అమ్మో.. నీటి ముప్పు!
సంగారెడ్డి పట్టణానికి నీటి ముప్పు పొంచి ఉంది.. మంజీర బ్యారేజ్‌లో నీటి నిల్వలు పూర్తిగా అడుగంటడంతో తాగునీటికి తిప్పలు తప్పేలా లేవు.. మరో మూడు రోజులకు సరిపడా నీళ్లు మాత్రమే ఉన్నాయి. ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు సైతం మంజీరలో నీరు లేకపోవడంతో కష్టతరంగా మారింది. ఇదిలా ఉంటే అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవడంలో నిమగ్నమయ్యారు.
- మంజీర బ్యారేజీలో అడుగంటిన నీరు
- మూడు రోజులకు మాత్రమే సరిపడే దుస్థితి
- సంగారెడ్డి పట్టణ ప్రజలకు తప్పని నీటి కష్టాలు
- ప్రత్యామ్నాయం వైపు అధికారుల చూపు
సంగారెడ్డి మున్సిపాలిటీ: మంజీర బ్యారేజీ (కల్పాగూర్ డ్యాం)లో నీటి మట్టం పూర్తిగా పడిపోయింది. బ్యారేజ్ నుంచి సంగారెడ్డి పట్టణంతో పాటు పోతిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని విద్యానగర్ తదితర కాలనీలకు తాగు నీరు సరఫరా అవుతోంది. నీటి నిల్వలు తగ్గిపోడంతో తాగునీటికి ఇబ్బందులు ఏర్పడబోతున్నాయి. మరో రెండు, మూడు రోజులకు మాత్రమే నీళ్లు సరిపోనుండటంతో.. అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఈ మేరకు పట్టణంలో ఉన్న చేతిపంపుల మరమ్మతులు, కొత్త బోర్ల తవ్వకాలు, సింగల్‌ఫేస్ బోరు మోటార్లను ఏర్పాటుచేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
పట్టణానికి మంజీరా నీటి సరఫరా పథకం మినహా మరోమార్గం లేకపోయింది. దీంతో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలనుకున్నా మంజీరాలో నీరు లేకపోవడంతో అది సాధ్యం కాకపోవచ్చు. పట్టణంలోని వివిధ కాలనీలలో కొత్తగా బోర్లు వేస్తేనే నీటి సమస్యను కొంతమేర తీర్చవచ్చన్న ఉద్దేశంతో అధికారులున్నారు. అందుకు అనుగుణంగానే వార్డుల వారీగా అవసరమైన బోర్లకోసం ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఎగువన ఉన్న సింగూరు ప్రాజెక్టులో సైతం నీటిమట్టం కనిష్టస్థాయికి పడిపోవడంతో మంజీరకు నీరు వదిలేపరిస్థితి కనిపించడం లేదు. ఫలితంగా పట్టణ వాసులకు నీటి ఎద్దడి ఎదురవుతోంది.
ఎలాగైనా సింగూరు నీటిని విడుదల చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సంగారెడ్డి మున్సిపల్ చైర్మన్ బొంగుల విజయలక్ష్మి లేఖ రాయనున్నట్లు తెలిపారు. మంజీర బ్యారేజీలో కనిష్టంగా 1.5 టీఎంసీల నీరు ఉండాల్సి ఉండగా కేవలం అర టీఎంసీకి తక్కువే ఉంది. హైదరాబాద్ నగరానికి సైతం ఇక్కడి నుంచే నీరు సరఫరా చేయాల్సి ఉంది. హైదరాబాద్‌కు సరఫరా అయ్యేందుకు ఏర్పాటు చేసిన మోటార్లు డ్యాం మధ్యలో ఉన్నందున.. నీరు ఉన్నంత వరకూ సరఫరా చేసే అవకాశం ఉంది. కాని సంగారెడ్డికి సరఫరా చేసే పంపింగ్‌కు డ్యాం చివరి భాగాన మోటార్లు ఏర్పాటు చేశారు. ఫలితంగా నీటి నిల్వలు తగ్గాగానే పట్టణానికి నీరు సరఫరా చేసే అవకాశం లేకుండా పోతోంది.
రోజూ 22.22 లక్షల గ్యాలన్ల నీరు అవసరం
పట్టణంలోని 31 వార్డులకు రోజూ 22.22 లక్షల గ్యాలన్ల(మిలియన్ క్యూబిక్ మీటర్) నీరు సరఫరా చేయాల్సి ఉంది. అందులో మంజీర ద్వారా 16.30 లక్షల గ్యాలన్ల నీటిని మాత్రమే సరఫరా చేస్తున్నారు. దీంతో పాటు 25 చేతిపంపులు, రెండు ట్యాంకర్ల ద్వారా 20 లక్షల గ్యాలన్ల నీరు సరఫరా చేస్తున్నారు. ప్రధానంగా పట్టణంలోని అన్ని వార్డులతో పాటు కొత్తగా విస్తరించిన కాలనీలకుసైతం మంజీర పైపులైన్లు వేశారు. ప్రస్తుతం ఉన్న డిమాండ్ కంటే 25 శాతం అదనంగా అవసరం ఉంటుంది. దీనికి తోడు మంజీర బ్యారేజీలో 1.5 టీఎంసీల నీరు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం కేవలం 0.36 మాత్రమే నీటి నిల్వ ఉంది. ఇది సంగారెడ్డి పట్టణానికి కేవలం రెండు మూడు రోజులకంటే ఎక్కువగా సరఫరా అయ్యో అవకాశం లేదు.
ప్రభుత్వానికి లేఖ రాస్తాం:
పట్టణానికి నీటి సమస్య తలెత్తనున్నందున ముందస్తుగా ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్టు మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మీ తెలిపారు. మంజీరలో నీటి మట్టం పడిపోవడంతో పంపింగ్‌ల ద్వారా నీరు రావడం లేదని అందుకు సింగూరు నుంచి నీటిని విడుదల చేయించాలని లేఖ రాయనున్నట్టు తెలిపారు.