మాటే మంత్రం.. తడబడే మాటకు తర్ఫీదు ఇస్తున్నారు | List of Public Speaking Topics and Ideas for Students | Sakshi
Sakshi News home page

మాటే మంత్రం.. తడబడే మాటకు తర్ఫీదు ఇస్తున్నారు

Published Sat, Nov 2 2024 9:13 AM | Last Updated on Sun, Nov 3 2024 9:13 AM

List of Public Speaking Topics and Ideas for Students

నలుగురిలోనూ మాట్లాడాలన్న కుతూహలం 

ఆకట్టుకునే వాక్చాతుర్యం కోసం ఆరాటం 

రాజకీయ, విద్యారి్థ, ఉద్యోగుల ఆసక్తి 

నగరంలో పెరుగుతున్న శిక్షణ కేంద్రాలు

మాటలే మంటలు రేపుతాయి.. చెలరేగిన మంటలను నోటి మాటలే చల్లార్చుతాయి. నోట్ల కట్టల కంటే నోటి మాటకే పదునెక్కువ. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. ఇందులో ప్రతి ఒక్కటీ తీసిపడేయలేని నిత్యసత్యాలే. మనం మాట్లాడే మాటకున్న విలువను తెలియజేసే సామెతలు. మనిషికి ఉన్న 64 కళల్లో వాక్చాతుర్యం ఒకటి. మాటలే కదా ఎన్నయినా మాట్లాడతాం అనుకుంటే పొరపడినట్లే.. మైక్‌ పట్టుకుని నలుగురిలో అనర్గళంగా మాట్లాడటం అందరికీ సాధ్యం కాదు. ప్రపంచంలో 514 రకాల భయాలు ఉండగా.. అందులో ప్రథమ స్థానంలో పబ్లిక్‌ స్పీచ్‌ నిలిచింది. రెండో స్థానంలో మరణం ఉందని అమెరికాకు చెందిన పలు సర్వే సంస్థలు తెలియజేస్తున్నాయి. 

నలుగురిలో ప్రసంగించాలంటే.. మనసులో ఏదో తెలియని భయం. మైక్‌ పట్టుకున్న చేతికి వణుకు మొదలవుతుంది. వీటిని అధిగమించిన వారికే ఏ రంగంలోనైనా ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. మనలో చాలా మందికి ఎన్నో చెప్పాలని మనసులో ఉంటుంది. అయితే బయటకు చెప్పడానికి మాటలు రావడంలేదు అంటారు. అధికారం కోసం రాజకీయ నాయకులు, ఉద్యోగం, పదోన్నతి కోసం ఇంటర్వ్యూను ఎదుర్కొనాల్సిన అభ్యర్థులు, విద్యార్థులు, తమ ఉత్పత్తులను మార్కెటింగ్‌ చేసుకోవడంలో వ్యాపార సంస్థలు, తాను తీసుకున్న కేసును గెలిపించడం కోసం న్యాయవాది తదితర రంగాల్లోని వ్యక్తులకు వాక్చాతుర్యం ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. ఇటువంటి వారిలో అవసరమైన వారికి మాటలు నేరి్పంచడానికి నగరంలో పదుల సంఖ్యలో శిక్షణ కేంద్రాలు ఏర్పాటవుతున్నాయి. ఏ రంగంలోని వారికైనా సమయం, సందర్భానుసారం మాట్లాడే మెళకువలు నేర్పిస్తామంటున్నారు. 

ఆ భయం ఎందుకు? 
వేదికపై మైక్‌ పట్టుకుని మాట్లాడాలంటే భయంతో కాళ్లు చేతులు ఎందుకు వణుకుతున్నాయి. నలుగురిలో మాట్లాడాలంటే మాట ఎందుకు తడబడుతోంది. మనసులోని భావాన్ని చెప్పడంలో వెనుకాడటానికి కారణం.. ఇలా ఎన్నో ప్రశ్నలకు అనుభవం లేకపోవడం, సిగ్గు, బిడియం మొదలైనవి కారణాలుగా కనిపిస్తున్నాయి. ఈ కారణాలే మాటల తడబాటుకు కారణాలట. ఒక్కోసారి నలుగురిలో నవ్వులపాలవుతున్నారు. ఆ భయం పోవాలంటే ఏం చేయాలనే అంశాలపై ఫోకస్‌ చేస్తున్నారు. బృందాలుగా ఏర్పాటు చేసి ఒక అంశంపై చర్చలు పెడుతున్నారు. మైక్‌ పట్టుకుని తనకు నచి్చన అంశంపై ధారాళంగా మాట్లాడాలని ఆహా్వనిస్తున్నారు. మనసులో మాటను స్వేచ్ఛగా ప్రకటించేందుకు అవసరమైన టిప్స్‌ ఇస్తున్నారు. నాలుగు రోజుల నుంచి 10 రోజుల పాటు శిక్షణ ఇస్తున్నారు. దీనికి రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకూ ఫీజు తీసుకుంటున్నారు.

