వరద నీటితో నిండిన మంజీర బ్యారేజీ
- సంగారెడ్డికి పూర్తిస్థాయిలో మంజీర నీళ్లు
- రోజు విడిచి రోజు సరఫరా
- నేటి నుంచే పట్టణమంతా అమలు
- పెరిగిన నీటి మట్టంతో కలెక్టర్ నిర్ణయం
సంగారెడ్డి మున్సిపాలిటీ: పట్టణవాసులు పానీ ఖబర్‌తో ఖుషీ అవుతున్నారు. ఇప్పటి వరకు మూడు రోజులకు ఒకసారి వచ్చే మంజీర నీరు.. ఇకపై రోజు విడిచి రోజు వస్తుందన్న సమాచారంతో సంబరపడుతున్నారు. బ్యారేజీలోకి భారీగా వరద నీరు చేరడంతో కలెక్టర్ తీసుకున్న నిర్ణయానికి కృతజ్ఞతలు చెబుతున్నారు.
గతంలో మూడు రోజులకు ఒకసారి పట్టణానికి ఇప్పటి వరకు ఇప్పటి వరకు మంజీర నీరు పట్టణానికి మూడు రోజులకు ఒకసారి వచ్చేది. కానీ, తాజాగా మంజీర బ్యారేజీలోకి భారీగా వరద నీరు రావడంతో రోజు విడిచి రోజు నీరు సరఫరా చేయాలని కలెక్టర్ రోనాల్డ్‌రోస్ ఆదేశించినట్టు మున్సిపల్ ఇన్‌చార్జి కమిషనర్, ఏజేసీ వెంకటేశ్వర్లు తెలిపారు.
పట్టణానికి మంచినీరు సరఫరా చేసే ప్రధాన జలాశయమైన మంజీరలోకి ఎగువ ప్రాంతం నుంచి వరద నీరు అధికంగా రావడంతో ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరువైంది. బ్యారేజీ సామర్థ్యం 1.50 టీఎంసీలు. ఇప్పటి వరకు 1.01 టీఎంసీల నీరు చేరినట్టు అధికారులు తెలిపారు.
వర్షాలు కొనసాగితే...
మరో వారం పాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే ప్రకటించారు. దీంతో ఈసారి మంజీర పూర్తి స్థాయిలో నిండే అవకాశం ఉంది. దీనికి తోడు మంజీర నిండలేని పరిస్థితిలో ఎగువన ఉన్న సింగూర్ ప్రాజెక్టు నుంచి సంగారెడ్డి పట్ణణానికి నీరు వదిలే అవకాశం లేకపోలేదు. అయితే, నీటిని పొదుపుగా వాడుకోవాల్సిన అవసరం ఉందని కలెక్టర్ అధికారులను హెచ్చరించారు. ఈ నేపథ్యంలో రెండు రోజులకు ఒకసారి నీరు విడుదల చేసి వేసవి వరకు ఇబ్బందు లేకుండా చూడాలని ఆదేశించారు.
రోజుకు 9 ఎంఎల్‌డీల నీరు
2006 జనాభా లెక్కల ప్రకారం పట్టణానికి ప్రతిరోజు 9 మిలియన్ లీటర్ల నీరు సరఫరా చేస్తున్నారు. కాగా, 2016 సంవత్సరానికి పట్టణ జనాభా పెరిగిన నేపథ్యంలో నీటి వినియోగం సైతం అధికమైంది. దీంతో ప్రతిరోజు అందించే 9 ఎంఎల్‌డీల నీరు సరిపడం లేదు. ప్రస్తుత జనాభా లెక్కల ప్రకారం 11 ఎంఎల్‌డీల నీరు అందిస్తే పట్టణవాసుల దాహర్తి పూర్తిస్థాయిలో తీర్చవచ్చు. అదనంగా మరో 2 ఎంఎల్‌డీల నీటిని బోర్ల ద్వారా సరఫరా చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.