భోపాల్ : మధ్యప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. ఇసుక మాఫియాపై దర్యాప్తు చేస్తున్న జర్నలిస్ట్ ఒకరు హత్యకు గురికావటం కలకలం రేపుతోంది. అందుకు సంబంధించిన వీడియో ఒకటి మీడియాలో హల్ చల్ చేస్తోంది.
సందీశ్ శర్మ అనే పాత్రికేయుడు భిండ్ జిల్లాలో ఇసుక అక్రమ రవాణాపై కథనాలు రాస్తున్నారు. ఈ అవినీతిలో ఉన్న ప్రజా ప్రతినిధుల పేర్లను పూర్తి ఆధారాలతో బయటపెడతానని ఆయన చెప్పారు కూడా. అయితే సోమవారం ఉదయం ఆయన విధులకు వెళ్తున్న క్రమంలో ఓ లారీ ఆయన్ని ఢీ కొట్టింది. వెంటనే లారీ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. వారొచ్చి సందీప్‌ను ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. యాక్సిడెంట్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని సందీప్ కుటుంబ సభ్యులకు అందజేశారు.
జర్నలిస్టుల ధర్నా..
కాగా, ఆయనది యాక్సిడెంట్ కాదని.. ముమ్మాటికీ హత్యేనని ఎస్పీ కార్యాలయం ఎదుట జర్నలిస్ట్ సంఘాలు ధర్నా చేపట్టాయి. సీసీ ఫుటేజీ అది యాక్సిడెంట్ కాదని చెబుతోందని వారు ఎస్పీతో వాదించారు. దీంతో ఎస్పీ ఈ ఘటనపై దర్యాప్తునకు ‘ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని’(సిట్) నియమిస్తున్నట్లు వెల్లడించారు. మరోవైపు కుటుంబ సభ్యులు కూడా ఇది హత్యేనని వాదిస్తున్నారు. కాగా, సందీప్ తన ప్రాణాలకు హాని ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన 24 గంటల్లోనే ఈ ఘటన చోటు చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment