సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ :
గోదావరి, మంజీర నదుల పరీవాహక ప్రాం తాలతోపాటు వాగులు వంకలు ఇసుక వ్యాపారులకు అడ్డాలుగా మారాయి. వీరు ఇక్కడి నుంచి ఇసుకను తోడి జిల్లాలోని పలు ప్రాంతాలతోపాటు పక్క జిల్లా లు, హైదరాబాద్‌కు అక్రమంగా రవాణా చేసి కోట్లాది రూపాయలు దండుకుంటున్నారు. పట్టా భూముల్లోని ఇసుకను తీసేందుకు అనుమతి ఉండడంతో.. దీనిని ఆసరా చేసుకొని యథేచ్ఛ గా ఇసుక దందాను నడుపుతున్నారు. జిల్లాలో 22 కేంద్రాల నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. మంత్రి సుదర్శన్‌రెడ్డి నియోజకవర్గంలోని బోధన్, రెంజల్ మండలాలనుంచి వందలాది లారీల ఇసుక హైదరాబాద్ తదితర ప్రాంతాలకు తరలుతోంది. బోధన్ నియోజకవర్గంలోని పన్నెండు ప్రాంతాలు, కామారెడ్డి నియోజకవర్గంలోని మూడు, బాల్కొండ నియోజకవర్గంలోని రెండు, జుక్కల్, బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని ఐదు ప్రాంతాల నుంచి ఇసుకను ట్రాక్టర్లు, లారీల ద్వారా వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారు. రాత్రి వేళలో ఈ దందాను సాగిస్తున్నారు. ప్రాంతాలనుబట్టి ట్రాక్టర్ ఇసుకకు * 1,400 నుంచి * 2,000ల వరకు, లారీ ఇసుకకు * 14 వేల నుంచి * 20 వేల వరకు విక్రయిస్తున్నారు.
అడ్డాలివే..
బోధన్ మండలంలోని మంజీర నది ఒడ్డున ఉన్న మందర్నాతో పాటు హున్సా, ఖాజాపూర్, సాలూరా, కల్దుర్కి, సిద్ధాపూర్ గ్రామాలు.. పసుపు వాగు పరిసర గ్రామాలైన పెగడాపల్లి, కొప్పర్గ, హంగర్గ ఇసుక అక్రమ రవాణాకు కేంద్రాలుగా మారాయి. కొన్ని గ్రామాల్లో ఇసుక రవాణా కోసమే ట్రాక్టర్లు కొనుగోలు చేశారు. రెంజల్ మండలంలోని కందకుర్తి, నీలా, సాటాపూర్ గ్రామాల్లో ఇసుక దందా సాగుతోంది. దీని కోసం 70 టిప్పర్లు వినియోగిస్తున్నారు. ఇక్కడ రాజకీయ నాయకులు తెరవెనక ఉండి దందా సాగిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఒక్కో టిప్పర్ యజమాని నెలకు * 3 వేల చొప్పున అధికారులకు చెల్లిస్తున్నట్లు సమాచారం. వీరు ఎడపల్లి, నవీపేట, మాక్లూర్, నందిపేట, బోధన్ పోలీసులకూ డబ్బులు ముట్టచెబుతున్నట్టు తెలుస్తోంది.
బిచ్కుంద మండలంలోని పుల్కల్, గుండెనెమ్లి గ్రామాల్లో, బీర్కూర్ మండలంలోని బీర్కూర్, బరంగేడ్గి గ్రామాల నుంచి కాంట్రాక్టర్లు ఇసుకను తరలిస్తున్నారు. ఈ నాలుగు గ్రామాల్లోనూ రైతుల పట్టా భూమి నుంచి ఇసుకను తరలించేందుకు అనుమతులు పొందిన కాంట్రాక్టర్లు నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను తవ్వేస్తున్నారు. మంజీర నదిలోంచీ ఇసుకను తోడేస్తు అక్రమ రవాణా చేస్తూ లబ్ధిపొందుతున్నారు.
ఆర్మూర్, వేల్పూర్ ప్రాంతాలతోపాటు మోర్తాడ్ మండలం సుంకెట్, గాండ్లపేట్, తొర్తి గ్రామ కమిటీలు ఇసుక కోసం వ్యాపారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాయన్న ఆరోపణలున్నాయి. ఒక ట్రాక్టర్‌కు నెలకు * 15 వేల నుంచి * 20 వేల వరకు, టిప్పర్‌కు * 35 వేల నుంచి * 50 వేల వరకు వసూలు చేస్తున్నాయి. దోమకొండ మండలంలోని తుజాల్‌పూర్, మల్కాపూర్, యాడారం తదితర గ్రామాల సమీపంలోని వాగులనుంచి ఇసుక పెద్ద ఎత్తున తరలుతోంది. తుజాల్‌పూర్‌లో ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ల యజమానులనుంచి గ్రామ కమిటీ సభ్యులు డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి.
మామూళ్లిలా...
పలువురు అధికారులు అక్రమార్జనకు అలవాటుపడి జిల్లాలో ఇసుక అక్రమ దందాను నిరోధించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇసుకాసురులకు కొందరు రాజకీయ నాయకులు సహకరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఈ దందాకు సహకరించిన రెవెన్యూ, పోలీసు శాఖలోని పలువురు ఉద్యోగులకు 22 ప్రాంతాల నుంచి ఇసుక వ్యాపారులు లంచాలు సమర్పించుకుంటున్నారు. ట్రాక్టర్‌లో ఇసుక తరలించే వ్యాపారులు పోలీసులకు నెలకు *3.30 లక్షలు, రెవెన్యూ ఉద్యోగులకు * 4.40 లక్షలు ఇస్తున్నట్లు తెలిసింది. లారీల ద్వారా ఇసుకను తరలించేవారు నెలకు పోలీసుశాఖకు * 7.70 లక్షలు, రెవెన్యూశాఖకు * 11 లక్షలు ఇస్తున్నారని సమాచారం. ఇది కాకుండా ఇసుక క్వారీ పాయింట్లు ఉన్న పోలీసు స్టేషన్‌లతో పాటు ఇసుక రవాణా అవుతున్న స్టేషన్ల సిబ్బందికీ మామూళ్లు అందిస్తూ దందా నడిపిస్తున్నారు. కలెక్టర్ ప్రద్యుమ్న ఈ దందాపై దృష్టి సారించి, ఇసుక అక్రమ రవాణాను ఆపాలని రైతులు కోరుతున్నారు.
అక్రమంగా ఇసుక రవాణా
Published Sat, Sep 28 2013 4:47 AM | Last Updated on Tue, Oct 9 2018 4:48 PM
Advertisement
Advertisement