ఖేడ్ జిల్లా కోసం మంజీర నదిలో పుణ్యస్నానాలు
- జ్ఞానసరస్వతీకి వినతిపత్రంఽ
- జేఏసీ ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమం
నారాయణఖేడ్: నారాయణఖేడ్ కేంద్రంగా మంజీర జిల్లా ఏర్పాటు చేయాలని కోరుతూ జిల్లా సాధన సమితి బాధ్యులు ఆదివారం వినూత్న కార్యక్రమాలు నిర్వహించారు. నారాయణఖేడ్ నియోజక వర్గానికి సరిహద్దులో గల పుల్‌కుర్తి వద్ద మంజీర నదిలో పుణ్యస్నానాలు ఆచరించచారు. అనంతరం సరస్వతీ ఆలయంలో అమ్మవారి పేరిట పూజారికి వినతి పత్రం అందజేశారు. జిల్లా సాధన సమితి జేఏసీ కన్వీనర్ అశోక్ తోర్నాల్ మాట్లాడుతూ బంగారు తెలంగాణలో భాగంగా బంగారు నారాయణఖేడ్ చేసేందుకు కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంత ప్రజల సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలకు ఆలవాలంగా ఉన్న ఈ ప్రాంతాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసి అభివృద్ధికి తోడ్పడాలని సీఎం కేసీఆర్‌ను కోరారు. మంజీర నదిలో పూజలు చేయడంతోపాటు దీపాలు వదిలినట్టు చెప్పారు. కార్యక్రమంలో జేఏసీ ప్రధాన కార్యదర్శి సిద్దారెడ్డి, కార్యదర్శులు కె.సంత్‌చారి, శంకర్, సర్దార్, కోశాధికారి కుమార్ స్వామి, మల్లేశ్, బస్వరాజ్, బాబు పాల్గొన్నారు.