బోధన్/ బాల్కొండ, న్యూస్‌లైన్: అధికారుల హెచ్చరికలు, చర్యల వల్ల ఇసుక అక్రమ రవాణాకు బ్రేక్ పడటం లేదు. రెవెన్యూ, పోలీసు, మైనింగ్ శాఖల అధికారులు స్థానిక, సార్వత్రిక ఎన్నిక విధుల్లో తలమునకలై ఉండగా ఇదే అదనుగా అక్రమార్కులు ఇసుక దందాను మొదలు బెట్టారు. కొన్ని వారాల నుంచి మంజీరా నది నుంచి ఇసుక అక్రమ రవాణా కొనసాగిస్తున్నారు. బోధన్ ప్రాంతంలో గోదావరి, మంజీరా, హరిద్రా (పసుపు వాగులు) నదులు పారుతున్నాయి. పలు వాగుల్లో ఇసుక మేటలున్నాయి. ఈ జలవనరులు నుంచి సులభమైన మార్గాల ద్వారా ట్రాక్టర్లతో ఇసుక రవాణా సాగిస్తున్నారు. రెండు నెలల క్రితం బోధన్ సబ్ కలెక్టర్ హరినారాయణన్ ఇసుక అక్రమ రవాణాకు కేంద్రంగా ఉన్న గ్రామాలను గుర్తించి వరుస దాడులు చేయగా కొన్ని మండలాల్లో ఇసుక రవాణాకు బ్రేక్ పడింది.
మంజీరా తీరాన..
బోధన్ మండలంలో మంజీరా పరివాహక ప్రాంతంలో ఉన్న మందర్న, హున్సా, ఖాజాపూర్, సాలూర, తగ్గెల్లి గ్రామాలు కేంద్రంగా ఇసుక రవాణా సాగుతోంది. మంజీరా నది నుంచి పదుల సంఖ్యలో ట్రాక్టర్ల ద్వారా ఇసుక రవాణ చేస్తున్నారు. ఇసుక కుప్పలు పోసి, కామారెడ్డి, నిజామాబాద్, హైదరాబాద్ దూర ప్రాంతాలకు భారీ వాహనాల్లో తరలిస్తున్నారు.
నిఘా నామమాత్రమే..
గతంలో ఇసుక అక్రమ రవాణాను నియంత్రించేందుకు మంజీరా పరివాహక ప్రాంత గ్రామాల వీఆర్‌ఓలు, గ్రామ సేవకులతో కాపాలపెట్టారు. తహశీల్దార్, మండల రెవెన్యూ, ఇన్‌స్పెక్టర్లు నిఘాను పర్యవేక్షించారు. మరోవైపు పోలీసు సిబ్బంది రాత్రి వేళల్లో గస్తీ నిర్వహించి ఇసుక లారీలు స్వాధీనం చేసుకునేవారు. ప్రస్తుతం మండల స్థాయి రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు ఎన్నికల విధుల్లో ఉన్నందున ఇసుక రవాణాపై అంతగా దృష్టి సారించ లేకపోతున్నారు. ఉన్నతాస్థాయి అధికారులు కఠిన చర్యకు ఆదేశాలిస్తే ఇసుక దందాకు బ్రేక్‌లు పడే అవకాశాలుంటాయని, కింది స్థాయి రెవెన్యూ సిబ్బందిలో అభిప్రాయం వ్యక్తమవుతోంది.
రాత్రయితే చాలు..
బాల్కొండ నియోజకవర్గ పరిధిలో ప్రవహించే పెద్దవాగు ఇసుక వ్యాపారులకు కల్పతరువుగా మారింది. దీంతో ఇసుక రవాణాకు అడ్డూఅదుపు లేకుండాపోయింది. మండలంలోని రెంజర్ల, నాంగపేట్, నల్లూర్ మీదుగా జాతీయ రహదారి 44గుండా ఆదిలాబాద్ జిల్లావైపు నిత్యం పదుల సంఖ్యలో టిప్పర్ల ఇసుక తరలి పోతుంది. మోర్తాడ్ మండలం వైపు నుంచి ఇసుక టిప్పర్లు జోరుగా వస్తున్నాయి. ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు టిప్పర్ నిండా కూలీలు మోర్తాడ్ మండలం వైపు ప్రయాణమవుతారు. రాత్రంతా పదుల టిప్పర్లు ఇసుకను తరలిస్తాయి. మళ్లీ మర్నాడు ఉద యం టిప్పర్ నిండా ఇసుక దానిపై కూలీలు కూర్చుని వస్తారు. ఇలా సుమారు 15 రోజులుగా ఈ దందా సాగుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదు. మామూళ్ల మత్తులో ఉన్న అధికారులు ఇసుక వ్యాపారులను పట్టుకోవడంలేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఆగని ఇసుక రవాణా
Published Sat, May 10 2014 3:53 AM | Last Updated on Tue, Oct 9 2018 4:48 PM
Advertisement