రాష్ట్రాల మధ్య ఇసుక చిచ్చు
⇒ మంజీర నదిలో తేలని సరిహద్దులు
⇒ మహారాష్ట్ర అనుమతులు... మన భూభాగంలో తవ్వకాలు
⇒ సరిహద్దు గ్రామాల్లో తరుచూ ఘర్షణలు
కోటగిరి (బాన్సువాడ) : మంజీర నదిలో ఇసుక తవ్వకా లు తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల మధ్య వివాదం రేపుతోంది. నదిలో సరిహద్దుల కొలతలు లేకపోవడంతో పలుమార్లు ఇసుక వివాదాలు తెరపైకి వస్తున్నాయి. నిర్మాణరంగంలో అతిముఖ్యమైన ఇసుక క్వారీ ల నిర్వహణ ఈ వివాదాలకు దారితీస్తోంది. నదిలోని మహారాష్ట్ర భూభాగంలో ఇసుక క్వారీలకు అనుమతులు పొంది తెలంగాణ పరిధి నుంచి ఇసుక తరలిస్తున్నారు. భూగర్భజలాలు అడుగంటిపోతాయనే కారణంతో మం జీరలో నుంచి ఇసుక తవ్వకాలకు మన రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం లేదు. అయితే ప్రతిఏటా మహా రాష్ట్ర ప్రభుత్వం విచ్చలవిడిగా ఇసుక క్వారీలకు అనుమతులు ఇస్తోంది. కాంట్రాక్టర్లు మన భూభాగంలోకి కూడా చొచ్చుకొని ఇసుకను తోడుకెళ్తున్నారు.
దీంతో కోట్లాది రూపాయిల నష్టం జరగుతోంది. ఈ క్రమంలోనే కోటగిరి మండలంలోని సుంకిని గ్రామస్తులకు, మహారాష్ట్రలోని శాఖాపూర్ గ్రామస్తుల మధ్య వివాదం తీవ్రస్థాయికి చేరింది. శుక్రవారం ఇరువురి మధ్య ఘర్ష ణ తలెత్తడంతో రెవెన్యూ, పోలీసు అధికారులు రంగప్రవేశం చేశారు. శాఖాపూర్ ఇసుక క్వారీ నిర్వాహకులు ఓదశలో మన అధికారులు, సుంకిన గ్రామస్తులపై చేయి చేసుకున్నంత పని చేశారు. ఒకేసారి పోలీసులు, రెవె న్యూ సిబ్బంది, గ్రామస్తులు ఎదురు దాడి చేయడంతో వారు పారిపోయారు. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తీస్తున్న జేసీబీని సీజ్‌చేసిన పోలీసులు కోటగిరి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
ఇలా ప్రతిసారి మహారాష్ట్ర ఇసుక నిర్వాహకులు తెలంగాణ సరిహద్దు ప్రాంతంలోకి చొరబడుతూ ఇసుకను తోడేస్తున్నారు. ప్రశ్నించిన వారిపై దౌర్జన్యాలకు దిగుతున్నారు. గతంలో కూడా మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన షెల్‌గావ్ వద్ద కాంట్రాక్టర్లు క్వారీ అనుమతులు పొంది మన భూభాగంలోని ఇసుకను కొల్లగొట్టారు. సరిహద్దులు నిర్ధారించక పోవడంతో మన భూభాగంలోకి చొరబడి ఇసుకను తరలిస్తున్నారు.