బోరున మంజీర | water draft for manjeera | Sakshi
Sakshi News home page

బోరున మంజీర

Published Fri, Dec 4 2015 12:05 AM | Last Updated on Tue, Oct 9 2018 4:44 PM

బోరున మంజీర - Sakshi

బోరున మంజీర

నీటి కోసం  భగీరథ యత్నం
 వట్టిపోయిన నదిలో బోర్ల డ్రిల్లింగ్
 12 బోర్లు.. ఓ బావి తవ్వకం
 ఎప్పుడూ ఏర్పడని దుర్భర స్థితి
 మున్ముందు గడ్డుకాలమే..

 తాగునీటి కోసం జనం విలవిల్లాడుతున్నారు. రాత్రనక, పగలనక బోరుబావుల వద్ద పడిగాపులుకాస్తున్నారు. నడి వేసవిలోనూ ఏర్పడని దుర్భర పరిస్థితులు నేడు నెలకొన్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే.. మున్ముందు వేసవిని తలచుకుని పల్లె ప్రజలు భీతిల్లుతున్నారు. కాగా ప్రత్యామ్నాయ ఏర్పాట్ల కోసం అధికారులు ప్రయత్నిస్తున్నారు. గతానికి భిన్నంగా నదిలో బోర్లు, బావుల తవ్వకాన్ని చేపడుతున్నారు.
 
 నారాయణఖేడ్: ఖేడ్ నియోజకవర్గం దాదాపు మంజీర నదిపైనే ఆధారపడి ఉంది. జహీరాబాద్, అందోల్, సంగారెడ్డి నియోజకవర్గాలకు సైతం మంజీర నదినుంచే నీటి సరఫరా జరుగుతోంది. మనూరు మండలం గౌడ్‌గాం జన్‌వాడ వద్ద జిల్లాలోకి ప్రవేశిస్తున్న మంజీర నది జిల్లాలో అత్యధికంగా ఖేడ్ నియోజకవర్గంలోనే 40 కిలోమీటర్ల మేర ప్రవహిస్తుంది.
 
 జహీరాబాద్, అందోల్ నియోజకవర్గాల్లో మంచినీటి పథకాలు, ఇన్‌టెక్‌వెల్‌లు సైతం ఈ నియోజకవర్గం సమీపంలోనే నిర్మించారు. ఖేడ్ గ్రామాలకు మంజీర నీటిని సరఫరా చేసేందుకు పలు పథకాలు నదిపై నిర్మించారు. నాబార్డు ఆర్థిక సహాయంతో 13 ఏళ్ళ క్రితం రూ.14 కోట్ల వ్యయంతో గూడూరు వద్ద 74 గ్రామాలకు తాగునీటిని సరఫరా చేసేందుకు పథకాన్ని నిర్మించారు. ఎన్‌ఏపీ పథకం ద్వారా బోరంచ నుంచి 28 గ్రామాలకు, ఇదే ప్రాంతం నుంచి ఫేస్-1 కింద 32 గ్రామాలకు, శాపూర్ పథకం ద్వారా 24 గ్రామాలకు తాగునీటి సరఫరా జరుగుతోంది. పెద్దశంకరంపేటలో ఇటీవల పథకాన్ని ప్రారంభించారు.

 ఎండిన నది.. అందని నీరు
 మంజీర నది పూర్తిగా ఎండిపోయింది. ఫలితంగా పథకాల ద్వారా నీటిని సరఫరా చేయడం ఇబ్బందికరంగా పరిణమించింది. నెల క్రితం నుంచే పరిస్థితి దారుణంగా ఉండడంతో అధికారులు ఇన్‌టెక్‌వెల్ వరకు కాల్వలు తీయడం, పైపులు వేయడం తదితర ఏర్పాట్ల ద్వారా నీటిని పంపింగ్ చేశారు. ప్రస్తుతం మరీ గడ్డు పరిస్థితి ఏర్పడింది. దీంతో నీటి పథకాలు వట్టిపోవడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు.  
 
 నదిలో బోర్లు.. బావులు...
 వేసవిలో ఎండలు మండినా, నది ఎండుదశ పట్టినా మంచినీటి పథకాలకు ఇప్పుడున్నంత దుర్గతి ఎన్నడూ ఏర్పడలేదు. ఫలితంగా మంచినీటి పథకాల ఇన్‌టెక్‌వెల్‌లకు నీరు అందని పరిస్థితి ఉంది. దీంతో చేసేది లేక ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు నదిలో బోర్లు, బావుల తవ్వకాలకు నడుం బిగించారు. శాపూర్ ఇన్‌టెక్‌వెల్ సమీపంలో 6 బోర్లను అధికారులు డ్రిల్లింగ్ చేశారు. ఇందులో రెండు బోర్లు ఫేయిల్ అవగా, నాలుగు బోర్లలో నీరుపడింది. గుడూరు ఇన్‌టెక్‌వెల్ సమీపంలో 6 బోర్లను తవ్వగా నాలుగు బోర్లలో నీరు పడగా రెండు బోర్లు ఫెయిల్ అయ్యాయి. ఇదే పథకం వద్ద పెద్ద బావిని అధికారులు తవ్వించారు. 9 ఫీట్ల లోతు, 30 మీటర్ల వెడల్పుతో బావిని తవ్వారు.
 
 ఈ బావిని మరింత వెడల్పు, లోతుగా తవ్వేందుకు ఆలోచిస్తున్నామని ఆర్‌డబ్ల్యూఎస్ డిప్యూటీ ఈఈ రాజరత్నం ‘సాక్షి’కి తెలిపారు. శాపూర్‌వద్ద సైతం ఓ బావిని తవ్వేందుకు యోచిస్తున్నామని, ఈ ప్రాంతంలో బండ ఉందని, ఏ ప్రాంతంలో తవ్వాలనే అంశంపై ఆలోచిస్తున్నామన్నారు. కాగా అధికారులు తవ్విన బోర్లు, బావుల్లో ఊరిన నీటిని ఇన్‌టెక్‌వెల్‌ల ద్వారా గ్రామాలకు పంపింగ్ చేయనున్నారు. భూగర్భజలాలు పడిపోతున్న తరుణంలో బోర్లు నడివేసవిలో ఇబ్బందులు కలిగిస్తే పరిస్థితి ఏమిటని తలచుకొని అధికారులు ఆందోళన చెందుతున్నారు. నదిలోనే కొన్ని బోర్లు ఫెయిల్ అవుతుండడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ఇదిలా ఉండగా గూడూరు ఇన్‌టెక్‌వెల్ నుంచి బోర్లు, బావి నీటి ద్వారా నీటి పంపింగ్ జరిగితే 6 గంటలకు మించి నడవడంలేదు.   నీటి పథకాల వద్ద ఇప్పడే పరిస్థితి ఇలా ఉంటే మున్ముందు ఏమిటన్న ఆందోళన అధికారుల్లో నెలకొంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement