తాగునీటి ట్యాంక్‌లో విషం? | unknown persons poison mix in drinking water | Sakshi
Sakshi News home page

తాగునీటి ట్యాంక్‌లో విషం?

Published Thu, Sep 4 2014 11:13 PM | Last Updated on Tue, Oct 9 2018 4:48 PM

unknown persons poison mix in drinking water

సంగారెడ్డి రూరల్ : మండల పరిధిలోని కలబ్‌గూర్ మంజీరా నీటి ట్యాంక్‌లో గుర్తు తెలియని వ్యక్తులు విషం కలిపారన్న వార్త కలకలం రేపింది. గురువారం మధ్యాహ్నం జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి... సంగారెడ్డి వైపు నుంచి ఓ బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ట్యాంక్‌పైకి ఎక్కి తమ వెంట తెచ్చుకున్న ఓ కవర్‌లో ఉన్న రసాయనాన్ని ట్యాంక్‌లో పోసి మెట్లు దిగుతున్న క్రమంలో పారిశుద్ధ్య కార్మికుడు లక్ష్మయ్య చూసి వెంబడించాడు. అయితే బైక్‌పై వచ్చిన వారు పారిపోయాడు.

దీంతో లక్ష్మయ్య విషయాన్ని సర్పంచ్ వనజా జనార్దన్‌కు తెలపాడు. అప్రమత్తమైన సర్పంచ్ పారిశుద్ధ్య సిబ్బందితో ట్యాంక్ వద్దకు చేరుకుని నీటిని ఖాళీ చేయించి గ్రామీణ తాగునీటి పథకం (ఆర్‌డబ్ల్యూఎస్) అధికారులకు సమాచారం అందించారు. ట్యాంక్ వద్దకు చేరుకున్న ఆర్‌డబ్ల్యూఎస్ సైట్ ఇంజనీర్ వెంకటేశ్వర్లు నీటి నమూనాలను సేకరించి సదాశివపేటలోని ల్యాబ్‌కు పంపించారు. కలబ్‌గూర్ మంజీరా నీటి ట్యాంక్ నుంచి కలబ్‌గూర్‌తో పాటు అంగడిపేట, గంజిగూడెం గ్రామాలకు తాగునీరు సరఫరా అవుతుంది.

ఈ కారణంగా నీటి సరఫరాను వెంటనే నిలిపివేస్తూ ఆయా గ్రామాల్లో దండోరా వేయించి ప్రజల్ని అప్రమత్తం చేశారు. నీటిని తాగవద్దని సూచించారు.  ల్యాబ్ నుంచి వచ్చిన నివేదిక తర్వాతనే ట్యాంకు నుంచి నీటిని ఆయా గ్రామాలకు వదులుతామని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని గమనించి ఆయా గ్రామాల ప్రజలు ఈ అసౌకర్యానికి సహకరించాలని సర్పంచ్ కోరారు. విషయం తెలుసుకున్న సంగారెడ్డి జెడ్పీటీసీ మనోహర్‌గౌడ్ ఆయా గ్రామాలను సందర్శించారు. నీటిలో రసాయన్నాన్ని కలిపింది ఎవ రో ఆరా తీయాలని కోరుతూ సర్పంచ్ వనజా జనార్దన్ సంగారెడ్డి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement