- 350 మీటర్ల పొడవు.. రూ.50 కోట్లతో నిర్మాణం
సాక్షి, హైదరాబాద్: ఒకే నిర్మాణం.. రెండు ప్రయోజనాలు.. ఈ తరహాలో తొలి భారీ నిర్మాణానికి రంగం సిద్ధమైంది. నది దాటేందుకు రోడ్డుతోపాటు, నది నీటిని నిల్వ చేసే డ్యామ్ తరహా ఏర్పాటుకు ఉద్దేశించిన బహుళ ప్రయోజనకర తొలి భారీ వంతెన సిద్ధం కాబోతోంది. నిజామాబాద్-మెదక్ సరిహద్దులో వెంకంపల్లి వద్ద మంజీరా నదిపై దీనిని నిర్మించనున్నారు. దాదాపు 350 మీటర్ల పొడవుండే ఈ వంతెనకు దాదాపు రూ.50 కోట్లకుపైగా వ్యయం కానుంది. దీని ద్వారా నిజామాబాద్ జిల్లాలోని నాగిరెడ్డిపేట్ మండలం-మెదక్ జిల్లాలోని పాపన్నపేట మండలాలను అనుసంధానించటంతోపాటు ఆ ప్రాంతాల్లోని గ్రామాలకు సాగు, తాగునీటిని అందించేందుకు అవకాశం కలుగుతుంది.
మహారాష్ట్ర, కర్ణాటకల్లో సత్ఫలితాలనిస్తున్న ఈ తరహా నిర్మాణాలను తెలంగాణలో చిన్న నదీ పాయలు, పెద్ద వాగులపై నిర్మించాలని తొలుత నిర్ణయించారు. కానీ మంజీరా నదిపై కూడా చేపట్టాలని తాజాగా రోడ్లు భవనాల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించటంతో ఆ శాఖ అధికారులు దీనిని ఎంపిక చేశారు. ఇక్కడ రోడ్డు కోసం వంతెన నిర్మించే ప్రతిపాదన మాత్రమే ఉంది. మంత్రి ఆదేశాలతో ఆ ప్రతిపాదనను పక్కనపెట్టి వంతెన డిజైన్ మార్చి టెండర్లు పిలవాలని నిర్ణయించిన అధికారులు.. దీనికి సంబంధించి సర్వే పని మొదలుపెట్టారు. గతంలో మాటూరు వద్ద వంతెన నిర్మాణానికి ప్రయత్నించినా.. ఆ ప్రాంతం అనువైంది కాదని మట్టి పరీక్షలో తేలడంతో.. ఇప్పుడు వెంకంపల్లిని ఎంపిక చేశారు.
మంజీరాపై తొలి ‘నీటి వంతెన’
Published Mon, Sep 28 2015 1:11 AM | Last Updated on Tue, Oct 9 2018 4:48 PM
Advertisement
Advertisement