నిండా ముంచిన వరదలు | Floods soaked amply | Sakshi
Sakshi News home page

నిండా ముంచిన వరదలు

Published Fri, Oct 7 2016 9:39 PM | Last Updated on Tue, Oct 9 2018 4:48 PM

నిండా ముంచిన వరదలు - Sakshi

నిండా ముంచిన వరదలు

  • ఇంకా నీటిలోనే పంటలు
  • పరిశీలనకే పరిమితమైన అధికారులు
  • ఆందోళనలో మంజీర తీర రైతులు

  • రాయికోడ్‌: మంజీర నది తీరానికి ఆనుకుని ఉన్న పంట పొలాలను వరద నీరు ముంచుతోంది. పొలాల్లో వారాల తరబడి వరద నీరు నిలుస్తోంది. కొన్ని పొలాల్లో మట్టి, ఇసుక మేటలు వేస్తున్నాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మండలంలో  ఇటీవల భారీ వర్షాలు కురిశాయి.  మంజీర నదితో పాటు, చెరువులు, వాగులు, కాలువలు పొంగిపొర్లాయి.   మంజీర నదికి ఆనుకుని ఉన్న ఖాంజమాల్‌పూర్‌, మాటూర్‌, ఇటికేపల్లి, శాపూర్‌, పాంపాడ్‌, సిరూర్‌, దౌల్తాబాద్‌, మోరట్గా, మామిడిపల్లి, ఇందూర్‌, కర్చల్‌, తదితర 18 గ్రామాల్లో వేల ఎకరాల పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అదేవిదంగా  రాయికోడ్‌, నాగ్వార్‌, యూసుఫ్‌పూర్‌, ధర్మాపూర్‌, అల్లాపూర్‌, హుల్గేర, కుసునూర్‌, రాయిపల్లి గ్రామాల వాగులు, సింగితం, జంమ్గి, కర్చల్‌, ఇందూర్‌, హస్నాబాద్‌, నాగన్‌పల్లి, ఔరంగానగర్‌, కుసునూర్‌ తదితర గ్రామాల్లోని చెరువులు పొంగిపొర్లడంతో పొలాలన్నీ నీట మునిగి నష్టాల పాలయ్యారు.
    ఆయా గ్రామాల్లో సాగు చేస్తున్న పత్తి, మినుము, సోయాబీన్‌, కంది పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. మంజీర నది, నీటి వనరులు ఉప్పొంగి వరద నీటిలో మునిగి మండలంలో సుమారు 10 వేల ఎకరాల్లో వివిధ పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయ అధికారులు ప్రాథమికంగా అంచన వేశారు. ఈ నెల ఒకటిన కురిసిన 20 సెంటీమీటర్ల వర్షానికి మంజీర నది సమీప ప్రాంతాల్లోని పంటపొలాల్లో వరద నీరు చేరింది. ఇంకా పంటలు నీటిలోనే ఉన్నాయి. పంటలు చేతికందే పరిస్థితులు లేవని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్‌ ప్రారంభంలో అడపాదడపా కురిసిన వర్షాలతో పంటలను కంటికి రెప్పలా కాపాడుతూ వచ్చామని ఈ క్రమంలో అకాల భారీ వర్షాలు తమకు కోలుకోలేని నష్టాలను మిగిల్చాయని రైతులు తమ కష్టనష్టాలను వివరిస్తున్నారు.
    మండలంలో సెప్టెంబర్‌ నెలలో సాధారణ వర్షాపాతం 190 మిల్లీమీటర్ల నమోదు కావాల్సి ఉండగా 362 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదైంది.  అక్టోబర్‌లో సాధారణ వర్షాపాతం 80 మిల్లీమీటర్లకుగాను.. ఒక్క రోజులోనే 200 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.  వారం రోజులవుతున్నా పంటలు ఇంకా నీటిలోనే  ఉన్నాయి.  మండల వ్యవసాయ అధికారి అభినాష్‌ వర్మ పంట నష్టాన్ని అంచనా వేసే పనిలో నిమగ్నమయ్యారు. నీటమునిగిన పంటలు జీవం కోల్పోయాయని ఏఓ తెలిపారు.  
    అభిప్రాయాలు..
    చేతికొచ్చిన గింజలు నీటిపాలు
     నాకున్న ఎకరంన్నర పొలంలో కంది, పత్తి సాగు చేశాను. తెగుళ్ల బారి నుంచి పంటను కాపాడుతూ వచ్చాను. మొక్కలు పూత దశకు చేరుకున్నాయి. కొన్ని రోజుల్లో గింజలు చేతికందుతాయని ఆశించాను. కానీ అకాల కుంభవృష్టితో పంటంతా నీటిలో మునిగిపోయింది. వారం రోజులుగా పొలం వరద నీటిలోనే ఉంది.  ఎం చేయాలో పాలుపోవడంలేదు.
    - నర్సింలు రైతు ఇందూర్‌ గ్రామం.

    పరిహారం చెల్లించాలి
     పంటలు దెబ్బతిన్న రైతులకు పరిహారం చెల్లించాలి. అప్పు చేసి సాగు చేశారు. తీవ్ర నష్టాల్లో కూరుకుపోయా. పంట పొలాల్లోకి భారీగా వరద నీరు చేరి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రైతులు కోలుకోలేని విధంగా నష్టపోయారు. ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకోవాలి.
    -బీ. వెంకట్‌రావ్‌ పాటిల్‌ ఎంపీపీ రాయికోడ్‌.

    పంట నష్టంపై అంచనా వేస్తున్నాం
     రెండు వారాలుగా ఆయా గ్రామాల్లో దెబ్బతిన్న పంటలను అంచనా వేస్తున్నాం. పంటల రకాలు, సర్వే నంబర్లు, రైతు బ్యాంకు ఖాతా, ఆధార్‌ నంబర్లు తదితర పూర్తి వివరాలను నమోదు చేసుకుంటున్నాం. త్వరలో ఉన్నతాధికారులకు నివేదికలు అందజేస్తాం.
    - అభినాష్‌ వర్మ, మండల వ్యవసాయ అధికారి

     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement