
ధనశ్రీ వర్మకు భారత క్రికెటర్ చహల్ చెల్లిస్తున్న భరణం
ముంబై: భారత క్రికెట్ జట్టు లెగ్‌స్పిన్నర్ యుజువేంద్ర చహల్, ధనశ్రీ వర్మ మధ్య వివాహ బంధం అధికారికంగా ముగింపు దశకు వచ్చింది. వీరిద్దరు చాలా కాలంగా దూరంగానే ఉంటున్నా ఈ ఏడాది ఫిబ్రవరి 5న తమ విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టులో కేసు వేశారు. కానీ హిందూ వివాహ చట్టం ప్రకారం సర్దుబాటు కోసం ప్రయత్నించేందుకు వీలుగా కనీసం ఆరు నెలల సమయం ఇస్తారు. దీనినే ‘కూలింగ్ ఆఫ్ పీరియడ్’గా చెబుతారు.
అయితే తాము రెండున్నరేళ్లకు పైగా విడిగానే ఉంటున్నామని, పరస్పర అంగీకారంతో విడాకులు కోరుతున్నాం కాబట్టి ‘కూలింగ్ ఆఫ్ పీరియడ్’ను తొలగించి వెంటనే విడాకులు మంజూరు చేయాలని చహల్, ధనశ్రీ కోరారు. ఈ విజ్ఞప్తిని ఫ్యామిలీ కోర్టు కొట్టేయడంతో వారు హైకోర్టును ఆశ్రయించారు. ఐపీఎల్ కారణంగా తాను కనీసం మూడు నెలలు అందుబాటులో ఉండలేనని కూడా చహల్ వెల్లడించాడు.
దీనిపై స్పందించిన హైకోర్టు...ఈ నిబంధన నుంచి వీరిద్దరికి సడలింపు ఇవ్వాలని ఆదేశించడంతో పాటు విడాకులకు సంబంధించి గురువారమే తుది తీర్పు ఇవ్వాలని కూడా సూచించింది. మరోవైపు విడాకుల ప్రక్రియను ముగించే క్రమంలో ధనశ్రీకి చహల్ రూ. 4 కోట్ల 75 లక్షలు భరణం రూపంలో చెల్లించనున్నాడు.
ఇందులో అతను ఇప్పటికే రూ. 2 కోట్ల 37 లక్షలు ఇచ్చేశాడు. యూట్యూబర్, కొరియాగ్రాఫర్ ధనశ్రీ వర్మతో చహల్‌కు డిసెంబర్, 2020లో పెళ్లి జరగ్గా... 18 నెలల తర్వాత జూన్ 2022 నుంచి వీరిద్దరు విడిగానే ఉంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment