నగరానికి మంజీరా పరుగులు
సాక్షి, సిటీబ్యూరో: నగరవాసులకు శుభవార్త. సుమారు ఆరునెలలుగా నగరానికి నిలిచిపోయిన మంజీరా జలాల పంపింగ్ ఆదివారం మొదలైంది. తొలివిడతగా ఈ జలాశయం నుంచి 16 మిలియన్ గ్యాలన్ల నీటిని నగరానికి తరలించినట్లు జలమండలి వర్గాలు తెలిపాయి. ఈ నీటి తరలింపుతో లింగంపల్లి, చందానగర్, గచ్చిబౌలి తదితర ప్రాంతాలకు గోదావరి జలాల రివర్స్ పంపింగ్ కష్టాలు తీరినట్లు తెలిపాయి.
కాగా ఇటీవలి భారీ వర్షాలకు మెదక్ జిల్లాలోని సింగూరు, మంజీరా జలాశయాలు పూర్తిస్థాయిలో నిండి నిండుకుండల్లా మారడంతో ఈ రెండు జలాశయాల నుంచి నగర తాగునీటి అవసరాలకు నిత్యం 120 ఎంజీడీల నీటిని తరలించేందుకు సీఎం కేసీఆర్ అంగీకరించినట్లు తెలిసింది. సింగూరు, మంజీరా జలాల తరలింపుతో కరీంనగర్ జిల్లా ఎల్లంపల్లి నుంచి గ్రేటర్‌కు తరలిస్తున్న గోదావరి జలాల పంపింగ్‌ను 86 ఎంజీడీల నుంచి 28 ఎంజీడీలకు క్రమంగా తగ్గించనున్నట్లు సమాచారం. తద్వారా విద్యుత్ బిల్లులను ఆదా చేయాలని జలమండలి నిర్ణయించింది.