ఉభయ తారకం మైత్రీ బంధం | The five-day visit to the United States, Prime Minister Narendra Modi | Sakshi
Sakshi News home page

ఉభయ తారకం మైత్రీ బంధం

Published Sat, Sep 27 2014 11:11 PM | Last Updated on Thu, Apr 4 2019 4:25 PM

ఉభయ తారకం మైత్రీ బంధం - Sakshi

ఉభయ తారకం మైత్రీ బంధం

జాతీయ ప్రయోజనాల బంధనాల నుండే అత్యుత్తమ వ్యూహాత్మక భాగస్వామ్యం ఉద్భవిస్తుంది. రెండు దేశాల జాతీయ ప్రయోజనాలు కలగలిసిపోయేది అక్కడే. చాలాకాలంగా భారత్, అమెరికా ప్రభుత్వాల మధ్య విశ్వాసం లోపించడంతో ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్నాయి. వాటిని మరమ్మతు చేయడం మోదీ, ఒబామాల ముందున్న సవాలు.
 
 ప్రధాని నరేంద్రమోదీ ఐదు రోజుల అమెరికా పర్యటనలో న్యూయార్క్ నగర ప్రజలను ఉద్దేశించి, ఆ దేశ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడను న్నారు. ప్రవాస భారతీయుల్లో ఆయన అప్పుడే ఒక తరానికి సరిపడా ఉద్వేగోత్సాహాలను రేకెత్తించారు. ప్రభుత్వాధికారులు, శాసనకర్తలు, విద్యావేత్తలు. ఇంటెలిజెన్స్ అధికారుల నిలయమైన రాజధాని వాషింగ్టన్ గంభీరమైన, ఉదాసీన నగరం. ఉపన్యాస కళను పునర్ నిర్వచించడాన్ని ప్రారంభించి, ఇటీవలి కాలంలో అరుదైన తీరున దౌత్యనీతిని శక్తివంతం చేస్తున్న అసాధారణ భారతీయ నేత పేరు ఆ నగరంలో సైతం మారు మోగడం మొదలైంది.

నరేంద్ర మోదీ, బరాక్ ఒబామాలు ఇద్దరూ అద్భుత వాక్చాతుర్యం కలిగిన ప్రజాస్వామిక ఉపన్యాసకుల విశిష్ట వర్గానికి చెందినవారే. ఆ విషయంలో ప్రధానంగా వారిద్దరూ ఒకరితో ఒకరు పోటీపడాల్సినవారే. భాష ఎంత పురాతనమైనదో ఉపన్యాస కళ కూడా అంతే పురాతనమై నది. ఫ్రెంచి విప్లవ కాలంలో ఆధునికార్థంలో అది ఒక రాజకీయ ఆయుధంగా మారింది. దిగువస్థాయి ప్రజలతో మాట్లాడటమంటేనే గౌరవానికి భంగకరంగా భావించిన ఫ్రాన్స్ రాజును, అతనిని అనుకరించిన ఆయన మంత్రు లను కూలదోసినది అలాంటి వాక్పటిమా శక్తే. రాజుల చెరసాలల్లో బందీగా ఉన్న ఉపన్యాస కళను విప్లవం విడుదల చేసింది. తద్వారా ఉపన్యాస కళ భావాల సేనా శ్రేణుల రక్షణలో వర్తమాన ప్రజాస్వామ్యానికి సుదీర్ఘ పయనం సాగించింది. ఆ సుదీర్ఘ ప్రయాణంలోనే అది సమానత్వవాదాన్ని సుస్థాపితం చేసింది. భారత అమెరికాలు స్వేచ్ఛాభీష్టపు ఖజానాలు మాత్రమే కాదు. అవకాశా లను పెంపొందింపజేసే సుసంపన్నవంతమైన గనులు.

దౌత్యం అంటే వైరుధ్యాలను నియంత్రించి, సంఘర్షణను పరిమితం చేసి, సానుకూల అవకాశాలను ఉపయోగించుకుని, సహకారానికి అవకాశాలను సాధ్యమైనంతగా విస్తరింపజేసుకునే కళ. వాణిజ్య నిబంధనల విషయంలో విభేదాల కుదుపులున్నాగానీ, ఈ సానుకూలాంశానికి సంబంధించి బేరసారాలు సాపేక్షికంగా సులువు. గత కొన్నేళ్ల కాలంలో అలాంటి అనుబంధానికి సైతం ప్రేరణ కరువైంది. అయినాగానీ అనంగీకారానికి అవకాశాన్ని కల్పించి, ముందుకు సాగడానికి తగినంతటి సౌహార్ద్రత ఇంకా మిగిలి ఉంది. పాకిస్థాన్‌లోని అసంఖ్యాకమైన అంతర్గత సంఘర్షణలు మొదలుకొని, ఆఫ్రికా యుద్ధాల దిశగా అసమానంగా విస్తరించి ఉన్న సంక్షుభిత యుద్ధరంగంలో విస్పష్టంగా కనిపిస్తున్న గణనీయమైన ప్రమాదాలు పొంచి చూస్తున్నాయి. ఆ వాస్తవాన్ని గుర్తించే వ్యూహాత్మక భాగస్వామ్యపు సూచికల వివరాలను పొందు పరచడం రెండు దేశాలకు సవాలై నిలుస్తుంది.

అటు అమెరికాకు గానీ ఇటు భారత్‌కు గానీ ఎడబాటు సౌఖ్యమేమీ కాదు. సకల రూపాలలోని శత్రువును అందుకోవడానికి మనం సహకరించుకోవాలి. లేకపోతే వాళ్లే మనల్ని అందుకోవడానికి సహకరించుకుంటారు. ఇవేవీ భౌగోళిక ప్రాంతం కోసం మాత్రమే జరుగుతున్న యుద్ధాలు కావు. స్థలం ఇక్కడ ద్వితీయమైనదే. ప్రధాన యుద్ధం భావజాలానికి సంబంధించినది. మత విశ్వాసాలకు అతీతంగా ప్రతి పౌరుడు సమానమని ప్రజాస్వామ్యం అనే సమ్మిళిత భావన ఎంచుతుంది. తద్విరుద్ధంగా మతరాజ్య వ్యవస్థలో అధికారం ఉగ్రవాదాన్ని శాశ్వత వ్యూహంగా ప్రయోగించే స్వయం నియమితులైన మతోన్మా దుల నియంత్రణలో ఉంటుంది. ఈ యుద్ధాలకు హృదయ స్థానంలో నిలిచేది ఆ రెండు పరస్పర విరుద్ధ భావనల మధ్య జరిగే సంఘర్షణే.

 సిద్ధాంత రీత్యా, శత్రువు స్వభావం, స్థానాలను గుర్తించడానికి సంబంధించి భారత్, అమెరికాలకు పెద్దగా సమస్యలేమీ లేవు. ఆచరణలో మాత్రం పాకిస్థాన్ అనే సమస్య ఉంది. పాకిస్థాన్ ఇప్పుడు భారత్‌కు సమస్యలోని అవిభాజ్యమైన భాగంగా మారింది. అమెరికా ఇంకా పాకిస్థాన్‌ను పరిష్కారంలో భాగంగానే పరిగణిస్తోంది. పాక్‌లోని అత్యంత శక్తివంతమైన రాజకీయ శక్తియైన సైన్యాన్ని మతరాజ్యవాద మిలిటెన్సీకి వ్యతిరేకంగా ఉపయోగించుకోగలమని అమెరికా భావిస్తోంది. భారత విశ్లేషణ దానికి పూర్తిగా విభిన్నమైనది. పాక్ సైన్యం ఒకవంక అఫ్ఘాన్‌లో తాలిబన్‌కు, మిగతా చోట్ల రాడికల్ జీహాదిస్టులకు సహాయం అందిస్తూనే... ఎప్పటికప్పుడు కుంటిసాకులతో ఉపయోగపడగల మిత్రునిగా పెంటగాన్, వైట్‌హౌస్‌లను మోసగించడంలో ఆరితేరింది.

గత కొన్నేళ్లుగా పాశ్చాత్య దేశాల్లో పాకిస్థాన్‌కున్న విశ్వసనీయతలో అత్యధిక భాగం తుడిచిపెట్టుకుపోయిన మాట నిజమే. అయితే అదేమీ మటుమాయమై పోలేదు. పాక్ సైన్యం ఒసామాబిన్ లాడెన్‌కు సురక్షిత స్థావరాన్ని కల్పించడం లేదా హఫీజ్ సయీద్‌లాంటి ఉగ్రవాదులకు మద్దతునిస్తుండటం నిజాన్ని గుర్తించడానికి సరిపోయే రుజువులని అవి భావించడం లేదు. క్వెట్టాలోని సురక్షిత స్థావరం నుండే అఫ్ఘాన్ తాలిబన్ నేత ముల్లా ఒమర్ అమెరికా, నాటోలకు వ్యతిరేకంగా యుద్ధాన్ని సాగిస్తు న్నాడు. అయినా అమెరికా ప్రభుత్వం పాక్ వల్లె వేసే నీటి బుడగల సిద్ధాంతాలను విశ్వసిస్తుంది.

భ్రమల్లో ఉండటం వల్ల ప్రమాదం రోజురోజుకూ పెరుగుతోంది. తాలిబన్ హెల్మాండ్ రాష్ట్రంలో సంప్రదాయక దాడిని ప్రారంభించడానికి సన్నాహాలు చేసేటంతటి ధైర్యాన్ని సమకూర్చుకుందనేది అఫ్ఘానిస్థాన్‌పై తాజా అంచనా. వాస్తవంగా యుద్ధం చేయగలపాటి సామర్థ్యంగల అఫ్ఘాన్ బలగాల సంఖ్య పది లేదా పదిహేను వేలకు మించదనీ, తీవ్ర ఓటమి ఒక్కటి ఎదురైతే చాలు అఫ్ఘాన్ సైన్యం చెల్లా చెదరైపోయి తమ జాతుల, తెగల దిశలకు మరలిపోతాయని తాలిబన్ నమ్ముతోంది.

దీనికి తోడు ఈ ప్రాంతానికి ఇరాక్ నుండి తీవ్రమైన ముప్పు పొంచి ఉంది. అక్కడి సున్నీ ఖలీఫా రాజ్యం అంతర్జాతీయ యుద్ధానికి రెండో స్థావరంగా (తాలిబనీకరణ జరిగిన అఫ్ఘానిస్థాన్‌తో పాటు) మారాలని కోరుకుంటోంది. ఈ సమస్యకు సంబంధించి ప్రధాని మోదీ ఏ మాత్రం సహకారాన్ని అందిస్తారు లేదా అందించ జూపుతారు లేదా అసలు ఎంత సహకారం అవసరమవుతుంది అనే విషయాన్ని మనం ఇదమిత్థంగా చెప్పలేం. కానీ ఇది భారత్, అమెరికాల మధ్య వ్యూహాత్మక సమీకరణాన్ని అపారంగా బలోపేతం చేయగలిగిన అంశం. జాతీయ ప్రయోజనాల బంధనాల నుండే అత్యుత్తమమైన వ్యూహాత్మక భాగస్వామ్యం ఉద్భవిస్తుంది. రెండు దేశాల జాతీయ ప్రయోజనాలు కలగలిసిపోయేది అక్కడే.

పసిఫిక్ ప్రాంతంలోని వ్యూహాత్మక సహకారం పతాక శీర్షికలకు దూసుకు పోకపోవటం ఊరట కలిగించే అంశం. అది రెండు దేశాల మధ్య మరో ముఖ్యమైన లంకెను బలోపేతం చేస్తుంది. అయితే శ్వేత సౌధంలో ప్రధాని మోదీ, అధ్యక్షుడు ఒబామాలు కలుసుకునేటప్పుడు వారి ముందు నిలిచే మరో సవాలు కూడా ఉంది. చాలాకాలంగా రెండు ప్రభుత్వాల మధ్య విశ్వాసం లోపించడం కారణంగా ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినిపోయాయి. ఇరువురు నేతలు వాటిని మరమ్మతు చేయాల్సి ఉంది. కొన్ని సందర్భాల్లో ఆశ వాస్తవాన్ని మించిన వేగంతో ముందుకు సాగి ఉండొచ్చు. ఉదాసీనత తరచుగా సంభావ్యతను హతమార్చీ ఉండవచ్చు.
 నరేంద్ర మోదీది ముక్కు సూటి వ్యవహారం. అమెరికా దాన్ని గౌరవిస్తుంది.

 (వ్యాసకర్త సీనియర్ సంపాదకులు) - ఎం.జె. అక్బర్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement