
పాపన్నపేట(మెదక్): బీళ్లు వారిన మంజీరా నది పరవళ్లు తొక్కుతోంది. సింగూరు నుంచి మంగళవారం విడుదల చేసిన 1.6 టీఎంసీల నీరు వరదై పోటెత్తింది. మంజీర బ్యారేజి నుంచి 2 గేట్లు ఎత్తి వదిలిన నీరు 9,800 క్యూసెక్కుల పరిమాణంలో పరుగులు తీస్తోంది. ఎడారిలా మారిన మంజీర గర్భాన్ని తడుపుకుంటూ.. మార్గం మ«ధ్యలో చిన్న చిన్న మడుగులు నింపుకుంటూ.. గురువారం రాత్రికి ఘనపురం ప్రాజెక్టులోకి ప్రవేశించాయి. దీంతో ఘనపురం ఆనకట్ట కింద.. మంజీర తీరం వెంట వేసిన వరి పంటకు ప్రాణం పోసినట్లయింది. ఇక ఘనపురం ఆనకట్ట కింద ఉన్న 15 వేల ఎకరాల పంటలు గట్టెక్కినట్లేనని రైతన్నలు ఆనంద పరవశులవుతున్నారు. అయితే రైతన్నల ఆశలకతీతంగా సింగూరు నుంచి విడిచిన 1.6 టీఎంసీల నీటితో ఘనపురం ప్రాజెక్టు కింద వేసిన పంటలతో పాటు, నిజాంసాగర్ ఆయకట్టుకు కూడా ప్రయోజనం కలగనుంది. సుమారు టీఎంసీ నీరు దిగువన ఉన్న నిజాంసాగర్‌కు చేరనుంది. ఈ ఏడాది వర్షాకాలంలో ఆశించిన వర్షాలు కురువలేదు. అయినా ఆశ చావని రైతన్నలు జూన్ నెలలోనే మంజీర మడుగుల్లో నిలవ ఉన్న నీటిని.. బోరుబావుల ఊటలను నమ్ముకొని 18 వేల ఎకరాల్లో వరి సాగుచేశారు.
కింది పొలాలను దృష్టిలో ఉంచుకొని..
సింగూరు ఎగువన సైతం వర్షాలు పడక పోవడంతో సింగూరు నిండలేదు. 29 టీఎంసీల సామర్థ్యం గల ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం 7.17 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ఇందులో మిషన్ భగీరథకే 6 టీఎంసీల నీరు అవసరం కానుంది. దీంతో సింగూరు నుంచి ఘనపురం ప్రాజెక్టుకు చుక్క నీరు కూడా విడుదల కాలేదు. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో సుమారు 3 వేల ఎకరాల వరి పంట ఎండిపోయింది. దీంతో రైతన్నల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. మాజీ డిప్యుటీ స్పీకర్ పద్మాదేవేందదర్‌రెడ్డి అపద్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడి నీటి విడుదలకు కృషి చేశారు. సాధారణంగా అయితే ఘనపురం ప్రాజెక్టుకు ప్రస్తుత తరుణంలో 0.4 టీఎంసీలు సరిపోతాయని అంచనా. అయినప్పటికీ ప్రాజెక్టు దిగువన ఉన్న పంటపొలాలను, నిజాంసాగర్ ఆయకట్టు ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకున్న కేసీఆర్ 1.6 టీఎంసీల నీటి విడుదల కోసం జీఓ విడుదల చేశారు. విడుదల చేసిన నీరు, రెండు రోజుల పాటు, ఘనపురం ఆనకట్ట పై నుంచి పొంగి పొర్లనుందని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. వరదలు ఉదృతంగా ఉండే అవకాశం ఉన్నందున నది వైపు ఎవరూ వెళ్లొద్దని ఇరిగేషన్ ఈఈ యేసయ్య సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment