National benefits
-
ప్రాంతీయ పార్టీలూ.. జాతీయ ప్రయోజనాలు
‘‘ఏ ఒక్క ప్రాంతీయ పార్టీకీ దేశం మొత్తానికి అవసరమైన జాతీయ దృష్టి లేదు. అవి మహా అయితే ఒక కులానికి లేదా ఒక రాష్ట్రానికి ఉపయోగపడే అజెండాను మాత్రమే కలిగి ఉన్నాయి. మేమైతే దేశం మొత్తానికి తోడ్పడే దృష్టిని లేదా ప్రణాళికను జనం ముందుంచుతాం. మాకు జాతీయ సిద్ధాంతం ఉంది,’’ అంటూ మూడు నెలల క్రితం ఓ జాతీయపార్టీ అగ్రనేత మీడియాతో అన్నారు. కాని, ఈ ప్రకటన వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించడం లేదు. దక్షిణాదిలోని ఐదు రాష్ట్రాల్లో మూడు (తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్) నేడు ప్రాంతీయపక్షాల పాలనలో ఉన్నాయి. ఈ మూడు ప్రాంతీయ పార్టీలూ (డీఎంకే, బీఆర్ఎస్, వైఎస్సార్సీపీ) అసెంబ్లీ ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీతో అధికారంలోకి వచ్చాయి. అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసే ఎన్నికల ప్రణాళికలతో, సమగ్ర జాతీయ దృష్టితో ఈ ప్రాంతీయపక్షాలు పనిచేస్తున్నాయని ఆయా రాష్ట్రాల ప్రజలేగాక దేశ ప్రజల్లో అత్యధిక భాగం భావిస్తున్నారు. సంకీర్ణాలలో ప్రాంతీయ వాటా ఒడిశా, పశ్చిమబెంగాల్, సిక్కిం సహా దాదాపు పది రాష్ట్రాల్లో ప్రాంతీపక్షాలు జాతీయపక్షాలతో ఎలాంటి గొడవపడకుండా పరిపాలన సాగిస్తున్నాయి. 1977 నుంచీ కేంద్రంలో అధికారం చేపట్టిన అనేక సంకీర్ణ ప్రభుత్వాల్లో భాగస్వామ్యపక్షాలుగా ప్రాంతీయపార్టీలు వ్యవహరించాయి. ఇంకా గతంలో పంజాబ్, మహారాష్ట్ర వంటి అనేక రాష్ట్రాల్లో ప్రాంతీయ పక్షాల నేతృత్వంలో ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వాల్లో జాతీయ పార్టీలు భాగస్వాములుగా ఉన్న చరిత్ర మనది. అనేక రాష్ట్రాల్లో జాతీయ ప్రయోజనాల పేరు సాకుగా చూపించి జాతీయపక్షాలు సక్రమంగా పరిపాలన సాగించకపోవడం, ప్రాంతీయ ఆకాంక్షలను విస్మరించడం, ప్రాంతీయ భాషలకు తగిన ప్రాధాన్యం ఇవ్వకపోవడం వంటి కారణాలు దేశవ్యాప్తంగా ప్రాంతీయపక్షాలు విస్తరించడానికి దారితీశాయి. ఫలితంగా అనేక ప్రాంతీయపక్షాలు అనేక సందర్భాల్లో ఉత్తర్ ప్రదేశ్, బిహార్ వంటి ప్రధాన హిందీ రాష్ట్రాల్లో సైతం అధికారంలోకి వచ్చి మంచి పాలన అందించాయి. ప్రపంచీకరణతోపాటే ప్రాంతీయపక్షాల ప్రాభవం ప్రపంచీకరణ విశ్వవ్యాప్తమైన నేటి సందర్భంలో థింక్ గ్లోబల్లీ, యాక్ట్ లోకల్లీ (ప్రాపంచిక దృష్టితో ఆలోచించండి, స్థానికంగా ఆ ఆలోచనలు ఆచరణలో పెట్టండి) అనే నేటి పరిస్థితులకు అనువైన మాటలను ప్రాంతీయపక్షాలు అమలు చేసి చూపిస్తున్నాయి. ప్రజల అవసరాలు, నూతన రాజకీయ పరిస్థితులే నేడు ప్రాంతీయ పార్టీల పుట్టుకకు, వాటి ప్రాభవానికి కారణమౌతున్నాయి. ప్రాంతీయపక్షాలు జాతీయ పార్టీల కృషికి సమాంతరంగా పరిపూరక పాత్ర పోషిస్తున్నాయి. ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు ప్రాంతీయ పార్టీల పాలనలోని రాష్ట్రాల్లో సురక్షితంగా పనిచేసుకుని బతుకుతున్నారు. ఈ రాష్ట్రాల్లో ఎలాంటి సంకుచిత ధోరణలు లేకుండా ప్రజలు సుఖసంతోషాలతో జీవిస్తున్నారని ఐక్యరాజ్య సమితి వంటి అంతర్జాతీయ సంస్థలు గుర్తించాయి. చదవండి: పండిట్ నెహ్రూ, ఇందిరమ్మ రికార్డులను ఎవరు తిరగరాస్తారు! 140 కోట్లకు పైగా జనాభా, 22 అధికార భాషలు ఉన్న విశాల భారతంలో జాతీయపక్షాలు, ప్రాంతీయపక్షాలు అన్నదమ్ముల్లా పనిచేస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతం కావడానికి దోహదం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో కేవలం జాతీయ పార్టీలకే విశాల జాతీయ దృక్పథం ఉంటుందని, ప్రాంతీయపక్షాలు ఓ ప్రాంతం లేదా కులానికే ప్రాతినిధ్యం వహిస్తాయని పైన చెప్పిన జాతీయపార్టీ నాయకుడు వ్యక్తం చేసిన అభిప్రాయం నిజం కాదని రుజువవుతోంది. -విజయసాయిరెడ్డి, రాజ్యసభ సభ్యులు, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు -
కేంద్ర, రాష్ట్రాల సఖ్యత!
సాక్షి, హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నడుమ సంబంధాలు తరచూ వివాదాస్పదమవుతున్న నేపథ్యంలో సుమారు మూడేళ్ల తర్వాత అంతర్రాష్ట్ర మండలి సమావేశం నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత జరిగే సమావేశానికి సంబంధించి కేంద్ర హోంశాఖ పరిధిలోని అంతర్రాష్ట్ర మండలి సెక్రటేరియట్ ఇప్పట్నుంచే సన్నాహాలు ప్రారంభించింది. జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర–రాష్ట్రాలకు ఉండే హక్కులకు సంబంధించి ఏకీకృత విధానం రూపొందించడంపై దృష్టి సారించింది. అయితే మండలి సమావేశం ఏకపక్షంగా జరపకూడదనే ఉద్దేశంతో ఎజెండా రూపకల్పనకు వీలుగా అంతర్రాష్ట్ర మండలిలో ప్రస్తావించాల్సిన అంశాలపై ప్రతిపాదనలు ఇవ్వాల్సిందిగా మండలి సెక్రటేరియట్ రాష్ట్రాలను కోరింది. అయితే తాము చర్చకు ప్రతిపాదించే అంశాలకు మద్దతుగా అవసరమైన పత్రాలను కూడా జత చేయాలని సూచించింది. కొత్త ట్రిబ్యునల్ లేదు.. జాతీయ హోదా రాలేదు... కేంద్ర, రాష్ట్రాల నడుమ ఉత్పన్నమయ్యే సమస్యలను పరిష్కరించేందుకు 1990లో అంతర్రాష్ట్ర మండలి ఏర్పాటైంది. దీనికి ప్రధాని అధ్యక్షుడిగా ఉంటారు. ప్రస్తుతం మండలిలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సీఎంలతోపాటు కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ, నితిన్ గడ్కరీ తదితరులు సభ్యులుగా మరో 10 మంది కేంద్ర మంత్రులు శాశ్వత ఆహ్వానితులుగా ఉన్నారు. మండలి చివరి సమావేశం 2016 జూలై 16న జరిగింది. ఆ తర్వాత ఎలాంటి సమావేశాలు జరగలేదు. 2016లో జరిగిన భేటీలో తెలంగాణ సీఎం కేసీఆర్ పాల్గొని వివిధ అంశాలపై మాట్లాడారు. ముఖ్యంగా అంతర్రాష్ట్ర నదీ జలవివాదాలపై ఏర్పాటు చేసిన ట్రిబ్యునల్స్ నిర్ణీత వ్యవధిలో ఇచ్చే విధంగా నిర్ధేశించాలని, కేంద్రం మరింత నిర్ణయాత్మక పాత్ర వహించాలని ఈ భేటీలో కోరారు. కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు సమాన హక్కులు ఉండేలా రాష్ట్ర వాదనలను ట్రిబ్యునల్ తొలి నుంచీ వినాలని, లేనిపక్షంలో కొత్త ట్రిబ్యునల్ వేసి కృష్ణా జలాలను పునఃపంపిణీ చేయాలని విన్నవించారు. దీంతోపాటే సాగునీటి రంగంలో ప్రతి ఒక్క రాష్ట్రంలో ఒక భారీ పథకానికి కేంద్రం నిధులివ్వాలని కోరిన కేసీఆర్... కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుల్లో ఒక దానిని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని విన్నవించారు. అలాగే మిషన్ కాకతీయకు ఆర్థిక సాయం, మిషన్ భగీరథకు కేంద్రం పూచీకత్తు వంటి అంశాలను మండలి భేటీలో కేంద్రం ముందుంచారు. కొత్తగా ఏర్పడిన తమ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు పెద్ద మొత్తంలో నిధులు (ఏటా రూ. 25 వేల కోట్లు) కేటాయించడంతోపాటు మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలకు తాము ఖర్చు చేస్తున్న రూ. 30–40 వేల కోట్ల వల్ల రాష్ట్రంపై పడిన ఆర్థిక భారాన్ని కొంతలో కొంత తగ్గించుకోవడానికి ద్రవ్య పరిపతి యాజమాన్య నిర్వహణ (ఎఫ్ఆర్బీఎం) పరిమితిని పెంచాలని అదే భేటీలో కోరారు. ఎఫ్ఆర్బీఎం పరిమితి పెంచితే ప్రభుత్వంపై పడే ఆర్ధిక భారాన్ని తగ్గించుకునేందుకు దోహదపడుతుందని ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. దీనిలో కొన్ని అంశాలపై కేంద్రం సానుకూలంగా స్పందించింది. అయితే నదీ జలాల విషయంలో మాత్రం సానుకూలత చూపలేదు. ఏ ప్రాజెక్టుకూ జాతీయ హోదా ప్రకటించలేదు. కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు అంశాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో కేంద్రంలో కొలువుదీరే కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసే అంతర్రాష్ట్ర మండలి సమావేశం కీలకంగా మారనుంది. ఈ నేపథ్యంలో సెక్రటేరియట్ ప్రత్యేక కార్యదర్శి సంజీవ్ గుప్తా ఇటీవల రాష్ట్ర సీఎస్ ఎస్కే జోషీకి లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది. కౌన్సిల్ భేటీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించే అంశాలకు సంబంధించిన పత్రాలతోపాటు ఇతర రాజ్యాంగ, న్యాయపరమైన సమస్యలకు సంబంధించిన వివరాలు పంపాల్సిందిగా లేఖలో కోరారు. పార్లమెంట్ ద్వారా కేంద్రం రూపొందించిన చట్టాలను రాష్ట్రాల్లో అమలు చేయడంలో ఆయా ప్రభుత్వాల సహాయ సహకారాలపై మండలి సమావేశంలో చర్చిస్తామని లేఖలో తెలిపారు. ఈ నేపథ్యంలో మళ్లీ పాత అంశాల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం మరోమారు ఒత్తిడి తెచ్చే అవకాశాలున్నాయి. -
ఉభయ తారకం మైత్రీ బంధం
జాతీయ ప్రయోజనాల బంధనాల నుండే అత్యుత్తమ వ్యూహాత్మక భాగస్వామ్యం ఉద్భవిస్తుంది. రెండు దేశాల జాతీయ ప్రయోజనాలు కలగలిసిపోయేది అక్కడే. చాలాకాలంగా భారత్, అమెరికా ప్రభుత్వాల మధ్య విశ్వాసం లోపించడంతో ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్నాయి. వాటిని మరమ్మతు చేయడం మోదీ, ఒబామాల ముందున్న సవాలు. ప్రధాని నరేంద్రమోదీ ఐదు రోజుల అమెరికా పర్యటనలో న్యూయార్క్ నగర ప్రజలను ఉద్దేశించి, ఆ దేశ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడను న్నారు. ప్రవాస భారతీయుల్లో ఆయన అప్పుడే ఒక తరానికి సరిపడా ఉద్వేగోత్సాహాలను రేకెత్తించారు. ప్రభుత్వాధికారులు, శాసనకర్తలు, విద్యావేత్తలు. ఇంటెలిజెన్స్ అధికారుల నిలయమైన రాజధాని వాషింగ్టన్ గంభీరమైన, ఉదాసీన నగరం. ఉపన్యాస కళను పునర్ నిర్వచించడాన్ని ప్రారంభించి, ఇటీవలి కాలంలో అరుదైన తీరున దౌత్యనీతిని శక్తివంతం చేస్తున్న అసాధారణ భారతీయ నేత పేరు ఆ నగరంలో సైతం మారు మోగడం మొదలైంది. నరేంద్ర మోదీ, బరాక్ ఒబామాలు ఇద్దరూ అద్భుత వాక్చాతుర్యం కలిగిన ప్రజాస్వామిక ఉపన్యాసకుల విశిష్ట వర్గానికి చెందినవారే. ఆ విషయంలో ప్రధానంగా వారిద్దరూ ఒకరితో ఒకరు పోటీపడాల్సినవారే. భాష ఎంత పురాతనమైనదో ఉపన్యాస కళ కూడా అంతే పురాతనమై నది. ఫ్రెంచి విప్లవ కాలంలో ఆధునికార్థంలో అది ఒక రాజకీయ ఆయుధంగా మారింది. దిగువస్థాయి ప్రజలతో మాట్లాడటమంటేనే గౌరవానికి భంగకరంగా భావించిన ఫ్రాన్స్ రాజును, అతనిని అనుకరించిన ఆయన మంత్రు లను కూలదోసినది అలాంటి వాక్పటిమా శక్తే. రాజుల చెరసాలల్లో బందీగా ఉన్న ఉపన్యాస కళను విప్లవం విడుదల చేసింది. తద్వారా ఉపన్యాస కళ భావాల సేనా శ్రేణుల రక్షణలో వర్తమాన ప్రజాస్వామ్యానికి సుదీర్ఘ పయనం సాగించింది. ఆ సుదీర్ఘ ప్రయాణంలోనే అది సమానత్వవాదాన్ని సుస్థాపితం చేసింది. భారత అమెరికాలు స్వేచ్ఛాభీష్టపు ఖజానాలు మాత్రమే కాదు. అవకాశా లను పెంపొందింపజేసే సుసంపన్నవంతమైన గనులు. దౌత్యం అంటే వైరుధ్యాలను నియంత్రించి, సంఘర్షణను పరిమితం చేసి, సానుకూల అవకాశాలను ఉపయోగించుకుని, సహకారానికి అవకాశాలను సాధ్యమైనంతగా విస్తరింపజేసుకునే కళ. వాణిజ్య నిబంధనల విషయంలో విభేదాల కుదుపులున్నాగానీ, ఈ సానుకూలాంశానికి సంబంధించి బేరసారాలు సాపేక్షికంగా సులువు. గత కొన్నేళ్ల కాలంలో అలాంటి అనుబంధానికి సైతం ప్రేరణ కరువైంది. అయినాగానీ అనంగీకారానికి అవకాశాన్ని కల్పించి, ముందుకు సాగడానికి తగినంతటి సౌహార్ద్రత ఇంకా మిగిలి ఉంది. పాకిస్థాన్‌లోని అసంఖ్యాకమైన అంతర్గత సంఘర్షణలు మొదలుకొని, ఆఫ్రికా యుద్ధాల దిశగా అసమానంగా విస్తరించి ఉన్న సంక్షుభిత యుద్ధరంగంలో విస్పష్టంగా కనిపిస్తున్న గణనీయమైన ప్రమాదాలు పొంచి చూస్తున్నాయి. ఆ వాస్తవాన్ని గుర్తించే వ్యూహాత్మక భాగస్వామ్యపు సూచికల వివరాలను పొందు పరచడం రెండు దేశాలకు సవాలై నిలుస్తుంది. అటు అమెరికాకు గానీ ఇటు భారత్‌కు గానీ ఎడబాటు సౌఖ్యమేమీ కాదు. సకల రూపాలలోని శత్రువును అందుకోవడానికి మనం సహకరించుకోవాలి. లేకపోతే వాళ్లే మనల్ని అందుకోవడానికి సహకరించుకుంటారు. ఇవేవీ భౌగోళిక ప్రాంతం కోసం మాత్రమే జరుగుతున్న యుద్ధాలు కావు. స్థలం ఇక్కడ ద్వితీయమైనదే. ప్రధాన యుద్ధం భావజాలానికి సంబంధించినది. మత విశ్వాసాలకు అతీతంగా ప్రతి పౌరుడు సమానమని ప్రజాస్వామ్యం అనే సమ్మిళిత భావన ఎంచుతుంది. తద్విరుద్ధంగా మతరాజ్య వ్యవస్థలో అధికారం ఉగ్రవాదాన్ని శాశ్వత వ్యూహంగా ప్రయోగించే స్వయం నియమితులైన మతోన్మా దుల నియంత్రణలో ఉంటుంది. ఈ యుద్ధాలకు హృదయ స్థానంలో నిలిచేది ఆ రెండు పరస్పర విరుద్ధ భావనల మధ్య జరిగే సంఘర్షణే. సిద్ధాంత రీత్యా, శత్రువు స్వభావం, స్థానాలను గుర్తించడానికి సంబంధించి భారత్, అమెరికాలకు పెద్దగా సమస్యలేమీ లేవు. ఆచరణలో మాత్రం పాకిస్థాన్ అనే సమస్య ఉంది. పాకిస్థాన్ ఇప్పుడు భారత్‌కు సమస్యలోని అవిభాజ్యమైన భాగంగా మారింది. అమెరికా ఇంకా పాకిస్థాన్‌ను పరిష్కారంలో భాగంగానే పరిగణిస్తోంది. పాక్‌లోని అత్యంత శక్తివంతమైన రాజకీయ శక్తియైన సైన్యాన్ని మతరాజ్యవాద మిలిటెన్సీకి వ్యతిరేకంగా ఉపయోగించుకోగలమని అమెరికా భావిస్తోంది. భారత విశ్లేషణ దానికి పూర్తిగా విభిన్నమైనది. పాక్ సైన్యం ఒకవంక అఫ్ఘాన్‌లో తాలిబన్‌కు, మిగతా చోట్ల రాడికల్ జీహాదిస్టులకు సహాయం అందిస్తూనే... ఎప్పటికప్పుడు కుంటిసాకులతో ఉపయోగపడగల మిత్రునిగా పెంటగాన్, వైట్హౌస్లను మోసగించడంలో ఆరితేరింది. గత కొన్నేళ్లుగా పాశ్చాత్య దేశాల్లో పాకిస్థాన్‌కున్న విశ్వసనీయతలో అత్యధిక భాగం తుడిచిపెట్టుకుపోయిన మాట నిజమే. అయితే అదేమీ మటుమాయమై పోలేదు. పాక్ సైన్యం ఒసామాబిన్ లాడెన్‌కు సురక్షిత స్థావరాన్ని కల్పించడం లేదా హఫీజ్ సయీద్‌లాంటి ఉగ్రవాదులకు మద్దతునిస్తుండటం నిజాన్ని గుర్తించడానికి సరిపోయే రుజువులని అవి భావించడం లేదు. క్వెట్టాలోని సురక్షిత స్థావరం నుండే అఫ్ఘాన్ తాలిబన్ నేత ముల్లా ఒమర్ అమెరికా, నాటోలకు వ్యతిరేకంగా యుద్ధాన్ని సాగిస్తు న్నాడు. అయినా అమెరికా ప్రభుత్వం పాక్ వల్లె వేసే నీటి బుడగల సిద్ధాంతాలను విశ్వసిస్తుంది. భ్రమల్లో ఉండటం వల్ల ప్రమాదం రోజురోజుకూ పెరుగుతోంది. తాలిబన్ హెల్మాండ్ రాష్ట్రంలో సంప్రదాయక దాడిని ప్రారంభించడానికి సన్నాహాలు చేసేటంతటి ధైర్యాన్ని సమకూర్చుకుందనేది అఫ్ఘానిస్థాన్‌పై తాజా అంచనా. వాస్తవంగా యుద్ధం చేయగలపాటి సామర్థ్యంగల అఫ్ఘాన్ బలగాల సంఖ్య పది లేదా పదిహేను వేలకు మించదనీ, తీవ్ర ఓటమి ఒక్కటి ఎదురైతే చాలు అఫ్ఘాన్ సైన్యం చెల్లా చెదరైపోయి తమ జాతుల, తెగల దిశలకు మరలిపోతాయని తాలిబన్ నమ్ముతోంది. దీనికి తోడు ఈ ప్రాంతానికి ఇరాక్ నుండి తీవ్రమైన ముప్పు పొంచి ఉంది. అక్కడి సున్నీ ఖలీఫా రాజ్యం అంతర్జాతీయ యుద్ధానికి రెండో స్థావరంగా (తాలిబనీకరణ జరిగిన అఫ్ఘానిస్థాన్‌తో పాటు) మారాలని కోరుకుంటోంది. ఈ సమస్యకు సంబంధించి ప్రధాని మోదీ ఏ మాత్రం సహకారాన్ని అందిస్తారు లేదా అందించ జూపుతారు లేదా అసలు ఎంత సహకారం అవసరమవుతుంది అనే విషయాన్ని మనం ఇదమిత్థంగా చెప్పలేం. కానీ ఇది భారత్, అమెరికాల మధ్య వ్యూహాత్మక సమీకరణాన్ని అపారంగా బలోపేతం చేయగలిగిన అంశం. జాతీయ ప్రయోజనాల బంధనాల నుండే అత్యుత్తమమైన వ్యూహాత్మక భాగస్వామ్యం ఉద్భవిస్తుంది. రెండు దేశాల జాతీయ ప్రయోజనాలు కలగలిసిపోయేది అక్కడే. పసిఫిక్ ప్రాంతంలోని వ్యూహాత్మక సహకారం పతాక శీర్షికలకు దూసుకు పోకపోవటం ఊరట కలిగించే అంశం. అది రెండు దేశాల మధ్య మరో ముఖ్యమైన లంకెను బలోపేతం చేస్తుంది. అయితే శ్వేత సౌధంలో ప్రధాని మోదీ, అధ్యక్షుడు ఒబామాలు కలుసుకునేటప్పుడు వారి ముందు నిలిచే మరో సవాలు కూడా ఉంది. చాలాకాలంగా రెండు ప్రభుత్వాల మధ్య విశ్వాసం లోపించడం కారణంగా ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినిపోయాయి. ఇరువురు నేతలు వాటిని మరమ్మతు చేయాల్సి ఉంది. కొన్ని సందర్భాల్లో ఆశ వాస్తవాన్ని మించిన వేగంతో ముందుకు సాగి ఉండొచ్చు. ఉదాసీనత తరచుగా సంభావ్యతను హతమార్చీ ఉండవచ్చు. నరేంద్ర మోదీది ముక్కు సూటి వ్యవహారం. అమెరికా దాన్ని గౌరవిస్తుంది. (వ్యాసకర్త సీనియర్ సంపాదకులు) - ఎం.జె. అక్బర్