ద్వంద్వ నీతి వారి రీతి! | America dual Ethics | Sakshi
Sakshi News home page

ద్వంద్వ నీతి వారి రీతి!

Dec 21 2013 11:49 PM | Updated on Apr 4 2019 3:25 PM

ద్వంద్వ నీతి వారి రీతి! - Sakshi

ద్వంద్వ నీతి వారి రీతి!

హాస్యాస్పద కారణాలను సుదీర్ఘంగా ఏకరువు పెడుతూ గొప్ప ఘటనలను నమోదు చేయడంలో అగ్రతాంబూలం నిస్సంశయంగా 1950లలో అమెరికా అనుసరించిన పాక్ విధానానికే దక్కుతుంది.

ఎం జె అక్బర్, సీనియర్ సంపాదకులు

అహంకారం అతిశయించిన ఒక అమెరికన్  అధికారి దేవయానితో క్రూరంగా వ్యవహరించారు. ఈ సందర్భంగా తలెత్తిన ఉద్రిక్తతలు ప్రభుత్వాల మధ్య సమసిపోయాక కూడా ప్రజాభిప్రాయంలో గూడుకట్టుకొని ఉంటాయి. దీన్ని రెండు  ప్రభుత్వాలు త్వరగా గుర్తించడం అవసరం.

 హాస్యాస్పద కారణాలను సుదీర్ఘంగా ఏకరువు పెడుతూ గొప్ప ఘటనలను నమోదు చేయడంలో అగ్రతాంబూలం నిస్సంశయంగా 1950లలో అమెరికా అనుసరించిన పాక్ విధానానికే దక్కుతుంది. అద్భుతమైన ఈ ప్రస్తావనను అందించినందుకు నేను  స్టీఫెన్ రోజర్ కింజెర్ రచించిన ‘ది బ్రదర్స్’ పుస్తకానికి ధన్యవాదాలు తెలపాల్సి ఉంది. డ్వైట్ ఐసెన్ హోవర్ ప్రభుత్వ ఎనిమిదేళ్ల పరిపాలనా కాలంలో పరిశుద్ధవాది జాన్ ఫోస్టర్ డల్లెస్ విదేశాంగ మంత్రిగానూ, అంతకుమించిన శృంగార పురుషుడైన ఎలెన్ సీఐఏ అధిపతిగానూ పని చేశారు. అమెరికా చరిత్రలోనే అత్యంత శక్తివంతమైన సోదరుల జోడి వారిదే. విధ్వంసక చోదకుల్లాగా వారిద్దరూ ప్రపంచ పరిరక్షణకు రంగంలోకి దిగి ప్రపంచ పటంలోని అతి పెద్ద భాగాలను నెత్తుటి మరకలు నిండిన నలుపు తెలుపు చలన చిత్రంలా మార్చారు.

 ఏమాటకామాటే చెప్పాలి. దేశభక్తి పేరిట లక్షలాది మందిని హతమార్చిన పాశవిక యుద్ధం నుంచి వారిద్దరూ అప్పుడే వచ్చారు. పైగా యూరప్‌కు గుండెకాయలాంటి ప్రాంతంలోనే ఒక సామూహిక జాతి నిర్మూలనా మారణకాండ జరిగింది. అవి పునరావృతం అవుతాయేమోననే భయం వారికి ఉండేది. వారు ధరించిన ముసుగులు, ఝళిపించిన కత్తులు అమెరికా శతృవులకు ఎంత నష్టాన్ని కలిగించాయో అమెరికాకు కూడా అంతే నష్టాన్ని కలిగించాయి.  అయితే జాన్ ఫోస్టర్ తెలివి మాలినతనం మాత్రం ఎలాంటి వివరణకూ అందేది కాదు.  

 పాకిస్థాన్‌ను కమ్యూనిస్టు వ్యతిరేక నైరుతి ప్రాంత కూటమి ‘సీటో’లో (ఎస్‌ఈఏటీఓ)లో చేర్పించాలని డల్లెస్ మహా ఉత్సుకతను ప్రదర్శించేవారు. డల్లెస్ డ్రాయింగ్ బోర్డుపై పరిచిన సీటో పటం... ఇరాక్, ఇరాన్‌ల నుంచి ఇండోనేసియా వరకు విస్తరించి ఉండేది. చీలికలై ఉన్న పాకిస్థాన్ పౌర రాజకీయవేత్తలపై డల్లెస్ ఆశలు వదిలేసుకోవాల్సి వచ్చింది. దీంతో చాకచక్యంగా పౌర ప్రభుత్వం ద్వారానే కొత్తగా ఆవిర్భవించిన ఆ దేశ జనరల్స్‌ను... వారు కాదనలేని కానుకగా ఆయుధాలను సమర్పించి ప్రసన్నం చేసుకున్నారు. ఆ వారసత్వమే పాక్ సైనిక బ్యారక్ ల్లో పేరాశలు పెంపొందడానికి, పర్యవసానంగా సైనిక కుట్రలకు దోహద పడింది.

 పాత్రికేయుడు వాల్టర్ లిప్‌మ్యాన్‌కు  ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో డల్లెస్ పాక్ పట్ల తన వైఖరిని  వివరించారు.  ‘‘ఆసియా దక్షిణ ప్రాంతంలో  నిజమైన పోరాట యోధులను కొందరిని సంపాదించడం అవసరం. ఆ ప్రాంతంలో ఉన్న నిజమైన పోరాట యోధులు పాకిస్థానీలే. కాబట్టి వారు ఈ కూటమిలో ఉండటం నాకు కావాలి. గూర్ఘాలు లేకుండా మనం ఈ ప్రాంతంలో  ఎన్నటికీ సంబాళించుకురాలేం.’’
 ‘‘కానీ, గూర్ఖాలు పాకిస్థానీలు కారు కదా’’ అని అయోమయానికి గురైన లిప్‌మ్యాన్ ప్రశ్నించారు.

  ‘‘బావుంది. వాళ్లు పాకిస్థానీలు కాకపోతే కాకపోయారుగానీ ముస్లింలే కదా’’ అన్నారు డల్లెస్.

  ‘‘కాదు, వాళ్లు ముస్లింలు కూడా కాదనే అనుకుంటున్నాను.’’

  ‘‘అయినా ఫర్వాలేదు!’’ అంటూ విస్మయాన్ని వ్యక్తం చేసి అదే తలబిరుసుతనంతో మరో అరగంట పాటూ... కమ్యూనిస్టులు మన పడక గదుల్లో భయబీభత్సాలను సృష్టించడాన్ని నివారించడం ఎలాగో సుదీర్ఘంగా ఏకరువు పెట్టారు.  

 నేటి విదే శాంగ మంత్రి జాన్ కెర్రీకి ఆయన కంటే బాగానే భౌగోళిక శాస్త్రం, చరిత్ర, మతం గురించి తెలుసు. అయినాగానీ తలెత్తుతున్న చిన్న, పెద్దా ఘటనలను చూస్తుంటే ఎవరిైకైనా గానీ... అమెరికా రాజధాని వాషింగ్టన్‌కు మిగతా ప్రపంచానికి మధ్య ఉన్న దూరం ఎంత?  మిగతా ప్రపంచానికి వాషింగ్టన్‌కు మధ్య ఉన్న దూరం ఎంత? అని ఆశ్చర్యం కలుగక మానదు.

 అమెరికన్ శతాబ్దపు అంటే ఇరవైయ్యవ శతాబ్దపు అమెరికా విధానంలో ఒక ఆసక్తికరమైన అశం ఉంది. దాన్ని అతి తరచుగా ఏకాకివాదంలోకి తిరోగమించే వైఖరిగా పేర్కొనడం జరుగుతోంది. కానీ అది పూర్తిగా సరి కాదు. అమెరికా ఏకపక్షవాది అయినంతగా ఏకాకివాదీ కాదు, జోక్యందారీవాదీ కాదు. ప్రపంచంలో దానికి సైనిక ఆధిక్యత ఉండటం అనే వాస్తవం నుంచీ, దాన్ని అగ్రరాజ్య సంస్కృతిని వాణిజ్య, ప్రజావినోద రంగాల్లో క్రమక్రమంగా అందరిపైనా రుద్దడం  నుంచీ పుట్టుకొచ్చే ప్రాపంచిక దృక్పథం అది. పరాజితులకు కూడా తమ రాజ్యమే ఉత్తమమైనదని రోమన్లు చిత్తశుద్ధితో విశ్వసించేవారు. అమెరికన్లు కూడా తమ ప్రభుత్వ రూపాలు, తమ విలువలూ నాగ రికతకు మారుపేర్లని అంతే చిత్తశుద్ధితో విశ్వసిస్తారు. అయితే అమెరికా రోమన్లకు భిన్నంగా  ఇతర దేశాలను స్వాధీనం చేసుకోవడం కంటే తన ఛత్రఛాయల కిందకు తెచ్చుకోవడాన్ని కోరుకుంటుంది. ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ దాని మౌలిక విలువలు కావడమే అందుకు కారణం. అయితే నచ్చజెప్పడంలో విఫలమైతే, నాగరికతను విస్తరింపజేసే బాధ్యత అతి సునాయసంగా పెంటగాన్‌కు బదలాయింపు అవుతుంది.

