ఉధృతంగానే.. | heavy rains in nizamabad district | Sakshi
Sakshi News home page

ఉధృతంగానే..

Published Tue, Sep 27 2016 2:38 PM | Last Updated on Tue, Oct 9 2018 4:44 PM

ఉధృతంగానే.. - Sakshi

ఉధృతంగానే..

  ఉప్పొంగుతున్న మంజీర, గోదావరి నదులు
  ఇద్దరు మృత్యువాత
  పడగల్‌లో గల్లంతైన బాలుడి మృతదేహం లభ్యం
  జిల్లాలో 25 వేల హెక్టార్లలో దెబ్బతిన్న పంటలు
  నేడు ఎస్సారెస్పీకి రానున్న ముఖ్యమంత్రి 
  వర్షం, వరద నష్టంపై అధికారులతో సమీక్షించనున్న సీఎం
 
సాక్షిప్రతినిధి, నిజామాబాద్ : జిల్లాలో వరుణుడు జోరు తగ్గించినా వరద ఉధృతి మాత్రం ఉగ్రంగానే కొనసాగుతోంది. మంజీర, గోదావరి నదులు ఉధృతంగా పారుతున్నాయి. సోమవారం జిల్లాలో 26.3 మిల్లీ మీటర్ల సగటు వర్షపాతం నమోదయ్యింది. అత్యధికంగా ధర్పల్లిలో 7 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు జిల్లావ్యాప్తంగా 25 వేల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. ఎస్సారెస్పీ ప్రాజెక్టును వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ప్రశాంత్‌రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీ వీజీ గౌడ్ సందర్శించారు. అధికారులతో మాట్లాడి వరద ప్రభావం గురించి తెలుసుకున్నారు. ముంపు ప్రాంతాల్లో పంట నష్టం అంచనా వేసేందుకు మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి బోధన్, ఆర్మూర్, బాన్సువాడ తదితర ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి సుడిగాలి పర్యటన చేశారు. పంటనష్టంపై వెంటనే సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిస్తామని, తక్షణమే సహాయం అందేలా చూస్తామన్నారు. పీఆర్, ఆర్‌అండ్‌బీ రోడ్లు దెబ్బతిన్నాయని, మరమ్మతులకు ప్రతిపాదనల సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు. జిల్లాలో 10 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. సాలూర పునరావాస కేంద్రాన్ని జిల్లా ప్రత్యేక అధికారి అశోక్ కుమార్ సందర్శించారు. కలెక్టర్ యోగితారాణా, జేసీ రవీందర్‌రెడ్డి, అధికార యంత్రాంగం పనితీరును మెచ్చుకున్నారు. కలెక్టర్ నేతృత్వంలో అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ అవసరమైన సహాయ చర్యలు చేపట్టారంటూ అభినందించారు. 
 
బోధన్ మండలంలోని సాలూర వద్ద గల మంజీర నది పాత వంతెనపై నుంచి వరద నీరు ఉప్పొంగి ప్రవహిస్తోంది. మందర్న, హున్సా, ఖాజాపూర్, తగ్గెల్లి గ్రామ శివార్లలోని పంటలు నీట మునిగాయి. ముందస్తుగా సాలూర గ్రామ ప్రాథమిక పాఠశాలలో పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు. 
 
తుంగవాగులో ఇద్దరి మృతదేహాలు లభ్యం
సదాశివనగర్‌లో తుంగవాగులో పడి ఇద్దరు యువకులు మరణించారు. ఈ సంఘటన మూడు రోజుల తర్వాత వెలుగు చూసింది. సదాశివనగర్‌కు చెందిన కోతి విష్ణువర్ధన్ రెడ్డి(21), పోలబోయిన రంజిత్‌కుమార్(23) గిద్దలో ఉన్న బంధువుల వద్దకు వెళ్లి శనివారం రాత్రి బైక్‌పై తిరిగి వస్తూ సదాశివనగర్ శివారులోని తుంగవాగులో ప్రమాదవశాత్తూ కొట్టుకుపోయారు. వారి మృతదేహాలు సోమవారం కనిపించాయి.  
 
దెబ్బతిన్న ఇళ్లు..
కోటగిరి మండలంలో 18 ఇళ్లు పూర్తిగా, 55 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. వర్ని మండలంలో ఏడు ఇళ్లు పూర్తిగా, 74 ఇళ్లు పాక్షికంగా, బీర్కూర్ మండలంలో రెండు ఇళ్లు పూర్తిగా, 29 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. బోధన్ మండలంలోని సాలూర వద్ద గల మంజీర నది పాత వంతెనపై నుంచి వరద నీరు ఉప్పొంగి ప్రవహిస్తోంది .మందర్న, హున్సా, ఖాజాపూర్, తగ్గెల్లి గ్రామ శివార్లలోని పంటలు నీటమునిగాయి. సోయా, చెరుకు, వరి పంటలు నీటమునిగాయి. వరదల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండి పరిస్థితిని సమీక్షిస్తోంది. ఆదివారం రాత్రి గ్రామంలో తహసీల్దారు, రెవెన్యూ, పోలీసు శాఖల సిబ్బంది పర్యటించారు. ముందస్తుగా సాలూర గ్రామ ప్రాథమిక పాఠశాలలో పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు. ప్రజలను ఆదివారం అర్ధరాత్రి నుంచే పునరావాస కేంద్రానికి ఆర్టీసీ బస్సుల్లో తరలించారు. సుమారు 200 మంది వరకు ఇక్కడ ఆశ్రయం పొందుతున్నారు.
 
సాలూర ప్రాథమిక పాఠశాల పునరావాస కేంద్రంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. భోజన వసతి, తాగు నీటి సౌకర్యం కల్పించారు. బోధన్ మండలంలోని హున్పా, మందర్న , ఖాజాపూర్ గ్రామాల ప్రత్యేక అధికారి, స్టెప్ సీఈవో ఉపేందర్‌రెడ్డి, ఆర్డీవో సుధాకర్‌రెడ్డి, తహసీల్దార్ వినోద్ కుమార్, టౌన్ సీఐ వెంకన్న, ఎస్సై ప్రభాకర్, రెవెన్యూ, పోలీసు సిబ్బంది సమన్వయంతో మూడు గ్రామాల్లో వరద పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. రెంజల్ మండలంలోని కందకుర్తి వద్ద గల త్రివేణి సంగమ క్షేత్రం వద్ద గోదావరి నదిలో మంజీర నది వరద నీటితో ఉప్పొంగి ప్రవహిస్తోంది. కందకుర్తి శివారులో 1,500 ఎకరాలలోని సోయా, పత్తి, పొగాకు పంటలు నీట మునిగాయి. గోదావరి తీరంలో రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు, సిబ్బంది వరద పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. నవీపేట మండలంలోని బినోల గ్రామంలో పెద్ద చెరువు కట్ట మళ్లీ కోతకు గురైంది. నీళ్లు వృథాగాపోతున్నాయి.
 
బాన్సువాడ దిగువన ఉన్న మంజీర నది ఉధృతంగా ప్రవహిస్తోంది. భారీ వరదల కారణంగా బాన్సువాడ నియోజకవర్గంలోని పలు చెరువులు, కుంటల కట్టలు ప్రమాదకరంగా మారాయి. చెరువు కట్టలు తెగిపోయే ప్రమాదం ఉండడంతో రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
 
ఆర్మూర్ నియోజకవర్గంలో వర్షం తగ్గుముఖం పట్టింది. సోమవారం వర్షం కురవ లేదు. మాక్లూర్ మండలంలోని అమ్రాద్ వద్ద, ఆర్మూర్ మండలం రాంపూర్‌లో కాలువలకు పడిన గండ్లను మంత్రి పోచారం, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి పరిశీలించారు. ఆర్మూర్ పట్టణంలోని గూండ్ల చెరువులో పూజలు చేశారు. అధికారులు నష్టాన్ని అంచనా వేస్తున్నారు. 
 
 బాల్కొండ నియోజక వర్గంలోని మోర్తాడ్  కమ్మర్‌పల్లి, బాల్కొండ, వేల్పూర్, భీమ్‌గల్ మండలాల్లో సోయా పంట పూర్తిగా తడిసి ముద్దఅయ్యింది. పంటకు చేనులోనే మొలకలు వచ్చాయి. పంట ఎంత మాత్రం పనికిరాకుండా పోతుంది. రైతులు ప్రైవేటుగా కొనుగోలు చేసిన సీడ్ వల్లనే నష్టం ఏర్పడింది. చెరువులు, కుంటలు పూర్తిగా నిండాయి, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి గోదావరి నదిలోకి నీటి విడుదల కొనసాగుతుంది. పెద్దవాగు ప్రవాహం జోరుగా ఉంది.
 
నిజామాబాద్‌రూరల్ నియోజకవర్గంలో సోమవారం సాధారణ వర్షపాతం నమోదైంది. డిచ్‌పల్లి మండలం ఘన్‌పూర్ రాజేశ్వర్ చెరువు కట్ట కోతకు గురైంది. ఇసుక బస్తాలు వేసి మరమ్మతులు చేశారు. జక్రాన్‌పల్లి, సిరికొండ మండలాల్లో పంటలు నీటిలోనే ఉన్నాయి. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో భారీ వర్షాలు, వరదలకు వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. పోచారం ప్రాజెక్టులోకి 29 వేల క్యూసెక్కుల వరద వస్తోంది. బోధన్-హైదరాబాద్ రోడ్డుపై నీరు అలాగే ఉండడంతో రాకపోకలు సాగడం లేదు. వరద నష్టాలను అధికారులు అంచనా వేశారు.
 
ముఖ్యమంత్రి రాక నేపథ్యంలో..
ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం జిల్లాకు రానున్నారు. నాలుగైదు రోజులు గా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలతో జిల్లాలో ప్రాజెక్టులు నిండుకుండలా మారగా.. చెరువులు, కుంటలు నిండిపోయాయి. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి ఇంకా నాలుగు లక్షల క్యూసెక్కుల వరకు ఇన్‌ఫ్లో వచ్చి చేరుతుండగా.. 41 వరద గేట్ల ద్వారా రెండు లక్షల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. అలాగే నిజాంసాగర్ తదతర ప్రాజెక్టులు సైతం నిండిపోయాయి. నాలుగైదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చాలాచోట్ల పంటలు, ఇళ్లు, రోడ్లు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం 11 గంటలకు సీఎం కేసీఆర్ జిల్లాకు రానున్నారని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కలెక్టరేట్‌కు సోమవారం రాత్రి సమాచారం అందింది. దీంతో అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసిన కలెక్టర్ యోగితారాణా.. అనంతరం ఎస్పీ విశ్వప్రసాద్, జాయింట్ కలెక్టర్ రవీందర్ రెడ్డి, ఆర్‌అండ్‌బీ, పీఆర్, వైద్య ఆరోగ్యశాఖల అధికారులతో కలిసి సోమవారం రాత్రి పోచంపాడ్ వెళ్లి, హెలిపాడ్ స్థలాన్ని, ఏర్పాట్లను పరిశీలించారు.
 
ఇదే సమయంలో సీఎం కేసీఆర్ నిజాంసాగర్ ప్రాజెక్టును కూడా సందర్శిస్తారన్న సమాచారం మేరకు మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధికారులతో కలిసి సోమవారం రాత్రి నిజాంసాగర్ వెళ్లి, హెలిపాడ్ ఏర్పాట్లను పరిశీలించారు. నూటికి నూరు శాతం వాతావరణం అనుకూలిస్తే హెలికాప్టర్ ద్వారానే సీఎం కేసీఆర్ జిల్లాకు రానున్నారని, లేదంటే రోడ్డుమార్గంలోనైనా వస్తారని అధికారవర్గాల ద్వారా తెలిసింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టును సందర్శించిన అనంతరం సీఎం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement