హద్దులు తేలకున్నా.. | To come down out of bounds .. | Sakshi
Sakshi News home page

హద్దులు తేలకున్నా..

Published Thu, Jan 5 2017 12:11 AM | Last Updated on Tue, Oct 9 2018 4:48 PM

హద్దులు తేలకున్నా.. - Sakshi

హద్దులు తేలకున్నా..

నిజామాబాద్‌ : తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దుల మ«ధ్య ప్రవహిస్తున్న మంజీర నదిలో సరిహద్దు వివాదం చాలా కాలంగా అపరిష్కృతంగా ఉంది. గతంలో ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు ఈ సరిహద్దులను తేల్చేందుకు సంయుక్త సర్వేలు జరిపినా వివాదం కొలిక్కి రాలేదు. తాజాగా మంజీర నదిలో మహారాష్ట్ర సర్కారు ఇసుక క్వారీలకు టెండర్లు పిలిచింది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల పరిధిలోని బోధన్, బాన్సువాడ, జుక్కల్‌ నియోజకవర్గాల సరిహద్దుల్లోని మండలాలకు ఆనుకుని ఈ నది ప్రవహిస్తోంది. మన జిల్లాలకు అవతలివైపు ఉన్న 12 ఇసుక క్వారీలకు ఈ సారి మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయం టెండరు నోటిఫికేషన్‌ జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. గతంలో ఇలాగే మహారాష్ట్ర క్వారీల పేరిట నదిలో జిల్లా భూభాగంలోకి చొరబడి ఇసుక తవ్వకాలు జరిగాయి. దీంతో జిల్లా భూభాగంలోని ఇసుక తరలిపోగా.. ఈ ఇసుకపై రూ.కోట్లలో ఆదాయం మహారాష్ట్ర సర్కారుకు వెళ్లింది. సరిహద్దు వివాదం పరిష్కారమైతేనే మహారాష్ట్ర కాంట్రాక్టర్ల ఇసుక దోపిడీకి అడ్డుకట్ట పడుతోందని సరిహద్దు రైతాంగం అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. ఈ వివాదం మూడేళ్ల క్రితం రెండు రాష్ట్రాల మధ్య కొంత ఉద్రిక్తతకు దారితీసింది. తాజాగా నాందేడ్‌ జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయం ఈ క్వారీలకు గత నెల 5న నోటిఫికేషన్‌ జారీ చేసింది. డిసెంబర్‌ 20 నుంచి ఈ–ఆక్షన్‌ నిర్వహిస్తోంది.

మంజీరలో 12 క్వారీలకు ‘మహా’ ప్లాన్‌
నాందేడ్‌ జిల్లా దెగ్లూర్, బిలోలి, ధర్మాబాద్‌ తాలూకాల పరిధిలో మంజీర నదిలో 12 ఇసుక క్వారీల్లో ఇసుక తవ్వకాలకు అనుమతి ఇచ్చింది. శెల్‌గాం, శావ్లా, శాఖాపూర్, గంజ్‌గాం, హున్‌గుందా, కార్లా (బీకే), బొలేగాం, మచ్‌నూర్, సగ్రోలి, హెస్గీ, నాగిని, సంగం క్వారీలకు అనుమతులు మంజూరు చేసింది. అలాగే జుక్కల్‌ నియోజకవర్గం పరిధిలో ప్రవహించే లెండి నదిలో సంగ్వి ఉమార్, సంగడి, తంతార్, మెదన్‌కలూర్, హవార్గా క్వారీలకు కూడా అక్కడి కలెక్టరేట్‌ అనుమతులు మంజూరు చేసింది. ప్రతిసారి నవంబర్, డిసెంబర్‌ మాసాల్లో ఇసుక క్వారీలకు వేలం పాటలు నిర్వహించి అనుమతి ఇస్తున్న మహారాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది కూడా కొనసాగించింది. ఈ రెండు నదులతో పాటు పెన్‌గంగా, గోదావరి, రవాంగన్‌నాలాలపై కూడా ఇసుక క్వారీలకు మహారాష్ట్ర సర్కారు తెరలేపింది. కాగా, మహారాష్ట్ర అనుమతుల పేరిట ఇసుకాసురులు మంజీర నదిలోని మన ప్రాంత ఇసుకను య«థేచ్ఛగా తరలించారు. ఈ క్రమంలో నకిలీ వేబిల్లులు కూడా సృష్టించి తెలంగాణ సర్కారుకు కుచ్చుటోపీ పెట్టారు. మహారాష్ట్ర క్వారీల ఇసుక రవాణా సాలూర అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు మీదుగా రాష్ట్రంలోకి తరలించి సొమ్ము చేసుకున్నారు. నకిలీ వే బిల్లులతో ఇసుక రవాణాకు పాల్పడిన పలువురు కాంట్రాక్టర్లపై జిల్లా పోలీసులు కేసులు నమోదు చేశారు. కొందరిని అరెస్టు చేశారు.

అప్పట్లో రైతుల ఆందోళనలు
నదిలో మహారాష్ట్ర క్వారీలకు ఇవతల వైపు కోటగిరి, బోధన్‌ మండలాల గ్రామాలు సుంకిని, మందర్న, హున్సా, ఖాజాపూర్, సాలూర, తగ్గెల్లి, కల్దుర్కి, సిద్దాపూర్, ఖండ్‌గాం, బిక్‌నెల్లి గ్రామాలున్నాయి. మహారాష్ట్ర అనుమతుల పేరిట నదిలో ఇష్టానుసారంగా తవ్వకాలు జరపడంతో నది జలాల ఆధారంగా ఉన్న పలు ఎత్తిపోతల పథకాలు గతంలో వట్టిపోయాయి. ఆయా మండలాల వాసుల తాగునీటి అవసరాలు తీర్చే ఈ పథకాలు పని చేయలేదు. దీనికి తోడు ఈ సరిహద్దు గ్రామాల్లో వందల సంఖ్యలో బోరుబావులు అడుగంటిపోయాయని అప్పట్లో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వం మళ్లీ ఇసుక క్వారీలకు అనుమతిస్తే ఇంకేన్ని దుష్ఫలితాలు అనుభవించాల్సి ఉంటుందోనని రైతుల్లో కలవరం మొదలైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement