రాజధానికి మంజీరా బంద్
సింగూరు నీళ్లు కూడా...
50 ఏళ్ల తరవాత ఇదే తొలిసారి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌కి యాభై ఏళ్ల తరవాత సింగూరు, మంజీరా జలాల సరఫరా మంగళవారం ఒకేసారి నిలిచిపోయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ జలాశయాలు వట్టి పోవడంతో ఈ దుస్థితి నెలకొంది. వీటిల్లో ఉన్న కొద్దిపాటి జలాలను మెదక్ జిల్లా సాగు, తాగు నీటి అవసరాలకు నిల్వ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో ఈ పరిస్థితి తలెత్తింది. రాజధాని హైదరాబాద్‌కు1965 నుంచి సింగూరు (మంజీరా ఫేజ్-1), 1982 నుంచి మంజీరా జలాలు (మంజీరా ఫేజ్-2) జలాలు సరఫరా అవుతున్నాయి. ఈ పథకాలు ప్రారంభమైనప్పటి నుంచి తొలిసారిగా మంగళవారం ఒకేసారి 120 మిలియన్ గ్యాలన్ల జలాలకు కోత పడడంతో పలు ప్రాంతాలు తీవ్ర దాహార్తితో అలమటిస్తున్నాయి. దీంతో పాటు జంట జలాశయాలైన హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్, కృష్ణా మూడు దశల ద్వారా జలమండలి సరఫరా చేస్తున్న మొత్తం 357 ఎంజీడీల నీటిలో 120 ఎంజీడీలకు కోత పడింది.
ఫలితంగా వాస్తవ సరఫరా 237 మిలియన్ గ్యాలన్లకు మించలేదు. ఫలితంగా కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, మాదాపూర్, బంజారాహిల్స్, ఖైరతాబాద్, ఆనంద్‌నగర్, ఎస్‌ఆర్ నగర్, అమీర్‌పేట్, బోరబండ, కేపీహెచబీ, భాగ్యనగర్ సెక్షన్, బంజారాహిల్స్, యూసుఫ్‌గూడా, ఎర్రగడ్డ, జూబ్లీహిల్స్, బాలానగర్, చింతల్ తదితర ప్రాంతాలకు నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ఈ ప్రాంతాలకు యుద్ధ ప్రాతిపదికన 600 ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయనున్నట్లు జలమండలి ఈఎన్‌సీ సత్యనారాయణ ‘సాక్షి’కి తెలిపారు. ప్రత్యామ్నాయంగా బుధవారం నుంచి గోదావరి మంచినీటి పథకం ద్వారా ప్రస్తుతం ఘన్‌పూర్ రిజర్వాయర్‌కు తరలిస్తున్న 28 ఎంజీడీలు, కృష్ణా మూడోదశ ద్వారా 5 ఎంజీడీల జలాలను లింగంపల్లి రిజర్వాయర్‌కు తరలించి, అక్కడి నుంచి ఆయా ప్రాంతాలకు సరఫరా చేస్తామన్నారు. ఈ నెల 5 నుంచి గోదావరి మంచినీటి పథకం ద్వారా 56 ఎంజీడీల నీటిని నగరానికి తరలించి దాహార్తి తీరుస్తామన్నారు. అలాగే ఈ నెల 10 నుంచి 86 ఎంజీడీల గోదావరి జలాలను తరలించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. జంట జలాశయాల నుంచి ప్రస్తుతం 10 ఎంజీడీల నీటిని పాత నగర తాగునీటి అవసరాలకు సరఫరా చేస్తున్నారు.
ట్యాంకర్ బుకింగ్‌లు 57 వేలకు పైనే...
శీతాకాలంలోనే నీటి కష్టాలు తీవ్రమవడంతో నవంబరు నెల మొత్తంగా జలమండలిలో ఏకంగా 57,672 ట్యాంకర్లు బుక్ అయ్యాయి. ఇందులో 47,454 మందికి సరఫరా చేశారు. మరో 10,218 మంది నిరీక్షణ జాబితాలో ఉన్నారు. దీంతో చేసేది లేక ప్రైవేటు ట్యాంకర్ (5 వేల లీటర్లు) నీటికి రూ.1000 నుంచి రూ.2 వేల వరకు వినియోగదారులు చెల్లించాల్సి వస్తోంది.