ఆకట్టుకున్నవారికే అందలం..
మాట్లాడే సబ్జెక్ట్‌పై పట్టుండాలి. చెప్పే మాటల్లో కొత్తదనం కనిపించాలి. మాట్లాడే సమయంలో హావభావాలు, శారీరక కదలికలు ఇతరులను ఆకర్షించాలి. మన మాటలకు ఎదుటి వ్యక్తి ఫీలింగ్స్‌ పసిగట్టాలి. సందర్భానుసారం అందరినీ ఆకట్టుకునేందుకు ప్రయతి్నంచాలి. ఈ అంశాల్లో పట్టున్న వారిని మాత్రమే ప్రజలు ఆదరిస్తారు. నాయకుడనే కిరీటం అందిస్తారు. అధికారం కట్టబెడతారు.

మాటలతోనే గుర్తింపు.. 
తొలినాళ్లలో నలుగురిలో మాట్లాడటానికి ఇబ్బందిపడాల్సి వచ్చేది. దీన్ని అధిగమించేందుకు శిక్షణ తీసుకున్నాను. ప్రొఫెషన్‌ పరంగా ఇప్పుడు వేలాది మంది ఉన్న సభల్లో డయాస్‌పై అనర్గళంగా మాట్లాడగలుగుతున్నాను. టీవీ షోల్లో పాల్గొంటున్నా. ఎదుటి వ్యక్తి ఎలా చెబితే వింటాడో మనం గుర్తించగలగాలి. మన ఆలోచనలను వరుసక్రమంలో పెట్టుకోవాలి. సందర్భానుసారం ఆకట్టుకునే విధంగా మాట్లాడితే మనకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. 
– పల్లవి, సైకాలజిస్టు, హైదరాబాద్‌

సెల్ఫ్‌ కాని్ఫడెన్స్‌ పెరిగింది.. 
పబ్లిక్‌ స్పీచ్‌ అందరికీ అవసరమే. ఉద్యోగంలో భాగంగా కాన్ఫరెన్స్‌లో మాట్లాడాల్సి ఉంటుంది. గతంలో అనుకున్నంత గొప్పగా మాట్లాడలేకపోయాననే ఆలోచన ఉండేది.  శిక్షణ తీసుకున్నప్పుడు చాల విషయాలు నేరి్పంచారు. సెల్ఫ్‌ కాని్ఫడెన్స్‌ మన కెరీర్‌కు ఎంతగానో ఉపయోగపడుతుంది. స్పీచ్‌కి సబ్జెక్ట్‌ ఎంత ముఖ్యమో.. ఆరంభం, ముగింపు రెండూ అంతే ముఖ్యం. 
– కిరణ్‌రెడ్డి, పోలీసు పీఆర్‌ఓ, 
సైబరాబాద్‌

మాటలు వెనక్కి వచ్చేవి.. 
నాకు కమ్యూనికేషన్‌ ఫీల్డ్‌ అంటే ఇష్టం. పది మందిలో మాట్లాడాలంటే నా మనసులో మాటలు వెనక్కి వచ్చేవి. ట్రైనింగ్‌లో చేరినప్పుడు ఎలా ఉంటుందోనని భయపడ్డాను. లెక్చర్‌ ఇస్తారని ఊహించుకున్నాను. ఇక్కడ ప్రాక్టికల్‌గా నేరి్పస్తున్నారు. మైక్‌ ముందు ఐదు నిమిషాలు మాట్లాడితే బోలెడు తప్పులుండేవి. వాటిని సరిదిద్దుకుంటున్నా. పది నిమిషాలు మాట్లాడగలుగుతున్నాను. 
– సింధుశ్రీ, విద్యారి్థని

అవకాశాలు కోల్పోతున్నారు.. 
ఆకట్టుకునే విధంగా మాట్లాడటం తెలియక చాలామంది అవకాశాలు కోల్పోతున్నారు. 15 ఏళ్ల విద్యార్థి నుంచి 70 ఏళ్ల వయసు వారికీ వాక్చాతుర్యం అవసరం. స్కిల్‌ అనేది జీవితాంతం ఉంటుంది. ఎక్కువగా రాజకీయ నాయకులు, విద్యార్థులు, ఉద్యోగులు వస్తున్నారు. సుమారు 800 బ్యాచ్‌లలో ఐదువేల మందికిపైగా శిక్షణ 
ఇచ్చాం. శిక్షణ అనంతరం తమలో మార్పు కనిపించింది అంటున్నారు.
– దన్నారపు కల్పన, మీడియా జంక్షన్‌ డైరెక్టర్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement