Difficulties water
-
కేరళలో తెలుగోడి గోడు
కొచ్చి నుంచి సాక్షి ప్రతినిధి: కేరళ వరద విలయానికి అక్కడ నివసిస్తోన్న వందలాది మంది తెలుగు ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. కేరళ వ్యాప్తంగా వేలాది మంది తెలుగువారు ఉండగా.. ఒక్క కొచ్చిలోని ఏలూర్ కాలనీలో 400 నుంచి 450 తెలుగు కుటుంబాలు నివసిస్తున్నాయి. ఎన్నో ఏళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల నుంచి వారంతా అక్కడికి వలస పోయారు. గత వారం కురిసిన భారీ వర్షాలకు వరద చుట్టుముట్టడంతో వారు తీవ్ర అవస్థలు పడుతున్నారు. దాదాపు 50 నుంచి 100 తెలుగు కుటుంబాలపై వర్షాలు, వరదలు తీవ్ర ప్రభావం చూపాయి. అనేక ఇళ్లు మునిగిపోవడంతో సామాన్లు పనికిరాకుండా పోయాయి. వారంతా కట్టుబట్టలతో మిగిలారు. 3 రోజుల పాటు సహాయ శిబిరాల్లో తలదాచుకుని ఇప్పుడిప్పుడే ఇళ్లకు చేరుకుంటున్నారు.అయితే రెండడుగుల మేర బురద పేరుకుపోవడంతో ఇళ్లను శుభ్రం చేసుకునే పనిలో పడ్డారు. మొత్తం వస్తువులన్నీ పాడవడంతో మళ్లీ కొత్త జీవితం ప్రారంభించాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు, వరదల వల్ల ఒక్కో కుటుంబానికి లక్ష నుంచి రెండు లక్షల వరకు నష్టం వాటిల్లిందని కొచ్చి తెలుగు సంఘం నేత నాయుడు చెప్పారు. చిత్తూరు జిల్లాకు చెందిన ఆయన స్థానిక ఫ్యాక్ట్ కంపెనీలో చిన్న కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నారు. సొంత రాష్ట్రానికి దూరంగా ఉండటం, స్థానిక ప్రభుత్వం సహాయం అందే పరిస్థితి లేకపోవడంతో తాము చాలా ఇబ్బందులు పడుతున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిస్సహాయ స్థితిలో వలస కార్మికులు కొచ్చిలోని ఫ్యాక్ట్ కంపెనీ, షిప్‌యార్డుల్లో దాదాపు వెయ్యి, పదిహేను వందల మంది తెలుగువారు పని చేస్తున్నారు. వర్షాల కారణంగా పది రోజులుగా పనులు లేక రోజు గడవడం కష్టంగా మారిందని వారు వాపోతున్నారు. వీరిని ఆదుకోవడానికి కొచ్చి తెలుగు అసోసియేషన్ విరాళాల సేకరణ చేపడుతోంది. ఇక్కడి తెలుగు ప్రజల్లో చాలా మంది వలస కూలీలు కావడంతో వారికి స్థానికంగా ఎలాంటి అధికార గుర్తింపు కార్డులు లేవు. అందువల్ల ప్రభుత్వం చేస్తున్న సాయం, పరిహారం వీరికి అందే పరిస్థితి లేదు. దాంతో తెలుగు సంఘమే వీరిని ఆదుకోవడానికి నడుం కట్టింది. -
అమ్మో.. నీటి ముప్పు!
సంగారెడ్డి పట్టణానికి నీటి ముప్పు పొంచి ఉంది.. మంజీర బ్యారేజ్‌లో నీటి నిల్వలు పూర్తిగా అడుగంటడంతో తాగునీటికి తిప్పలు తప్పేలా లేవు.. మరో మూడు రోజులకు సరిపడా నీళ్లు మాత్రమే ఉన్నాయి. ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు సైతం మంజీరలో నీరు లేకపోవడంతో కష్టతరంగా మారింది. ఇదిలా ఉంటే అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవడంలో నిమగ్నమయ్యారు. - మంజీర బ్యారేజీలో అడుగంటిన నీరు - మూడు రోజులకు మాత్రమే సరిపడే దుస్థితి - సంగారెడ్డి పట్టణ ప్రజలకు తప్పని నీటి కష్టాలు - ప్రత్యామ్నాయం వైపు అధికారుల చూపు సంగారెడ్డి మున్సిపాలిటీ: మంజీర బ్యారేజీ (కల్పాగూర్ డ్యాం)లో నీటి మట్టం పూర్తిగా పడిపోయింది. బ్యారేజ్ నుంచి సంగారెడ్డి పట్టణంతో పాటు పోతిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని విద్యానగర్ తదితర కాలనీలకు తాగు నీరు సరఫరా అవుతోంది. నీటి నిల్వలు తగ్గిపోడంతో తాగునీటికి ఇబ్బందులు ఏర్పడబోతున్నాయి. మరో రెండు, మూడు రోజులకు మాత్రమే నీళ్లు సరిపోనుండటంతో.. అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఈ మేరకు పట్టణంలో ఉన్న చేతిపంపుల మరమ్మతులు, కొత్త బోర్ల తవ్వకాలు, సింగల్ఫేస్ బోరు మోటార్లను ఏర్పాటుచేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పట్టణానికి మంజీరా నీటి సరఫరా పథకం మినహా మరోమార్గం లేకపోయింది. దీంతో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలనుకున్నా మంజీరాలో నీరు లేకపోవడంతో అది సాధ్యం కాకపోవచ్చు. పట్టణంలోని వివిధ కాలనీలలో కొత్తగా బోర్లు వేస్తేనే నీటి సమస్యను కొంతమేర తీర్చవచ్చన్న ఉద్దేశంతో అధికారులున్నారు. అందుకు అనుగుణంగానే వార్డుల వారీగా అవసరమైన బోర్లకోసం ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఎగువన ఉన్న సింగూరు ప్రాజెక్టులో సైతం నీటిమట్టం కనిష్టస్థాయికి పడిపోవడంతో మంజీరకు నీరు వదిలేపరిస్థితి కనిపించడం లేదు. ఫలితంగా పట్టణ వాసులకు నీటి ఎద్దడి ఎదురవుతోంది. ఎలాగైనా సింగూరు నీటిని విడుదల చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సంగారెడ్డి మున్సిపల్ చైర్మన్ బొంగుల విజయలక్ష్మి లేఖ రాయనున్నట్లు తెలిపారు. మంజీర బ్యారేజీలో కనిష్టంగా 1.5 టీఎంసీల నీరు ఉండాల్సి ఉండగా కేవలం అర టీఎంసీకి తక్కువే ఉంది. హైదరాబాద్ నగరానికి సైతం ఇక్కడి నుంచే నీరు సరఫరా చేయాల్సి ఉంది. హైదరాబాద్‌కు సరఫరా అయ్యేందుకు ఏర్పాటు చేసిన మోటార్లు డ్యాం మధ్యలో ఉన్నందున.. నీరు ఉన్నంత వరకూ సరఫరా చేసే అవకాశం ఉంది. కాని సంగారెడ్డికి సరఫరా చేసే పంపింగ్‌కు డ్యాం చివరి భాగాన మోటార్లు ఏర్పాటు చేశారు. ఫలితంగా నీటి నిల్వలు తగ్గాగానే పట్టణానికి నీరు సరఫరా చేసే అవకాశం లేకుండా పోతోంది. రోజూ 22.22 లక్షల గ్యాలన్ల నీరు అవసరం పట్టణంలోని 31 వార్డులకు రోజూ 22.22 లక్షల గ్యాలన్ల(మిలియన్ క్యూబిక్ మీటర్) నీరు సరఫరా చేయాల్సి ఉంది. అందులో మంజీర ద్వారా 16.30 లక్షల గ్యాలన్ల నీటిని మాత్రమే సరఫరా చేస్తున్నారు. దీంతో పాటు 25 చేతిపంపులు, రెండు ట్యాంకర్ల ద్వారా 20 లక్షల గ్యాలన్ల నీరు సరఫరా చేస్తున్నారు. ప్రధానంగా పట్టణంలోని అన్ని వార్డులతో పాటు కొత్తగా విస్తరించిన కాలనీలకుసైతం మంజీర పైపులైన్లు వేశారు. ప్రస్తుతం ఉన్న డిమాండ్ కంటే 25 శాతం అదనంగా అవసరం ఉంటుంది. దీనికి తోడు మంజీర బ్యారేజీలో 1.5 టీఎంసీల నీరు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం కేవలం 0.36 మాత్రమే నీటి నిల్వ ఉంది. ఇది సంగారెడ్డి పట్టణానికి కేవలం రెండు మూడు రోజులకంటే ఎక్కువగా సరఫరా అయ్యో అవకాశం లేదు. ప్రభుత్వానికి లేఖ రాస్తాం: పట్టణానికి నీటి సమస్య తలెత్తనున్నందున ముందస్తుగా ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్టు మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మీ తెలిపారు. మంజీరలో నీటి మట్టం పడిపోవడంతో పంపింగ్ల ద్వారా నీరు రావడం లేదని అందుకు సింగూరు నుంచి నీటిని విడుదల చేయించాలని లేఖ రాయనున్నట్టు తెలిపారు. -
ఇవ్వరు.. ఇవ్వనివ్వరు!
