మంజీరకు సంకెళ్లు! | no water in nizamsagar project due to illegal check dam in karnataka | Sakshi
Sakshi News home page

మంజీరకు సంకెళ్లు!

Published Mon, Aug 11 2014 1:58 AM | Last Updated on Tue, Oct 9 2018 4:48 PM

no water in nizamsagar project due to  illegal check dam in karnataka

నిజాంసాగర్: కర్ణాటక, మహారాష్ర్టల్లో అక్రమ ప్రాజెక్టుల నిర్మాణాల వల్ల అటు గోదావరి, ఇటు మంజీర నదులకు సంకెళ్లుపడ్డాయి. మహా రాష్ట్ర సర్కారు తీరుతో గోదావరినది ఏడారిని తలపిస్తుండగా కర్ణాటక ప్రాంత సరిహద్దుల్లో అక్రమ చెక్‌డ్యామ్‌ల వల్ల మంజీర ఉపనదిలో నీటిప్రవాహపు గలగలలు కనుమరుగయ్యాయి. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నప్పటికీ తెలంగాణ రాష్ట్ర జలాశయాల్లోకి చుక్కనీరు రావడం లేదు.

మంజీర ఉపనదిపై ఉన్న సింగూరు జలాశయంతో పాటు నిజాంసాగర్ ప్రాజెక్టు నీళ్లు లేక నిరాశజనకంగా కనిపిస్తోంది. రెండు ప్రాజెక్టుల క్యాచ్‌మెంట్ ఏరియాల్లో కురుస్తున్న వర్షాలకు జలధారలు వస్తున్నాయి తప్పా పక్క రాష్ట్రాల్లో కురిసిన వర్షాలకు వరదలు రావడం లేదు. కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు కరంజా, సయిగావ్ ఆనకట్టల ద్వారా మంజీర ఉపనదిలోకి వరదలు వచ్చేవి.

ఇప్పుడు అక్కడి ప్రాజెక్టులు, ఆనకట్టలే నిండుతున్నాయి. సింగూరు జలాశయం, నిజాంసాగర్‌లోకి వరదలు రావడం లేదని నీటిపారుదల శాఖ అధికారులు విశ్లేషిస్తున్నారు. వర్షాభావ పరిస్థితుల్లో  మెదక్ జిల్లాలోని సింగూరు జలాశయంతో పాటు ఇందూరు జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు ప్రాంత రైతులు దుర్బర  పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తోంది.

 పడిపోతున్న నిజాంసాగర్ సామర్థ్యం
 నిజాం నవాబు కాలంలో 1923-31 సంవత్సరంలో నిర్మించిన నిజాం సాగర్ ప్రాజెక్టు నీటి సామర్థ్యం ఏడాదికేడాది పడిపోతోంది. మంజీర ఉప నదిపై నిర్మించిన నిజాంసాగర్ ప్రాజెక్టు ద్వారా జిల్లాలోని 11 మండలాల్లో ఉన్న 2.75 లక్షల ఎకరాలకు సాగునీరందిస్తోంది. ప్రాజెక్టు నిర్మాణ సమయంలో 1400.50 అడుగులతో 25.67 టీఎంసీలు సామర్థ్యం ఉండేది. కర్ణాటక, మహా రాష్ట్రల్లో కురిసిన భారీ వర్షాల వల్ల మంజీర నదిలో వరద నీటి ప్రవాహానికి నిజాంసాగర్ ప్రాజెక్టులోకి పూడిక మట్టి వచ్చి చే రింది.

దీంతో 1977 సంవత్సరంలో నిజాంసాగర్ ప్రాజెక్టు నీటిమట్టం 11.8 టీఎంసీలకు పడిపోయింది. నీటి మట్టం పడిపోవడంతో అప్పటి సర్కారు ప్రాజెక్టు నీటిసామర్థం్య పెంపు కోసం చర్యలు తీసుకోంది. అదే సంవత్సరంలో 4.5 టీఎంసీల సామర్థ్యాన్ని ప్రభుత్యం పెంచింది. దాంతో అప్పటి నుంచి నిజాంసాగర్ ప్రాజెక్టు నీటి మట్టం 1405 అడుగులతో 17.8 టీఎంసీల సామర్థ్యానికి చేరుకుంది. ప్రాజెక్టులో నీటిసామర్థ్యం పెరిగినా చివరి ఆయకట్టు వరకు ప్రధాన కాలువ ద్వారా సాగునీరందించడం లేదు. దాంతో చివరి ఆయకట్టు ప్రాంత రైతులు ప్రత్యామ్నాయంగా బోరుబావులపై ఆధారపడి పంటలను సాగు చేస్తున్నారు.  

 పోచారం పెంపుతో ..
 ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురిసినా మెదక్ జిల్లాలోని సింగూరు జలాశయానికి వరద నీరు పరిమితం అవుతోంది. జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టుకు మాత్రం పోచారం ప్రాజెక్టు జీవనాధారంగా ఉంది. వర్షాకాలం ఆరంభ సమయంలో కురిసిన వర్షాలకు జిల్లాలోని గాంధారి, లింగంపేట, తాడ్వాయి, నాగిరెడ్డిపేట మండలాల్లో కురిసిన వర్షాలకు వరద నీటి ప్రవాహంతో పోచారం ప్రాజెక్టు నిండుకుండలాగా మారుతోంది. అదనంగా వచ్చిన వరదనీటి  ద్వారా మంజీర ఉపనది ఉరకలేస్తోంది.

 ప్రస్తుతం పోచారం ప్రాజెక్టు కట్ట ఎత్తుపెంపుపై రాష్ట్ర బారీనీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావ్ నీటిపారుదలశాఖ అధికారులతో నిర్ణయం తీసుకున్నారు. అందువల్ల పోచారం ప్రాజెక్టులోకి వచ్చిన  అదనపు జలాలు దిగువనకు వెళ్లకుండా నిలిచిపోనున్నాయి.

 పోచారంతోనే గతేడాది నిండిన ప్రాజెక్టు
 గతేడాది జిల్లాలో కురిసిన వ ర్షాల వల్ల పోచారం ప్రాజెక్టు నీటితోనే నిజాంసాగర్ ప్రాజెక్టు నిండింది. పోచారం ప్రాజెక్టు పూర్థిస్తాయి నీటిమట్టానికి చేరుకొని పొంగిపోర్లింది. దాంతో పోచారం ప్రాజెక్టు ద్వారా 9.08 టీఎంసీల నీరు నిజాంసాగర్ ప్రాజెక్టులోకి చేరింది. పోచారం నీటితో పాటు క్యాచ్ మెంట్ ఏరియాలో నుంచి వచ్చిన నీటితో గతేడాది నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంది. పోచారం ప్రాజెక్టు కట్ట ఎత్తు పెంచితే నిజాంసాగర్ ప్రాజెక్టు నీటిముప్పు ఎదురవునుందని నీటిపారుదల శాఖ అధికారులు అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement