చీకూర్తి గ్రామంలో పర్యటిస్తున్న కలెక్టర్ రోనాల్డ్‌రోస్
న్యాల్‌కల్: మంజీరా పరీవాహక ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుక వెళ్తానని కలెక్టర్ రోనాల్డ్ రోస్ అన్నారు. సోమవారం మండల పరిధిలోని మంజీర పరీవాహక ప్రాంతాలైన చీకూర్తి, హుస్సెన్‌నగర్ గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మంజీరా బ్యాక్ వాటర్ వలన కొంత మేర నష్టం జరిగిందని, ఈ మేరకు ప్రభుత్వం పరిహారం అందిస్తుందన్నారు. ముంపు ఏమేరకు జరిగిందనే విషయాన్ని సర్వే చేపట్టి, అనంతరం నివేదికను ప్రభుత్వానికి పంపిస్తామన్నారు.
నివేదికలను సర్వే చేసి అందజేయాలని ఆయన ఆర్డీఓ శ్రీనివాస్‌రెడ్డిని ఆదేశించారు. జిల్లాలో కురిసిన వర్షాల వలన ప్రాథమిక అంచనా ప్రకారం 50వేల హెక్టార్లలో పంట నష్ట జరిగిందన్నారు. 9600 ఇళ్లు దెబ్బతిన్నాయని, అందులో 247 పూర్తిగా దెబ్బతినగా మిగతావి పాక్షికంగా దెబ్బతిన్నాయన్నారు. సింగూర్ ప్రాజెక్టు నీటి సామర్థ్యం 29.5 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 28టీఎంసీలుగా ఉందన్నారు.
మంజీరకు ఎగువ ప్రాంతం నుంచి వరద పోటెత్తడంతో ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని బయటకు వదిలామన్నారు. తాము మంజీర బ్యాక్ వాటర్ వలన ప్రతిసారి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, తమకు శాశ్విత పరిష్కారం చూపాలని స్థానికులు ఈ సందర్భంగా కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. బ్యాక్ వాటర్ ఇళ్ల వద్దకు రావడంతో విష పురుగులు ఇండ్లలోకి వస్తున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అంతకు ముందు మంజీర నది పరీవాహక ప్రాంతాన్ని కలెక్టర్ పరిశీలించారు.