గ్రేటర్ శివారు కాలనీలను వెంటాడుతున్న నీటి కష్టాలు * మంచినీటి సరఫరా నెట్వర్క్ విస్తరణ కోసం పథకం రూపకల్పన * రూ.36.4 కోట్లు భరించేందుకు కాలనీ వాసులు సిద్ధం * రూ.52 కోట్ల విడుదలలో ఏడాదిగా జీహెచ్ఎంసీ నిర్లక్ష్యం * జీహెచ్ఎంసీ వైఖరితో కాగితాలకే పరిమితమైన పథకం సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ నగర శివారు ప్రాంతాలకు మంచినీటి గ్రహణం పట్టుకుంది. ఏడాదిగా నిధుల విడుదలపై గ్రేట ర్ హైదరాబాద్ మున్సిపర్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో శివార్లలోని 502 కాలనీల ప్రజలు తాగునీటికి అవస్థలు పడుతున్నారు. జలమండలి ఆర్థిక కష్టాల్లో ఉండడంతో శివారు కాలనీల్లో మంచి నీటి సరఫరా నెట్వర్క్ విస్తరణ కోసం గతంలో మున్సిపల్ పరిపాలన శాఖ ఓ పథకా న్ని సిద్ధం చేసింది. నెట్వర్క్ విస్తరణ వ్యయం లో కొంత భరించేందుకు కాలనీవాసులు ముం దుకొస్తే.. మిగతా మొత్తాన్ని జీహెచ్ఎంసీ భరించాలని నిర్ణయించారు. బల్దియాకు ఏటా వసూలయ్యే ఆస్తి పన్ను నుంచి ఈ నిధులను కేటాయించాలని నిర్దేశించారు. ఇక్కడి వరకూ బాగానే ఉన్నా.. జీహెచ్ఎంసీ అధికారుల మొండివైఖరితో ఈ పథకం ఏడాదిగా కాగితాల్లోనే మగ్గుతోంది. తమ వాటా మొత్తం రూ.36.4 కోట్లు చెల్లిస్తామని శివార్లలోని సుమారు 502 కాలనీల వాసులు జీహెచ్ఎంసీ సర్కిల్, జలమండలి కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ఫలితం కనిపించడం లేదు. తమ వాటాగా విడుదల చేయాల్సిన రూ. 52 కోట్ల విషయంలో జీహెచ్ఎంసీ అధికారులు ఏడాదిగా స్పందించడం లేదు. పైప్‌లైన్ నెట్వర్క్ ఏదీ? ప్రస్తుతం కృష్ణా, మంజీర, సింగూరు, జంట జలాశయాలు హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌ల నుంచి నిత్యం 365 మిలియన్ గ్యాలన్ల నీటిని నగరంలోని 8.65 లక్షల నల్లాలకు జలమండలి సరఫరా చేస్తోంది. త్వరలో కృష్ణా మూడోదశ ద్వారా 90 మిలియన్ గ్యాలన్ల నీటితో పాటు, గోదావరి మంచినీటి పథకం మొదటి దశ ద్వారా మరో 172 మిలియన్ గ్యాలన్ల జలాలు సిటీకి రానున్నాయి. కానీ ఈ నీటిని నగరవ్యాప్తంగా ఉన్న కాలనీలు, బస్తీలకు సరఫరా చేసేందుకు అవసరమైన పైప్లైన్లు, స్టోరేజి రిజర్వాయర్లు లేకపోవడంతో ‘అందరికీ తాగునీరు’ అన్న నినాదం అటకెక్కుతోంది. మున్సిపల్కార్పొరేషన్దే బాధ్యత గ్రేటర్ శివార్లలోని అన్ని కాలనీలకు మంచినీటి సదుపాయం కల్పించాల్సిన బాధ్యత మున్సిపల్కార్పొరేషన్దే. ఇంటింటికీ నల్లా అని ప్రచారం చేస్తున్న ప్రభుత్వ పెద్దలు.. నిధులు భరించేందుకు ముందుకొచ్చిన కాలనీల్లో తక్షణం తాగునీటి నెట్వర్క్ ఏర్పాటు చేసి ఇంటింటికీ నల్లా కనెక్షన్లు ఇవ్వాలి. - ప్రొ. డి.నరసింహారెడ్డి, చేతనా సొసైటీ ఫర్ వాటర్ చీఫ్ మెంటార్