
మెతుకు కతలు
మొత్తం ప్రపంచ కథా సాహిత్యానికి నాంది పలికింది మెదక్ జిల్లా. ఈ జిల్లాలోని కొండాపూర్‌లో ఉంటూనే గుణాఢ్యుడు ‘బృహత్కథ’ రాసిండు. పైశాచీ భాషలో ఈ సాహిత్యాన్ని సృజించిండు. ఈ భాష ఇప్పుడు అప్ఘ్ఘానిస్తాన్‌లో ‘పుష్తూ’ రూపంలో పుష్టిగానే ఉంది. బృహత్కథలో ఇప్పటికీ తెలంగాణలో వాడుకలో ఉన్న పదాలు ఎన్నో చోటు చేసుకున్నాయి. శాసనాల్లో తెలంగాణ పేరున్న మొట్టమొదటి శాసనాన్ని కూడా ఈ జిల్లాలోని తెల్లాపూర్‌లోనే కనుగొన్నరు. అశ్మక రాజ్యము, మంజీరికా దేశము, ఆ తర్వాత కాసలనాడు, అటు తర్వాత గుల్షానాబాద్- ఇప్పటి మెదక్ ప్రాంతానికి చరిత్ర క్రమంలో ఉన్న పేర్లు. కన్నడ, మరాఠీ, తెలుగు, ఉర్దూ, హిందీ, ఆంగ్ల భాషలు ఈ జిల్లాలో మొదటి నుంచి ప్రచారంలో ఉన్నాయి. ఈ జిల్లా వాసులు పైన పేర్కొన్న అన్ని భాషల్లోనూ సాహిత్యాన్ని సృజించారు. నారాయణ్‌ఖేడ్, జహీరాబాద్ ప్రాంతాలు మొదట బీదర్ జిల్లాలో ఉండేవి. 1956లో మెదక్ జిల్లాలో చేర్చబడ్డాయి.
ఆధునిక యక్షగాన పితామహుడు చెర్విరాల భాగయ్య, పండరి రామానుజరావు, గడ్డం రామదాసు, చిదిరె లక్ష్మణశర్మ, వేముగంటి నరసింహాచార్యులు, నిన్న మొన్న మరణించిన రంగకృష్ణమాచార్యులు తదితరులందరూ ఈ జిల్లా నుంచి సాహిత్యాన్ని సృజించారు. జిల్లాకు చెందిన దాదాపు 119 మంది ప్రాచీన, ఆధునిక కవుల్ని ప్రత్యేక తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో 1969లో మల్యాల దేవిప్రసాద్ యాదవ్ ‘మెదకు మండల సాహిత్య చరిత్ర’ పేరిట వెలువరించిండు. ఈ సాహిత్యచరిత్రకు కొనసాగింపుగా ‘మెదక్ జిల్లా సర్వస్వము’ వెలువడింది. మొన్నటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో జిల్లా కవితా సంకలనాలు వెలువడ్డాయి. ఆ పరంపరలోనిదే ఈ ‘మెతుకు కతలు’.
మునుపు కవిత్వ ‘మునుం’ పట్టిన వేముగంటి మురళీకృష్ణ, మెదక్ జిల్లా సాహిత్యాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసిన బెల్లంకొండ సంపత్‌కుమార్‌లు ఈ సంకలనం తీసుకురావడాన్ని ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కొనసాగింపుగా కూడా చూడాలి. దాదాపు ఒక శతాబ్ద కాలంలో(కచ్చితంగా చెప్పాలంటే 89 యేండ్ల కాలంలో) మెదక్ జిల్లాలో రాజకీయార్థిక సామాజిక సాహిత్య రంగాల్లో వచ్చిన/ఆశించిన మార్పుల్ని ఈ కథలు కండ్లముందుంచాయి.
- సంగిశెట్టి శ్రీనివాస్
9849220321
(ఫిబ్రవరి 21న సిద్దిపేటలో ఆవిష్కరణ కానున్న 504 పేజీల
52 మంది కథకుల ‘మెతుకు కతలు’ పుస్తకానికి రాసిన ముందుమాటలోంచి కొంత భాగం)
ఎవరిదీ ముఖం ఆవిష్కరణ
రెడ్డి రామకృష్ణ కవితా సంపుటి ‘ఎవరిదీ ముఖం’ ఆవిష్కరణ సభ ఫిబ్రవరి 19న సాయంత్రం 6 గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం, బాగ్‌లింగంపల్లి, హైదరాబాద్‌లో జరగనుంది. ఆవిష్కర్త: ఆదిభట్ల సూర్యజ్యోతి. కవి యాకూబ్, కె.శివారెడ్డి, కోడూరి విజయ్‌కుమార్, నారాయణ వేణు, బజరా పాల్గొంటారు.
నిర్వహణ: రామకృష్ణ మిత్రులు, కవిసంగమం వెంకటప్పయ్య పుస్తకావిష్కరణ ‘దేశభక్త’ కొండ వెంకటప్పయ్య స్వీయచరిత్ర ఆవిష్కరణ సభ ఫిబ్రవరి 20న సాయంత్రం 6:30కు వేంకటేశ్వర విజ్ఞాన మందిరం, గుంటూరులో జరగనుంది. ఆవిష్కర్త: తమిళనాడు గవర్నర్ కె.రోశయ్య. పొత్తూరి వెంకటేశ్వరరావు, కె.శ్రీనివాస్, అప్పాజోస్యుల సత్యనారాయణ, జూపూడి రంగరాజు, మోదుగుల రవికృష్ణ పాల్గొంటారు.
తెరవే మహబూబ్‌నగర్ మహాసభలు
‘ఒక తెలంగాణ సాహిత్యం - వర్తమాన కర్తవ్యం’ అంశం కేంద్రంగా తెలంగాణ రచయితల వేదిక మహబూబ్‌నగర్ జిల్లా మహాసభలు ఫిబ్రవరి 21న జిల్లా కేంద్రంలోని అనంత లక్ష్మీ నరసింహా గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో ఉదయం 10 నుంచి సాయంత్రం 6:30 వరకు జరగనున్నాయి. సభ ప్రారంభం: అల్లం నారాయణ. ముఖ్య అతిథి: జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి. ‘సామాజిక తెలంగాణ- సాహిత్యం- దిశానిర్దేశం’, ‘సామాజిక తెలంగాణ- సాహిత్యం- సాంస్కృతిక రంగం’ అంశాలపై ప్రసంగాలుండే ఈ సభల్లో ఎస్వీ రామారావు, అమ్మంగి వేణుగోపాల్, గాజోజు నాగభూషణం, జి.లక్ష్మణ్, గూడూరు మనోజ, గుడిపాటి, కోట్ల వేంకటేశ్వరరెడ్డి, జయధీర్ తిరుమలరావు, మాడభూషి శ్రీధర్, గోరటి వెంకన్న పాల్గొంటారు. కపిలవాయి లింగమూర్తి, ఉందేకోడం రత్నయ్యను సన్మానిస్తారు. ‘కాలనాళిక’ సంకలనాన్ని ఆవిష్కరిస్తారు. పన్నెండు కిన్నెర మెట్ల కళాకారులు దర్శనం మొగులయ్య, డక్కలి పోషప్పల కిన్నెర వాద్య ప్రదర్శన ఉంటుంది.
అరుణ్‌సాగర్ సంస్మరణ సభ
ఫిబ్రవరి 12న హఠాన్మరణం చెందిన కవి, పాత్రికేయుడు అరుణ్‌సాగర్ సంస్మరణ సభ ఫిబ్రవరి 21న సాయంత్రం 5 గంటలకు తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో జరగనుంది. అరుణ్‌సాగర్ ‘మేల్‌కొలుపు’, ‘మ్యాగ్జిమమ్ రిస్క్’, ‘మియర్ మేల్’, ‘మ్యూజిక్ డైస్’ పుస్తకాలను వెలువరించారు.
