మంజీర నది న్యాల్‌కల్ మండలం మీదుగా జిల్లాలోకి ప్రవేశిస్తుంది...
- పొంచి ఉన్న నీటి ముప్పు
- ఆందోళనలో రైతులు
- జంటనగర వాసులకూ ఇబ్బందులే
- గత సీజన్‌లో సరైన వర్షాల లేకపోవడమే కారణం
నీటి ముప్పు పొంచి ఉంది. ఏటా నీటితో కళకళలాడే మంజీర నది ప్రస్తుతం వెలవెలబోతోంది. రోజురోజుకూ ముదురుతున్న ఎండల కారణంగా మంజీరలో నీటి మట్టం గణనీయంగా పడిపోయింది. ఏటా వేసవిలోనూ నీటితో కళకళలాడే మంజీర నది గత సీజన్‌లో భారీ వర్షాలు కురవకపోడంతో నీరు అంతంత మాత్రంగానే చేరింది. ఫలితంగా పరీవాహకంలో వేసుకున్న పంటలు దెబ్బతినే ప్రమాదం నెలకొంది.
న్యాల్‌కల్: మంజీర నది న్యాల్‌కల్ మండలం మీదుగా జిల్లాలోకి ప్రవేశిస్తుంది. గత సీజన్‌లో జిల్లాలో పెద్దగా వర్షాలు పడకపోవడం, ఎగువ ప్రాంతమైన కర్ణాటకలోనూ భారీ వర్షాలు కురవక పోవడంతో మంజీరలోకి నీరు చేరలేదు. ఫలితంగా నది పరీవాహక ప్రాంతాల పంటలు సాగు చేసుకున్న రైతులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా చెరకు, అరటి పంటలకు మంజీర నది ద్వారానే నీటిని అందిస్తున్నారు. ఇదిలావుండగా జంట నగరాలకు కూడా తాగు నీరు మంజీర ద్వారానే వెళ్తోంది.
ప్రస్తుతం మంజీరలో నీరు అడుగంటుతుండడంతో జంట నగరాలకు నీటి సరఫరా కూడా ప్రశ్నార్థకంగా మారనుంది. మంజీర ఎగువ ప్రాంతం నీరులేక పూర్తిగా ఎండిపోయింది. ఈ ఏడాది ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటుండడంతో మంజీరలో నీటి మట్టం పూర్తిగా పడిపోయే ప్రమాదం ఉంది. ఫలితంగా నది పరీవాహక ప్రాంత పంటలు దెబ్బతినడంతోపాటు తాగు నీటి సమస్య తలెత్తే అవకాశముంది.