ప్రాణాలు పోతున్నా పట్టదా? | bodhan-hyderabad road become dangerous with maharashtra sand lorrys | Sakshi
Sakshi News home page

ప్రాణాలు పోతున్నా పట్టదా?

Published Wed, Jun 24 2015 7:26 AM | Last Updated on Wed, Apr 3 2019 5:38 PM

మహారాష్ట్ర నుంచి బోధన్ ద్వారా హైదరాబాద్‌కు వెళ్తున్న ఇసుకలారీలు ఇందూరు ప్రజల పాలిట మృత్యుశకటాలుగా మారాయి.

  •    ఇందూరు ప్రజలకు సంకటంగా 'మహా' ఇసుక
  •      ఏస్గి, బోలేగామ్, మాచునూర్ క్వారీల లారీలు
  •      ఓవర్‌లోడ్ పట్టని రవాణా, పోలీసు అధికారులు
  •      మృత్యు రహదారిగా బోధన్-హైదరాబాద్ రోడ్డు
  •      రెండు నెలలలోనే ఏడుగురి మృత్యువాత
  •      తాజాగా అక్బర్‌నగర్‌లో ఇసుకలారీ ఢీ.. ఇద్దరు మృతి

  •  సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : మహారాష్ట్ర నుంచి బోధన్ ద్వారా హైదరాబాద్‌కు వెళ్తున్న ఇసుకలారీలు ఇందూరు ప్రజల పాలిట మృత్యుశకటాలుగా మారాయి. బోధన్ నుంచి హైదరాబాద్‌కు నిత్యం వందల లారీలు ఓవర్‌లోడ్‌తో వెళ్తున్నా, పోలీసు, రవాణా శాఖ అధికారులకు పట్టడం లేదు. ఫలితంగా ఇదే రహదారిపై రెండు నెలల వ్యవధిలో ఇసుక లారీలు ఢీకొ ట్టి  ఏడుగురు మృత్యువాతన పడగా, తాజాగా మంగళవారం రాత్రి వర్ని మండలం అక్భర్‌నగర్ సమీపంలో మరో ఇద్దరి ప్రాణాలను ఇసుకలారీ బలి తీసుకుంది.‘కాసు ల’ కోసం కక్కుర్తి పడుతున్న కొందరు అధికారుల కారణంగా బోధన్-హైదరాబాద్ రహదారిపై ప్రయాణించే వారికి భద్రత కరువవుతోంది. పోలీసుశాఖ పరంగానైతే ఈ రహదారి ఇద్దరు డీఎస్‌పీలు, ఐదుగురు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ల పరిధిలోకి వస్తుంది. రవాణా శాఖకు సంబంధించి ఇద్దరు ఎంవీఐలు, ఇతర అధికారులు పర్యవేక్షిస్తారు. అయినప్పటికీ అడ్డూ అదపు లేకుండా రోజుకు వందల సంఖ్యలో ఓవర్‌లోడ్ ఇసుక లారీల దూకుడుకు అభం శుభం తెలియని అమాయకులు బలవుతున్నారు. ఇసుక లారీలు అమాయకుల ప్రాణాలు తీస్తున్నా పట్టించుకోరా అంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
     ప్రాణాలు హరిస్తున్న ఏస్గి, బోలేగామ్, మాచునూర్ క్వారీలు
     పట్టా భూములలో ఇసుక తవ్వకాల పేరిట ఏస్గి, బోలేగామ్, మాచునూరులలో క్వారీలు పొందిన 'ఇసుక మాఫియా'తెలంగాణ భూభాగంలోని మంజీర నదికి తీవ్ర  గర్భశోకాన్ని మిగుల్చుతోంది. కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి అనుచరుడు, మరో ఇద్దరు కలిసి మాచునూరులో ఇసుక దందా కొనసాగిస్తుం డగా.. ఏస్గి, బో లేగామ్ క్వారీల అనుమతులు పొంది, జిల్లాలో స్థిరపడిన ఒకరు ఇటీవలే హైదరాబాద్ 'ఇసుక మాఫియా'కు రూ.3 కోట్ల లాభంతో విక్రయిం చినట్లు సమాచారం. అయితే ఈ మూడు క్వారీలకు సంబంధించి మహారాష్ట్ర పట్టాభూములలో అనుమతి పొంది సైతం సరిహద్దు మంజీర నదినే తోడేస్తున్నారు. రోజుకు 200 నుంచి 300 టిప్పర్ల చొప్పున ఇసుకను తరలిస్తున్నారు. సాలూర సమీకృత ఉమ్మడి తనిఖీ కేంద్రం ద్వారా హైదరాబాద్, కామారెడ్డి, నిజామాబాద్ తదితర ప్రాంతాలకు దర్జాగా లారీలు తరలిపోతున్నాయి. చెక్‌పోస్టులో ఉండే వాణిజ్యపన్నులు, రవాణా, రెవెన్యూ తదితర శాఖలు కళ్లు మూసుకోగా..అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణాను అరికట్టాల్సిన మైనింగ్, పోలీసు, రెవెన్యూ, రవాణాశాఖల అధికారులు కొందరు అటువైపు చూడటమే లేదు. దీంతో ఈ అక్రమ ఇసుక దందాలో వారు ఎంత మిళితం అయ్యారో అర్థం చేసు కోవచ్చు.
     అనుమతి అక్కడ... తోడేది ఇక్కడ
     మహారాష్ట్ర-తెలంగాణ సరిహద్దుగా ఉన్న మంజీర నది నుంచి ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతుంది. ఏస్గి, బోలేగామ్, మాచునూర్ క్వారీలో మహారాష్ట్రలో ఉ న్నా... అక్కడ పట్టాభూముల పేరిట అనుమతులు పొందిన వారు తెలంగాణ భూభాగంలోనే తవ్వకాలు చేస్తున్నారు. బోధన్ మండలంలోని మందన్న, హున్సా, ఖాజాపూర్, సాలూరు, తగ్గెల్లి,  కలుదుర్గి గ్రామాలు మంజీర నదికి తెలంగాణ సరిహద్దు గ్రామాలుగా ఉండగా గంజిగావ్ , కార్ల , మసునూరు , హున్‌కుందా, సగ్రోళి , బోలె గామ్, చెల్‌గాం, చౌరాలు మహారాష్ట్ర సరిహద్దు ప్రాం తాలుగా ఉన్నాయి. అక్కడి ఈ ఇసుక క్వారీలను మన రాష్ట్రానికి చెందినవారే వేలంలో దక్కించుకోవడం... పట్టాభూములలో సైతం ఇసుకమేటల తొలగింపునకు మనవాళ్లే ముందుపడుతున్నారు. దీంతో మన సరిహద్దు గ్రామాల పరిధిలో క్వారీలు ఏర్పాటు చేసుకుని అక్రమంగా ఇసుక ను తరలిస్తున్నారు. దీంతో భూగర్భజలాలు అడుగంటిపోయి పంటపొలాలు దెబ్బతింటున్నాయి. తాజాగా నాందేడ్ జిల్లా బిలోలి తాలుకా యెస్గి శివారు పట్టాభూముల పేరిట ఇసుక తవ్వకాలకు అనుమతి పొందిన జిల్లాకు చెందిన కొందరు.. జిల్లా శివారులోని మంజీరను తోడేస్తూ పెద్దమొత్తంలో ఇసుక తరలిస్తుండటం చర్చనీయాంశంగా మారింది.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement