ఎండీ నుంచి జీఎంల దాకా కొత్తవాళ్లే
ఇద్దరు డైరెక్టర్ల పదవీ విరమణ
స్వచ్ఛందంగా వైదొలగిన మరొకరు
సుదీర్ఘ కాలం తర్వాత ఈడీగా ఐఏఎస్ అధికారి
ఇకనైనా పాలన గాడిలో పడేనా?
సాక్షి, హైదరాబాద్: సుదీర్ఘకాలం తర్వాత జలమండలి యంత్రాంగంలో కొత్త నీరు వచ్చి చేరింది. ప్రధాన కార్యాలయంలో ఏళ్ల తరబడి తిష్ట వేసిన కీలక ఉన్నతాధికారుల పదవీ విరమణ, బదిలీలతో కొత్తవారికి అవకాశం లభించింది. మేనేజింగ్ డైరెక్టర్ నుంచి జనరల్ మేనేజర్ల వరకు కొత్తవారు బాధ్యతలు స్వీకరించారు.
గత నెలలో ఐఏఎస్ అధికారి అశోక్ రెడ్డి బాధ్యతలు చేపట్టగా, రెండు రోజులు క్రితం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా మరో ఐఏఎస్ అధికారి మయాంక్ మిట్టల్ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటికే కీలక విభాగాల ఇద్దరు డైరెక్టర్లు పదవీ విరమణ చేయగా, మరో డైరెక్టర్ స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు.
సుంకిశాల ఘటనలో మరో ప్రాజెక్టు డైరెకర్లపై బదిలీ వేటు పడింది. వారి స్థానంలో కొత్తవారికి బాధ్యతలు అప్పగించారు. మరోవైపు సీజీఏ, జీఎం, డీజీఎం స్థాయి అధికారులకు సైతం స్థానచలనం కలగడంతో యంత్రాంగంలో కొత్తదనం వచ్చింది.
అంతా అస్తవ్యస్తమే..
మహా నగరంలో తాగునీరు సరఫరా, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. ప్రధాన కార్యాలయం నుంచి ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపంతో క్షేత్ర స్థాయి పరిస్థితి అధ్వానంగా మారింది. తాగునీటి సరఫరాలో అడుగడుగునా లీకేజీలు, లోప్రెషర్, కలుíÙత నీటి సరఫరా, లైన్‌మెన్‌ల చేతివాటం, నల్లా అక్రమ కనెక్షన్లు, ఎక్కడపడితే అక్కడ పొంగిపొర్లే మురుగు, పగిలిన మ్యాన్‌హోళ్ల వంటి ఘటనలు సర్వసాధారణంగా మారాయి.
ఫిర్యాదు చేస్తే కానీ స్పందించని పరిస్థితి నెలకొంది. అడుగడుగు చేతివాటంతో బోర్డుకు ఆదాయం కూడా తగ్గుముఖం పట్టింది. తాగునీటి సరఫరా, సీవరేజ్ చార్జీల బకాయిలు కూడా పెద్దఎత్తున పేరుకుపోయాయి.
అంతా ఇష్టానుసారమే..
జలమండలిలో ఉన్నత స్థాయి అధికారుల నుంచి క్షేత్ర స్థాయి సిబ్బంది వరకు పనితీరు ఇష్టానుసారంగా మారింది. ప్రధాన కార్యాలయంతో పాటు సర్కిల్, డివిజన్, సబ్‌డివిజన్, సెక్షన్‌లలో సైతం కనీస సమయపాలన లేకుండా పోయింది.
అంతా ఫీల్డ్ విజిట్ అంటూ మధ్యాహ్నం వరకు ఆఫీస్‌లలో అందుబాటులో లేని పరిస్థితి నెలకొంది. తాజాగా సాధారణ బదిలీలు జరగడంతో సర్కిల్. డివిజన్, సబ్‌డివిజన్లలో సైతం కొత్త ముఖాలు వచ్చి చేరాయి. ఇప్పటికైనా బోర్డు పాలన యంత్రాంగంతోపాటు సిబ్బంది పనీతీరులో మార్పు వచ్చేనా అనే చర్చ సాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment