ప్రతీకాత్మక చిత్రం
భార్యకు గౌరవం... భర్త ఇవ్వక్కర్లేదు ఒకరు ఇవ్వాలనుకుని ఇస్తే వచ్చేది కాదు గౌరవం గౌరవం మనసులో ఉంటే అది మాటలో వినిపిస్తుంది ఎక్కడైతే గౌరవం ఉండదో...అక్కడ ప్రేమ లేమి ఉన్నట్లే
మరి భార్యను గౌరవించకపోతే... ఆ భార్య ఏం చేయాలి? పిల్లల్ని ఏం చేయాలి? విడిపోకుండా ఉండడానికి... మార్గం ఏదన్నా ఉందా? ఉంది!
‘‘ఏంటీ! పంటి నొప్పా. రోజూ ఏదో ఒక న్యూసెన్స్’’ విసుక్కుంటూ, భార్య మీద ధుమధుమలాడుతూ హాస్పిటల్‌కి వెళ్లి పోయాడు డాక్టర్ రాజేశ్. భార్య పడుతున్న బాధకు భర్తగా హృదయంతో స్పందించలేదు, పోనీ ఒక డాక్టర్‌గా కూడా రెస్పాండ్ కాలేదతడు. మౌనంగా బాధను అదిమి పెట్టింది స్వప్న పంటిబాధతోపాటు మనసు బాధను కూడా. ఇలాంటి మనిషి కోసమా డాక్టర్‌గా తన కెరీర్‌ను వదులుకున్నది. రాజేశ్ పీజీ చేస్తానంటే తాను ఉద్యోగం చేస్తూ అతడిని చదివించింది. ఆ సంగతులేవీ గుర్తులేవు కాబోలు. పిల్లల కోసం తాను కెరీర్‌కి దూరమైంది. ఇవేవీ అతడికి పట్టడమే లేదు. రాజేశ్ వెళ్లి పోయిన తర్వాత మెల్లగా లేచి డెంటిస్ట్ దగ్గరకు వెళ్లింది స్వప్న. పిల్లలకు స్కూలు వదిలేలోపు పన్ను తీయించుకుని, వాళ్లను స్కూలు నుంచి ఇంటికి తీసుకురావాలి. అందుకే ఆమె భోజనం కూడా చేయకుండా కదిలింది.
‘రూట్ కెనాల్ చేయాలి’ అన్నాడు పంటిని పరీక్షించిన డెంటిస్ట్. ‘పన్ను తీసేయండి’ అన్నది స్వప్న నిర్లిప్తంగా. డెంటిస్ట్ తలెత్తి ఆమెను చూశాడు, తాను విన్నది నిజమేనా అన్నట్లు. మెల్లగా ‘పన్ను తీయాల్సిన అవసరం లేదు’ రూట్‌కెనాల్ చేసి క్యాప్ వేసి పంటిని కాపాడుకోవచ్చు’ వివరించాడు. ‘పన్ను తీసేయండి డాక్టర్’ అన్నది స్వప్న. మరో మాటకు తావులేదన్నట్లు. ‘మీరు చెప్పిన ట్రీట్‌మెంట్‌కి కావలసినంత డబ్బు నా భర్త ఇవ్వడు’ అని చెప్పలేక. ‘నేనూ డాక్టర్‌నే, నాకూ తెలుసు’ అని చెప్పుకోలేక. కుటుంబం కోసం చేజేతులా తన ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్‌ని జారవిడుచుకుంది. ఆ త్యాగమే ఇప్పుడు తనను చూసి నవ్వుతోంది. ‘ఏం కోల్పోయానో దానిని తిరిగి సాధించుకోవాలి?’ ఆలోచనలకు బ్రేక్ వేస్తూ పన్ను ఠాప్ మని విరిగిన శబ్దం. తీసిన పంటిని ట్రేలో పెట్టి, ఖాళీలో దూదిని నింపి దవడను పైకి అదుముతూ ‘అదిమి పట్టుకో’మని చెప్పాడు డాక్టర్.
‘‘పిల్లలిద్దరూ చిన్నవాళ్లు, ఇప్పుడు ప్రాక్టీస్ పెట్టడం, ఉద్యోగంలో చేరడం రెండూ కష్టమే. ఆలోచించుకో’’ స్వప్నకి నచ్చచెప్పే ప్రయత్నం చేస్తోంది ఆమె తల్లి. ‘‘నా అవసరాలను మానుకున్నాను, పిల్లల అవసరాలు తప్పవు కదా. అతడు చికాగ్గా విదిలించే డబ్బుతో ఎన్నాళ్లని’’ నిలదీసినట్లే ఉంది స్వప్న మాట. ‘‘ఆ ప్రాక్టీసో, ఉద్యోగమో ఏదైనా నీ భర్తతో కలిసి ఉంటూనే చేసుకోవచ్చుగా’’ ప్రత్యామ్నాయం ఆలోచించు అన్నట్లుగా ఉందామె మాటలో అర్థింపు. ‘‘ఆయనకు అమర్చి పెట్టి, పిల్లల పనులు చూసి, వాళ్లను స్కూల్లో దించి, స్కూలు నుంచి తీసుకువచ్చి... కెరీర్‌లో కొనసాగడం అయ్యే పని కాదమ్మా. అన్నీ అయ్యాక నాకు ఉద్యోగానికి మిగిలేది మూడు గంటలే’’ పుల్ల విరుపుగానే ఉన్నాయి స్వప్న మాటలు. స్వప్న విసిగిపోయి ఉందని అర్థమవుతోంది. కన్నీళ్ల కాపురాన్ని కూతురు వద్దనుకున్నంత సులువుగా తల్లి అనుకోలేదు, చక్కదిద్దాలని చూస్తుంది. ‘‘స్వప్నా! నేనూ హైదరాబాద్‌కి వస్తాను’’ అని లోపలికి వెళ్లిపోయింది.
‘‘బాబూ రాజేశ్! స్వప్నకి ఒంట్లో బాగోలేదు. పిల్లల్ని నేను రెడీ చేస్తాను, నువ్వు హాస్పిటల్‌కి వెళ్తూ స్కూల్లో దింపి వెళ్లాలి’’ అన్నది అత్తగారు. ‘‘అలాగే అత్తయ్యగారూ’’ అన్నాడు చికాకును అణుచుకుంటూ.ఇద్దరు పిల్లలు, రెండు స్కూలు బ్యాగ్‌లు, వాటర్ బాటిళ్లు, లంచ్ బాక్స్‌ల బాస్కెట్‌లు రెండు. ‘‘నాకేమైనా ఆరు చేతులున్నాయా’’ నోటి దాకా వచ్చింది రాజేశ్‌కి. ఎదురుగా ఉన్నది స్వప్న కాదు అత్తగారు. స్కూల్ బ్యాగ్‌లు బైక్ హ్యాండిల్‌కి తగిలించాడు. అత్తగారు పిల్లల్ని ముందు ఒకరిని వెనుక ఒకరిని కూర్చోబెట్టింది. ఇక లంచ్ బాస్కెట్‌లు ఎలా? రాజేశ్ కళ్లలో అసహనం కనిపిస్తోంది కానీ అదేమీ పట్టనట్లు అల్లుడి చేతికి అందించిందామె.
‘‘హే... నాన్న బైక్‌లో తీసుకెళ్తున్నాడు’’ కేరింతలతో పిల్లలు ముఖాలు వెలిగిపోతున్నాయి. ‘‘స్కూలు వదిలే టైమ్‌కి మీరు వెళ్తారు కదా’’ బలవంతంగా వినయాన్ని పలికించాడు గొంతులో. ‘‘నాకు మోకాళ్ల నొప్పులు. పైగా ఇంత బరువుతో అడుగు వేయలేను. స్వప్నకు ఓపిక వస్తే వెళ్తుంది. అమ్మాయి లేవలేకపోతే మీకు ఫోన్ చేస్తాను’’ అందామె. ఆమె మాటల్లో అర్థం సహేతుకంగా ఉన్నప్పటికీ, ఆమె ఉద్దేశం మాత్రం ‘నీ చావు నువ్వే చావు’ అన్నట్లుగా అర్థమవుతోంది రాజేశ్‌కి. బైక్ కదిలించాడు. ‘‘నాన్నా! అమ్మకు స్కూటీ కొనివ్వు నాన్నా! మమ్మల్ని రోజూ ఇలాగే స్కూల్‌కి తీసుకెళ్తుంది’’ అడిగింది వెనుక నుంచి రాజేశ్‌ని చుట్టుకుని కూర్చున్న పాపాయి. ‘‘అమ్మ స్కూటీ అడిగితే నువ్వు కొననన్నావు కదా’’ రాజేశ్‌కి ముందు కూర్చున్న కొడుకు మాటల్లో ‘నువ్వింతే’ అనే ఆరోపణ ధ్వనిస్తోంది. ‘స్వప్న వీటన్నింటినీ ఎలా పట్టుకునేది’ ఆలోచన మెదిలిందే తడవుగా పాపాయిని అడిగాడు. ‘‘అమ్మ ఈ బ్యాగ్‌లను వీపుకు తగిలించుకుని, ఒక చేతిలో బాస్కెట్‌లను పట్టుకుని మరో చేత్తో తమ్ముడిని పట్టుకుంటుంది. చేయి వదిలితే వాడు రోడ్డు మీదకు పరుగెత్తుతాడు. నేను అమ్మ పక్కనే నడుస్తాను’’ పాపాయి చెప్తుంటే రాజేశ్‌కి గుండె మెలిపెట్టినట్లయింది.
‘‘మన కాలనీలో ఉన్న పాలీక్లినిక్‌లో జాయిన్ అవుతున్నాను. మా అమ్మ వచ్చి మూడు వారాలైంది. ఊరికి వెళ్తానంటోంది’’ అన్నది స్వప్న కాఫీ తాగి కప్పు టీపాయ్ మీద పెడుతున్న రాజేశ్‌తో.స్వప్న క్లినిక్‌లో చేరడానికి, అత్తగారు ఊరికి వెళ్లిపోవడానికి మధ్య లింక్ ఎక్కడో ఏమీ తెలియలేదతడికి. మౌనంగా చూస్తూ ఉండిపోయాడు.‘‘నిన్ననే అత్తయ్యకు చెప్పాను. రోజంతా ఇంట్లో ఉండి పిల్లల పనులు, వంట చేసి పెట్టడానికి మనిషిని చూసి పంపించమని’’ అని స్వప్న చెబుతుండగానే రాజేశ్‌కి పై మొదటి రెండు స్టేట్‌మెంట్‌ల లింక్ దొరికింది.‘‘జీతం ఎంత’’ రాజేశ్ జీతమొక్కటే అడిగాడు కానీ ఊరి నుంచి వచ్చినామెకి గది ఇవ్వాలంటే పెద్ద ఇంటికి మారాలి. ఆమెకి మూడు సార్లు భోజనం ఆ పైన జీతం... అంకెలు వేలల్లో తిరుగుతున్నాయి.‘‘పది వేలు ఇవ్వందే రారు. ఊరిని వదిలి రావాలి కదా. అత్తయ్యకు వీలు కాకపోతే మా ఊరి నుంచి పంపించమని అమ్మకు చెబుతాను’’ రాజేశ్‌కి మరో మాటకు చోటివ్వకుండా లోపలికి వెళ్లిపోయింది.
‘‘స్వప్నకు కెరీర్‌లో పెద్ద గ్యాప్ వచ్చిన మాట నిజమే. మరో రెండేళ్లు టైమివ్వండి. పిల్లలు కొంచెం పెద్దవుతారు’’ స్వప్న పిల్లలను స్కూలుకి తీసుకెళ్లిన గ్యాప్ చూసి అత్తగారిని అడిగాడు రాజేశ్. ‘‘వంద, రెండొందలకు చేయి చాస్తూ బతకడం తనకూ కష్టమే. ఇంత చదివించి మా అమ్మాయి డాక్టర్ అని గర్వంగా చెప్పుకున్న, మాక్కూడా అమ్మాయి ఇలా చేయి చాచాల్సి రావడం కష్టంగానే ఉంటుంది. రూట్‌కెనాల్ ట్రీట్‌మెంట్‌కి చేతిలో డబ్బులేక పన్ను పీకించుకుందని వాళ్ల నాన్నకు తెలిస్తే ఆయన గుండె పగిలిపోతుంది’’ ఆమె మెల్లగానే అంటున్నప్పటికీ సూటిగానే తగులుతున్నాయి రాజేశ్‌కి.పిల్లల్ని స్కూల్లో వదిలి ఇంటికొచ్చిన స్వప్న... రాజేశ్ హాస్పిటల్‌కి వెళ్లకుండా ఇంకా ఇంట్లో ఉండడంతో విచిత్రంగా చూసి గదిలోకి వెళ్లిపోయింది.స్వప్నతోపాటు గదిలోకి వెళ్లి ‘సారీ స్వప్నా, ఎక్స్‌ట్రీమ్‌లీ సారీ. హాస్పిటల్‌కి వెళ్తున్నాను. ఈవెనింగ్ మాట్లాడుతాను’ అని అంతే వేగంగా ఇంట్లో నుంచి బయట పడ్డాడు.‘‘ఏమైంది’’ హాల్లోకి వచ్చి తల్లిని అడిగింది.‘‘ఏం కోల్పోయానో దానిని తిరిగి సాధించుకోవాలి?’ అని నువ్వన్నప్పుడు నేనేమన్నాను?’’ కూతుర్ని ప్రశ్నించింది.‘‘ఎక్కడ పోగొట్టుకున్నావో అక్కడే వెతుక్కోవాలన్నావు’’ ‘‘ఇప్పుడు జరిగింది అదే’’ అని వంటగదిలోకి వెళ్లింది స్వప్న తల్లి.
కష్టమేంటో తెలిసేలా చేస్తే...
గౌరవం లేని చోట చూరుపట్టుకుని వేళ్లాడ్డం ఎవరికైనా కష్టమే. ఈ డాక్టర్ల విషయంలో భర్త బయట ప్రెషర్స్‌తో సున్నితత్వాన్ని కోల్పోయాడు, భార్య ఇంట్రావర్ట్ అయిపోయింది. పిల్లల భవిష్యత్తు పాడవుతుందని విడాకులు తీసుకుని పిల్లలను పెంచుకోవాలనే నిర్ణయానికి వచ్చింది. ఇలాంటి సమస్యలకు పరిష్కారం... ‘తాము పడుతున్న ఆవేదన, కష్టం ఎదుటి వారికి ఆచరణలో తెలిసేలా చేయడమే’. స్వప్న విషయంలో ఆమె తల్లి ఆ పని చేసింది. భార్యాభర్తలిద్దరితో విడి విడిగా మాట్లాడడం వల్ల మనసులో గూడు కట్టుకున్న ఆవేదన బయటకు వస్తుంది. భర్త కోసం భార్య పడిన శ్రమ, భార్య కోసం భర్త చేసుకున్న సర్దుబాట్లు తెలిశాక... ఇద్దరూ ఎదుటి వ్యక్తి కోణం నుంచి కూడా ఆలోచిస్తారు. ఈ సూత్రం... కరడు గట్టిన వాళ్లకు పని చేయదు, కానీ చాలా మందిలో గ్యాప్‌ను పూరిస్తుంది. స్వప్న మళ్లీ కెరీర్ ప్రారంభించే వరకు ఆమె అకౌంట్‌లో నెలనెలా డబ్బు వేశాడు రాజేశ్. అంతకంటే ఎక్కువగా భార్యాభర్తల మధ్య గ్యాప్ తొలగిపోయింది. పదేళ్లు ఉనికి కోసం పోరాడిన స్వప్న ఇప్పుడు తన ప్రయారిటీస్‌ను చక్కగా ప్లాన్ చేసుకుంటోంది.
– చెరువు వాణీమూర్తి, ఫ్యామిలీ కౌన్సెలర్
– మంజీర
Comments
Please login to add a commentAdd a comment