపై ప్రజాప్రతి నిధులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. మంజీర పేరిట సంగారెడ్డి జిల్లాను ఏర్పాటు చేయాలని ఈ ప్రాంత ప్రజా ప్రతినిధులు ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ మేరకు మాజీ ఎమ్మెల్సీ, జర్నలిస్టు ఆర్.సత్యనారాయణ చేసిన ప్రతిపాదనకు మంత్రి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,  ఇతర ప్రజాప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. అదే సమయంలో ఏకంగా మూడు నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు మెదక్ జిల్లాలో కలవడానికి ససేమిరా అనడంతో చర్చల్లో కొంత ప్రతిష్టంభన ఏర్పడినట్టు విశ్వసనీయ సమాచారం. చివరకు మంత్రి జోక్యంతో సదరు ప్రజాప్రతినిధులు అయిష్టంగానే ఏకగ్రీవ తీర్మానం చేశారు.

పెద్ద జిల్లాగా సంగారెడ్డి...
కొత్తగా ఏర్పాటు కానున్న మూడు జిల్లాల్లో మంజీర పేరుతో సంగారెడ్డి అత్యంత పెద్ద జిల్లాగా అవతరించనుంది. మంజీర (సంగారెడ్డి)లో 26 మండలాలు, సిద్దిపేటలో 18, మెదక్ జిల్లాలో 17 మండలాల చొప్పున పంపకాలు చేస్తూ తీర్మానం చేశారు. ప్రతి జిల్లాలో రెండు చొప్పున రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ తీర్మానాన్ని రాజ్యసభ సభ్యులు, కార్యక్రమ సమన్వయకర్త కె.కేశవరావుకు అందజేశారు. ఆయన వాటిని సీఎం కేసీఆర్‌కు అందించనున్నారు.

 ప్రజాప్రతినిధుల అభ్యంతరం..
అధికారులు సీసీఎల్‌ఏకు పంపిన ప్రతిపాదనలకు ప్రజాప్రతినిధులు భిన్నంగా స్పందించారు. ఇప్పటివరకు అధికారులు నారాయణఖేడ్‌ను సంగారెడ్డి జిల్లాలో, అందోల్‌ను మెదక్ జిల్లాలో కలుపుతూ ప్రతిపాదనలు పంపారు. ప్రజా ప్రతినిధుల తీర్మానం మాత్రం కొంత భిన్నంగా ఉంది. నారాయణఖేడ్, అందోల్, నర్సాపూర్ నియోజకవర్గాలను మెదక్ జిల్లాలో కలపడాన్ని సదరు నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు ఏ మాత్రం ఇష్టపడలేదు. తమ నియోజకవర్గాలను సంగారెడ్డి జిల్లాలోనే ఉంచాలని డిమాండ్ చేశారు. మంత్రి హరీశ్‌రావు జోక్యం చేసుకొని మధ్యేమార్గంగా ఓ పరిష్కారం చూపుతూ తీర్మానం చేసినట్టు తెలిసింది.

 కొత్త ప్రతిపాదనల ప్రకారం...
కొత్త తీర్మానం ప్రకారం నారాయణఖేడ్ నియోజకవర్గంలోని ఒక్క పెద్దశంకరంపేటను మాత్రమే మెదక్ జిల్లాలో కలుస్తుంది. ఇదే నియోజకవర్గంలో కొత్తగా ఏర్పాటు కానున్న సిర్గాపూర్, నాగల్‌గిద్ద మండలాలను సంగారెడ్డి జిల్లాలోనే కలుపుతున్నారు.

అందోల్ నియోజకవర్గంలోని అందోల్, పుల్కల్, రాయికోడ్, మునిపల్లి మండలాలను సంగారెడ్డిలోనే కలుపుతున్నారు. అల్లాదుర్గం, టేక్మాల్, రేగోడు మండలాలను మెదక్ జిల్లాలో కలపాలని తీర్మానం చేశారు. మెదక్ జిల్లాలో కలుస్తున్న ఈ మూడు మండలాల నుంచి కొన్ని గ్రామాలను కలుపుతూ వట్‌పల్లి మండల కేంద్రాన్ని చేసి దాన్ని సంగారెడ్డిలోనే కలపాలని ఎమ్మెల్యే బాబూమోహన్ ప్రతిపాదించినట్టు తెలిసింది.

నర్సాపూర్ నియోజకవర్గంలోని హత్నూర మండలం మినహా మిగిలిన మండలాలను మెదక్‌లోనే కలుపుతూ తీర్మానించారు. దీన్ని నర్సాపూర్ ప్రజాప్రతినిధులు వ్యతిరేకించినట్టు తెలిసింది. నర్సాపూర్ మండలాన్ని కూడా సంగారెడ్డిలోనే కలపాలని డిమాండ్ చేశారు. నర్సాపూర్ నాలుగు దిక్కుల్లో మూడు దిక్కులు ఫారెస్టు ఉందని, ఒక్క సంగారెడ్డి రోడ్డుకు మాత్రమే ఫారెస్టు లేదని, తమ ప్రాంతం అభివృద్ధి కేవలం అటువైపు మాత్రమే జరుగుతుందని నర్సాపూర్ ప్రజాప్రతినిధులు వెల్లడించినట్లు తెలిసింది. ఇదే మండలంలోని మూసాపేట సంగారెడ్డి పట్టణానికి కేవలం 14 కిలో మీటర్ల దూరంలో ఉంటుందని, ఇబ్రహింబాద్ 16 కిలో మీటర్లు ఉంటుందని, అదే మెదక్ జిల్లాలో కలిపితే 60 కిలోమీటర్ల దూరం పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలిసింది. వారి ఆందోళనను పట్టించుకోకుండానే నర్సాపూర్ మండలాన్ని మెదక్ జిల్లాలో కలుపుతూ నిర్ణయం తీసుకున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement