ప్రాజెక్టులు వెలవెలబోతున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా ప్రస్తుతం సింగూరు, మంజీర జలాశయాలు డెడ్‌స్టోరేజీకి చేరుకున్నాయి. నల్లవాగు, ఘనపురం ఆనకట్టల్లోనూ అదే దుస్థితి నెలకొంది. ఈసారైనా ఖరీఫ్‌లో సాగు చేసి కష్టాలనుంచి గట్టెక్కుదామనుకున్న రైతన్న ఆశలు ఆవిరవుతున్నాయి. ఎగువప్రాంతమైన కర్ణాటక, జిల్లాలో సమృద్ధిగా వర్షాలు కురిస్తేనే మంజీర నదిలోకి నీళ్లు వచ్చి దిగువన పంటలకు, తాగునీటికి నీళ్లు అందే అవకాశం ఉంది.
సాక్షి, సంగారెడ్డి : మంజీర నదిపై నిర్మించిన సింగూరు ప్రాజెక్టు సిన్నబోతోంది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 29 టీఎంసీలు. ప్రస్తుతం 4.5 టీఎంసీ నీళ్లే ఉన్నాయి. మరో 0.5 టీఎంసీల నీటి మట్టం తగ్గితే ప్రాజెక్టు డెడ్‌స్టోరేజీకి చేరుకుంటుంది. సింగూరు ప్రాజెక్టు నుంచి ఘనపురం ఆనకట్టకు 4.06, నిజాంసాగర్ ప్రాజెక్టుకు 8.35 టీఎంసీల సాగునీరు కేటాయింపులు ఉన్నాయి. ఖరీఫ్‌లో సింగూరు ప్రాజెక్టు నుంచి ఘనపురం, నిజాంసాగర్ ప్రాజెక్టులకు విడతల వారీగా సాగునీరు విడుదల చేస్తారు. అయితే ప్రస్తుతం ప్రాజెక్టుల్లో నీళ్లు లేకపోవటంతో ఘనపురం, నిజాంసాగర్ ప్రాజెక్టు కింద ఖరీఫ్‌లో రైతులకు సాగునీరు విడుదల చేసే అవకాశాలు కనిపించటంలేదు.
ప్రాజెక్టు ఎగువభాగమైన కర్ణాటక, ఇక్కడ వర్షాలు కురిస్తేనే సింగూరు ప్రాజెక్టు నిండే పరిస్థితి కనిపిస్తోంది. ఇదిలా ఉంటే మంజీర డ్యామ్‌లో సైతం నీళ్లు లేవు. మంజీర పూర్తిస్థాయి నీటిమట్టం 1,645 మీటర్లు కాగా ప్రస్తుతం 501.37 మీటర్ల నీళ్లు మాత్రమే ఉన్నాయి. మంజీర సైతం డెడ్‌స్టోరేజీ లెవల్‌కు సమీపంలో ఉంది. సింగూరు, మంజీర ద్వారా జంటనగరాలతోపాటు సంగారెడ్డి, సత్యసాయి ప్రాజెక్టు ద్వారా నర్సాపూర్, గజ్వేల్ నియోజవకర్గాలకు తాగునీరు సరఫరా చేస్తున్నారు. అయితే సింగూరు, మంజీరాల్లో నీళ్లు అడుగంటుతుండటంతో తాగునీటికి ఇబ్బందుల తప్పని పరిస్థితి నెలకొంది.
ఘనపురం, నల్లవాగు వెలవెల
మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులైన ఘనపురం, నల్లవాగులో నీళ్లు అడుగంటాయి. ఘనపురం ప్రాజెక్టు కింద మెదక్, కొల్చారం, పాపన్నపేట మండలాల్లో ఖరీఫ్‌లో సుమారు 21వేల ఎకరాల్లో పంటలు సాగు చేస్తారు. ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 0.20 టీఎంసీలు కాగా ప్రస్తుతం ఆనకట్ట డెడ్‌స్టోరేజీకి చేరుకుంది. దీంతో ఆనకట్ట కింద సాగు చేయాలని ఎదురుచూస్తున్న రైతులకు దిక్కుతోచటంలేదు. సింగూరు ప్రాజెక్టు నుంచి నీరు వదలటం లేదా వర్షాలు కురిసి ఆనకట్టలోకి నీళ్లు వస్తే తప్ప పంటలు సాగు చేయలేని దుస్థితి నెలకొంది. కల్హేర్ మండలంలోని నల్లవాగు ప్రాజెక్టు సైతం నీళ్లులేక వెలవెల బోతుంది.
నల్లవాడు ప్రాజెక్టు ఫుల్ రిజర్వాయర్ లెవల్ 1493 మీటర్ల కాగా ప్రస్తుతం 75 మీటర్ల మేర నీళ్లు ఉన్నాయి. ప్రాజెక్టు డెడ్‌స్టోరేజీ లేవల్‌కు చేరుకోవటంతో ప్రస్తుతం ఖరీఫ్‌లో రైతులకు సాగునీరు అందని పరిస్తితి ఉంది. ప్రాజెక్టు కింద ఖరీఫ్‌లో 4వేల ఎకరాల్లో పంటలు సాగు చేస్తారు. గత ఖరీఫ్‌లో ప్రాజెక్టులో నీళ్లులేకపోవటంతో రైతులు పంటలు సాగు చేయలేదు. ఈసారైనా ఖరీఫ్‌లో ప్రాజెక్టు కింద పంటలు సాగు చేయవచ్చని రైతులు ఆశించారు. అయితే ప్రాజెక్టులోకి ఇంకా నీళ్లు వచ్చిచేరలేదు. దీంతో వర్షాలు కురిసి ప్రాజెక్టులోకి నీళ్లు రావాలని వరుణ దేవుణ్ని కోరుకుంటున్నారు.
అడుగంటిన ఆశలు!
Published Sun, Jun 28 2015 1:03 AM | Last Updated on Tue, Oct 9 2018 4:48 PM
Advertisement