మంజీరా’ వద్ద జింకల వేట
► నదీ పరీవాహక పరిధిలో పట్టుబడిన వేటగాళ్లు
► నిందితుల వద్ద రైఫిల్, పిస్టల్, కత్తులు స్వాధీనం
మనూరు(నారాయణఖేడ్): సంగారెడ్డి జిల్లా నాగల్‌గిద్ద మండలంలోని మంజీరా పరీవాహకంలో కర్ణాటకలోని బీదర్, హైదరాబాద్ ప్రాంతాలకు చెందిన పలువురు వేటగాళ్లు జింకలను, ఇతర వన్యప్రాణులను వేటాడుతూ పోలీసులకు పట్టుబడ్డారు. వివరాలు.. బీదర్ ప్రాంతం నుంచి డస్టర్ వాహనం (ఏపీ 11ఏఆర్ 3600)లో మోర్గి మీదుగా నాగల్‌గిద్ద వైపు ఓ వేటగాళ్ల ముఠా వచ్చింది.
తిరుగు ప్రయాణంలో ఆ వాహనాన్ని మోర్గి మోడ్ వద్ద పోలీసులు తనిఖీ చేయగా పెద్దఎత్తున ఆయుధాలు లభించాయి. వాహనంలో ముగ్గురు వ్యక్తులతోపాటు ఇద్దరు మైనర్లు ఉన్నారు. వారిలో బీదర్‌కు చెందిన సయ్యద్ ఓవైసీ ఖాద్రి (31), హైదరాబాద్‌లోని సంతోష్‌నగర్‌కు చెందిన మహ్మద్ నజీరుద్దీన్ తాపక్ (48), మహ్మద్ నయీమొద్దీన్ (40)ను విచారించి.. వణ్యప్రాణుల వేటకు వచ్చినట్టు నిర్ధారించారు.
వాహనంలో 0.22 రైఫిల్, ఒక మ్యాగ్జిన్ తుపాకీ, పిస్టల్, టార్చిలైట్, రెండు కత్తులు, కటింగ్ ప్లేయర్, తదితర పరికరాలు లభించాయి. దీంతో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంఘటన స్థలాన్ని నారాయణఖేడ్ డీఎస్పీ యాదగిరి రాజు ఆదివారం ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా సీఐ సైదానాయక్ మాట్లాడుతూ.. నిందితులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశామన్నారు. మంజీరా పరీవాహక ప్రాంతంలో ఉన్న వన్యప్రాణులను వేటాడేందుకు కొందరు యత్నిస్తున్నారన్నారు. కాగా, నాగల్‌గిద్ద మండలం బీదర్‌కు సమీపంలో ఉండటంతో ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.