భాష - సంస్కృతి
రచన: ఆచార్య కోరాడ మహాదేవశాస్త్రి; పేజీలు: 252; వెల: 500; ప్రతులకు: డాక్టర్ కోరాడ రామకృష్ణ, 1/448, ద్వారకా నగర్, అనంతపురం-515004 తెలుగులో తొలి నాటకం ‘మంజరీ మధుకరీయం’ రాసింది కోరాడ రామచంద్రశాస్త్రి. ఆయన మనవడు కోరాడ రామకృష్ణయ్య ‘తెలుగు భాష పుట్టుపూర్వోత్తరాలు కనుగొనడానికి సంస్కృత ప్రాకృతాలకంటే, తమిళ కన్నడాది దక్షిణ భాషలే ఎక్కువ సహాయకారులని నిరూపించిన భాషావేత్త. తండ్రిబాటలో భాషాక్షేత్రంలోకి దుమికారు మహాదేవశాస్త్రి. సునీతీ కుమార్ ఛటర్జీ పర్యవేక్షణలో ‘హిస్టారికల్ గ్రామర్ ఆఫ్ తెలుగు’ పరిశోధన వ్యాసం రాశారు. ‘హాండ్‌బుక్ ఆఫ్ మోడరన్ తెలుగు’, ‘వ్యాకరణ దీపిక’, లాంటి గ్రంథాలు వెలువరించారు.
ప్రస్తుత పుస్తకం, భాషల వర్గీకరణతో మొదలుపెట్టి, పదాల్లో వచ్చిన మార్పును వివరిస్తుంది. ఉదాహరణకు తిక్కన కాలంలో (13వ శతాబ్దం) భాష ఒక మలుపు తిరిగిందని చెబుతూ ప్రాఙ్నన్నయ యుగంలో ప్రారంభమైన కొన్ని లక్షణాలు ఆ దశలో స్థిరపడ్డాయంటారు. అలాగే, అనంతర మార్పులకు ఆ శతాబ్దంలో ప్రారంభదశ కనిపిస్తుందంటారు. ‘త్య్రక్షర ధాతువులలో పదమధ్య అకారం ఉకారమగుట. కలపు-కలుపు; చెఱచు- చెఱుచు; చెదరు-చెదురు. గకారం వకారమగుట. అగును-అవును’. భాషను అధ్యయనం చేసేవారికి ఇది ఉపయుక్త పుస్తకం.
తెలంగాణ సాహిత్యోద్యమాలు
రచన: కాసుల ప్రతాపరెడ్డి; పేజీలు: 468; వెల: 275; ప్రతులకు: సాయి వెంకటరామం బుక్ డిస్ట్రిబ్యూటర్స్, గాంధీనగర్, హైదరాబాద్; ఫోన్: 9676799500 కవి, కథకుడు అయిన ప్రతాపరెడ్డి ‘తెలంగాణ సాహిత్యం తాత్విక పునాది, కవిత్వం, కథ, నవల, విమర్శలపై సాధికారికంగా’ వ్యాఖ్యానించగలిగే విమర్శకుడు కూడా! ‘తెలుగు సాహిత్యంలో విమర్శ అనేది థాంక్‌లెస్ జాబ్’ అని తెలిసీ ఈ మార్గంలో కొనసాగడం ఆయన సాహిత్య ప్రేమకు నిదర్శనం. అట్లా గత ముప్పై ఏళ్లలో తెలంగాణ కేంద్రంగా రాసిన సాహిత్య వ్యాసాలతో కూర్చిన సంకలనం ఇది.
‘తెలంగాణ ఉనికి, అస్తిత్వవాదం, ప్రపంచీకరణం పడగనీడలో ప్రాంతీయ చైతన్యాన్ని సాధారణీకరణం చేయటం, వివిధ ప్రక్రియల్లో తెలంగాణ సాహిత్యం వికసించటం, తెలంగాణ భాష వివక్షను, అవమానాలను ఎదుర్కొని సాహిత్యభాషగా నిలబడటం గురించి ఎన్నో విశ్లేషణ విమర్శనా వ్యాసాలు ఇందులో వున్నాయి. వాటినన్నిటిని ఒక్కచోట వేయటంవల్ల తెలంగాణ సాహిత్యోద్యమం అస్తిత్వవాద ఆరంభ వికాసాలు, గమనం తీరులను గురించి మంచి అవగాహనను కలిగిస్తున్నాయి’.