
వికారాబాద్‌కు మంజీరా
వికారాబాద్ పట్టణ ప్రజల దాహర్తిని తీర్చేందు కు తక్షణమే మంజీరా జలాలను విడుదల చేయాలని రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. బిల్లులు చెల్లించలేదని నీటి సరఫరాను నిలిపివేయడం సబబుకాదని వ్యాఖ్యానించారు. రాష్ట్ర సర్కారు రక్షిత మంచినీటికి ప్రాధాన్యతనిస్తున్నందున.. పైపులైన్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జలమండలి అధికారులను ఆదేశించారు. శనివారం సచివాలయంలోని తన ఛాంబర్‌లో వికారాబాద్ శాటిటైట్ టౌన్‌షిప్ పనుల పురోగతిని ప్రజారోగ్య, వాటర్‌బోర్డు, మున్సిపల్ అధికారులతో మంత్రి మహేందర్‌రెడ్డి సమీక్షించారు.
వికారాబాద్‌కు వెంటనే మంజీరా జలాల సరఫరాను ప్రారంభిస్తామని, ఏప్రిల్‌లోపు డిమాండ్‌కు అనుగుణంగా 5.4 ఎంజీడీల నీటిని పంపిణీ చే స్తామని వాటర్‌బోర్డు మేనేజింగ్ డెరైక్టర్ ఎం.జగదీశ్వర్ స్పష్టం చేశారు.
పైపులైన్ గుంతలు పూడ్చండి
డ్రైనేజీ పనులను వేగిరంచేయాలని, పైపులైన్ల కోసం తవ్విన గుంతలను యుద్ధప్రాతిపదికన పూడ్చివేయడమేకాకుండా సీసీ రోడ్డు, అంతర్గత పనులను పూర్తిచేయాలని పురపాలక, ప్రజారోగ్య శాఖ ఇంజినీర్లను ఆదేశించారు. సీవరేజీ ట్రీట్‌మెంట్ ప్లాంట్ నిర్మాణ పనుల్లో వేగాన్ని పెంచాలని, అసంపూర్తిగా ఉన్న పనులకు తుదిరూపు ఇవ్వాలన్నారు. ప్రాజెక్టుకు సంబంధించి నిధుల కొరత లేదని, నిధుల ఇబ్బంది ఉంటే తన దృష్టికి తేవాలని కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులకు మంత్రి సూచించారు.
స్థానిక శాసనసభ్యుడు సంజీవరావు మాట్లాడుతూ శాటిలైట్ టౌన్‌షిప్ పనులు నత్తనడకన సాగుతుండడంతో పట్టణవాసులు తీవ్ర ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రూ.200 కోట్ల వ్యయంతో చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేయకపోవడం రెండో దశ నిధుల విడుదలకు కేంద్రం ముం దుకురావడంలేదని పేర్కొన్నారు. నిర్ణీత వ్యవధిలో తొలివిడత పనులు పూర్తి చేసినట్లయితే ఈ సమస్య ఉత్పన్నమయ్యేదికాదన్నారు.మెట్రో వాటర్‌బోర్డు ఎండీ జగదీశ్వర్, జనరల్ మేనేజర్ రాజశేఖర్‌రెడ్డి, పురపాలకశాఖ అడిషనల్ డెరైక్టర్ అనురాధ, ప్రజారోగ్య విభాగం చీఫ్ ఇంజినీర్ ఇంతియాజ్ అలీ, ఎస్‌ఈ యాదగిరి, వికారాబాద్ మున్సిపల్ కమిషనర్ జైతారాం, కాంట్రాక్టు సంస్థ ప్రతినిధి పరమేశ్వర్‌రావు ఉన్నారు.