
తెలుగులో 'మహాత్మ', 'ఒంటరి' లాంటి తెలుగు సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న మలయాళ బ్యూటీ భావన. శ్రీకాంత్ హీరోగా నటించిన మహాత్మ చిత్రంలో ఆడియన్స్‌ను మెప్పించింది. కేరళకు చెందిన భావన.. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ సినిమాలు చేస్తూ గుర్తింపు తెచ్చుకుంది. అయితే కొంతకాలం పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన భావన 2018లో కన్నడ నిర్మాత నవీన్ రమేశ్‌ను పెళ్లాడింది. గతేడాది 'నడికర్' అనే మలయాళ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ ముద్దుగుమ్మపై సోషల్ మీడియాలో రూమర్స్ తెగ వైరలవుతున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన భావన తనపై వస్తున్న వార్తలపై స్పందించింది. ఇంతకీ ఆ ముచ్చట ఏంటో తెలుసుకుందాం పదండి.
ఈ మలయాళీ భామ త్వరలోనే తన భర్త నవీన్ రమేశ్‌తో విడిపోనుందంటూ సామాజిక మాధ్యమాల్లో కథనాలు వస్తున్నాయి. దీంతో తమపై వస్తున్న వార్తలపై భావన తాజా ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకోవడం తనకు ఇష్టం ఉండదని తెలిపింది. అలాగే తన భర్తతో దిగిన ఫోటోలను కూడా తాను షేర్ చేయకపోవడం వల్లే ఇలా మాట్లాడుకుంటున్నారని భావన వెల్లడించింది.

భావన మాట్లాడుతూ..' నా భర్తతో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం నాకు ఇష్టముండదు. అందుకే మేము విడాకులు తీసుకుంటున్నామని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. మేమిద్దరం కలిసి జీవిస్తున్నాం. నా వ్యక్తిగత జీవితానికి సంబంధించి గోప్యతను పాటిస్తా. నేను యాదృచ్ఛికంగా ఫోటోలు పోస్ట్ చేసినా ఏదో తప్పు జరిగిందని ఊహాగానాలు సృష్టిస్తారు. అలా అని మా బంధం నిరూపించడానికి మేము సెల్ఫీలు పోస్ట్ చేయాల్సిన అవసరం లేదు కదా?" అంటూ విడాకులపై వస్తున్న రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చేసింది.

భావన తన సినీ కెరీర్‌ను మలయాళ చిత్రం నమ్మల్ (2002)తో ప్రారంభించింది. తరువాత చితిరం పెసుతడితో తమిళ సినిమాల్లోకి ప్రవేశించింది. తమిళంలో అజిత్ కుమార్ సరసన కూడా నటించింది. ఆ తర్వాత ఒంటరి మూవీతో తెలుగులోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది. శ్రీకాంత్ నటించిన మహాత్మ తెలుగులో ఆమెకు గుర్తింపును తీసుకొచ్చింది. ఆమె ప్రస్తుతం కన్నడ చిత్రం పింక్ నోట్, తమిళ చిత్రం ది డోర్ సినిమాలో కనిపించనుంది.
Comments
Please login to add a commentAdd a comment