 ఆ ప్రాపంచిక దృక్పథం ఫలితంగానే ఎలాంటి వాదోపవాదాలు లేకుండానే అమెరికా అగ్రరాజ్య న మూనా ఉత్తమమైనదై పోతుంది. స్థూలంగా  చట్టసభల పని తీరు నుంచి సూక్ష్మ స్థాయిలో ఇంటి పనిమనిషి సేవలకు సంబంధించిన ఏర్పాట్ల వరకు ఆ నమూనాయే ఆధిక్యతను సాధిస్తుంది. ఆ నమూనాకు ప్రత్యామ్నాయం ఏదైనాగానీ దాన్ని అన్యాయమైనదిగా, అసమగ్రమైన దిగా లేదా చట్టవిరుద్ధమైనదిగా అది తోసిపుచ్చుతుంది. అయితే ఈ తర్కం ఎప్పుడూ ఇరు దిశాలలోనూ పనిచేయక పోవచ్చు. భారత్‌లో పనిచేసే ఒక అమెరికన్ అమెరికా జీతాన్ని పొందుతాడు. సాంకేతికంగా అమెరికా భూభాగమే అయిన ఢిల్లీ రాయబార కార్యాలయంలోని వంటవాళ్లకు అమెరికన్ ప్రమాణాల ప్రకారం వేతనం చెల్లించడం జరగకపోయే అవకాశమే ఎక్కువ. 
 
 అమెరికా ప్రపంచంపై ద్రవ్యపరమైన అసమానతలను రుద్దడమే కాదు వాటిలో అంతర ్గర్భితమై ఉండే ఆధిక్యతా భావాన్ని... అగ్రరాజ్యానికి ఒకటి, మిగతా ప్రపంచానికి మరొకటి అని రెండు వేరు వేరు చట్టాలు ఎప్పుడూ ఉంటాయనే భావనను కూడా రుద్దుతుంది. ఉదాహరణకు అమెరికన్ కాంట్రాక్టర్‌గా చలామణి అవుతూ లాహోర్‌లో పట్టపగలు ఇద్దర్ని చంపిన తమ  గూఢచారికి దౌత్యపరమైన రక్షణను వర్తింపజేయాలని డిమాండు చేసి అమెరికా సాధించుకోగలిగింది. ఈ దగాకోరుతనాన్ని అమెరికాతో సంబంధాల కోసం చెల్లించాల్సిన మూల్యంగా పాకిస్థాన్ ఆమోదించింది. ఇతర దేశాలు అంత ఆనందంగా అందుకు అంగీకరించలేకపోవచ్చు. ఆ దేశాల్లోని ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్నాలు ప్రజాభిప్రాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి రావడం అందుకు ముఖ్యమైన కారణం కావచ్చు.

 ప్రభుత్వాలు కొన్నిసార్లు తప్పుడు కారణాలను చూపి పరిస్థితులను సరిదిద్దవచ్చు.  కానీ వీధుల్లోని ప్రజల విషయంలో అది చాలా కష్టం. దేవయాని ఖోబ్రగడే కేసులో... అమెరికాలోని చట్టాన్ని అమలుపరిచే అధికారి ఒకరు అహంకారం అతిశయించి భారత దౌత్యవేత్తతో క్రూరంగా వ్యవహరించారు. ఈ కేసుకు సంబంధించి తలెత్తిన ఉద్రిక్తతలు ప్రభుత్వంలో సమసిపోయిన తర్వాత కూడా చాలా కాలం ప్రజాభిప్రాయంలో గూడు కట్టుకొని ఉంటాయి. అమెరికా, భారత ప్రభుత్వాలు ఈ విషయాన్ని త్వరగా గుర్తించాల్సిన అవసరం ఉంది. రంధ్రానికి కాసింత తారు పూయడానికి కక్కుర్తిపడి నౌకను పోగొట్టుకోకూడదు.     
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement