ఇవ్వరు.. ఇవ్వనివ్వరు!
గ్రేటర్ శివారు కాలనీలను వెంటాడుతున్న నీటి కష్టాలు
* మంచినీటి సరఫరా నెట్‌వర్క్ విస్తరణ కోసం పథకం రూపకల్పన
* రూ.36.4 కోట్లు భరించేందుకు కాలనీ వాసులు సిద్ధం
* రూ.52 కోట్ల విడుదలలో ఏడాదిగా జీహెచ్‌ఎంసీ నిర్లక్ష్యం
* జీహెచ్‌ఎంసీ వైఖరితో కాగితాలకే పరిమితమైన పథకం
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ నగర శివారు ప్రాంతాలకు మంచినీటి గ్రహణం పట్టుకుంది.
ఏడాదిగా నిధుల విడుదలపై గ్రేట ర్ హైదరాబాద్ మున్సిపర్ కార్పొరేషన్(జీహెచ్‌ఎంసీ) నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో శివార్లలోని 502 కాలనీల ప్రజలు తాగునీటికి అవస్థలు పడుతున్నారు. జలమండలి ఆర్థిక కష్టాల్లో ఉండడంతో శివారు కాలనీల్లో మంచి నీటి సరఫరా నెట్‌వర్క్ విస్తరణ కోసం గతంలో మున్సిపల్ పరిపాలన శాఖ ఓ పథకా న్ని సిద్ధం చేసింది. నెట్‌వర్క్ విస్తరణ వ్యయం లో కొంత భరించేందుకు కాలనీవాసులు ముం దుకొస్తే.. మిగతా మొత్తాన్ని జీహెచ్‌ఎంసీ భరించాలని నిర్ణయించారు.
బల్దియాకు ఏటా వసూలయ్యే ఆస్తి పన్ను నుంచి ఈ నిధులను కేటాయించాలని నిర్దేశించారు. ఇక్కడి వరకూ బాగానే ఉన్నా.. జీహెచ్‌ఎంసీ అధికారుల మొండివైఖరితో ఈ పథకం ఏడాదిగా కాగితాల్లోనే మగ్గుతోంది. తమ వాటా మొత్తం రూ.36.4 కోట్లు చెల్లిస్తామని శివార్లలోని సుమారు 502 కాలనీల వాసులు జీహెచ్‌ఎంసీ సర్కిల్, జలమండలి కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ఫలితం కనిపించడం లేదు. తమ వాటాగా విడుదల చేయాల్సిన రూ. 52 కోట్ల విషయంలో జీహెచ్‌ఎంసీ అధికారులు ఏడాదిగా స్పందించడం లేదు.
పైప్‌లైన్ నెట్‌వర్క్ ఏదీ?
ప్రస్తుతం కృష్ణా, మంజీర, సింగూరు, జంట జలాశయాలు హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌ల నుంచి నిత్యం 365 మిలియన్ గ్యాలన్ల నీటిని నగరంలోని 8.65 లక్షల నల్లాలకు జలమండలి సరఫరా చేస్తోంది. త్వరలో కృష్ణా మూడోదశ ద్వారా 90 మిలియన్ గ్యాలన్ల నీటితో పాటు, గోదావరి మంచినీటి పథకం మొదటి దశ ద్వారా మరో 172 మిలియన్ గ్యాలన్ల జలాలు సిటీకి రానున్నాయి. కానీ ఈ నీటిని నగరవ్యాప్తంగా ఉన్న కాలనీలు, బస్తీలకు సరఫరా చేసేందుకు అవసరమైన పైప్‌లైన్లు, స్టోరేజి రిజర్వాయర్లు లేకపోవడంతో ‘అందరికీ తాగునీరు’ అన్న నినాదం అటకెక్కుతోంది.
మున్సిపల్‌కార్పొరేషన్‌దే బాధ్యత
గ్రేటర్ శివార్లలోని అన్ని కాలనీలకు మంచినీటి సదుపాయం కల్పించాల్సిన బాధ్యత మున్సిపల్‌కార్పొరేషన్‌దే. ఇంటింటికీ నల్లా అని ప్రచారం చేస్తున్న ప్రభుత్వ పెద్దలు.. నిధులు భరించేందుకు ముందుకొచ్చిన కాలనీల్లో తక్షణం తాగునీటి నెట్‌వర్క్ ఏర్పాటు చేసి ఇంటింటికీ నల్లా కనెక్షన్లు ఇవ్వాలి.
- ప్రొ. డి.నరసింహారెడ్డి, చేతనా సొసైటీ ఫర్ వాటర్ చీఫ్ మెంటార్