నీళ్లు లేక జనావాసాల్లోకి వస్తున్న మొసళ్లు
నీళ్లు లేక మంజీరా నది ఎండిపోతుండటంతో నదిని ఆవాసంగా మార్చుకున్న జీవులు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. దీంతో మంజీరా పరివాహక ప్రాంతాల వాసులు భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. మంజీరా నది నుంచి మంగళవారం నాడు ఒక మొసలి బయటకు వచ్చింది. మెదక్ జిల్లా మనూరు మండలం ఎన్జీ హుక్రానా శివారులోని స్థానికుల కంటబడింది.
నదిలోంచి వచ్చిన మొసలి స్థానిక ఎస్సీ కాలనీలోని మురుగు కాల్వలోకి ప్రవేశించింది. కాల్వలో కాసేపు ఉన్న మొసలి స్థానిక రైతు నర్సింహారెడ్డికి చెందిన చెరుకు తోటలోకి వెళ్లింది. స్థానికులు నారాయణ ఖేడ్ అటవీశాఖ అదికారులకు సమాచారం అందించారు. వన్యప్రాణుల విభాగం అధికారులు వచ్చి మొసలిని బంధించి సంగారెడ్డి వద్ద ఉన్న మొసళ్ల సంరక్షణ కేంద్రానికి తరలించారు. దీంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. పట్టుబడిన మొసలి 10 అడుగుల పొడవు, 250 కిలోల బరువు ఉందని అధికారులు తెలిపారు. కాగా.. గత వారం ఇదే ప్రాంతంలో మంజీరా నది నుంచి ఓ మొసలి జనావాసాల్లోకి వచ్చింది.