కేంద్ర, రాష్ట్రాల సఖ్యత! | central govt plans to Inter State Council Meeting after three years | Sakshi
Sakshi News home page

కేంద్ర, రాష్ట్రాల సఖ్యత!

Published Tue, Mar 19 2019 4:04 AM | Last Updated on Tue, Mar 19 2019 4:04 AM

central govt plans to Inter State Council Meeting after three years - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నడుమ సంబంధాలు తరచూ వివాదాస్పదమవుతున్న నేపథ్యంలో సుమారు మూడేళ్ల తర్వాత అంతర్రాష్ట్ర మండలి సమావేశం నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత జరిగే సమావేశానికి సంబంధించి కేంద్ర హోంశాఖ పరిధిలోని అంతర్రాష్ట్ర మండలి సెక్రటేరియట్‌ ఇప్పట్నుంచే సన్నాహాలు ప్రారంభించింది. జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర–రాష్ట్రాలకు ఉండే హక్కులకు సంబంధించి ఏకీకృత విధానం రూపొందించడంపై దృష్టి సారించింది. అయితే మండలి సమావేశం ఏకపక్షంగా జరపకూడదనే ఉద్దేశంతో ఎజెండా రూపకల్పనకు వీలుగా అంతర్రాష్ట్ర మండలిలో ప్రస్తావించాల్సిన అంశాలపై ప్రతిపాదనలు ఇవ్వాల్సిందిగా మండలి సెక్రటేరియట్‌ రాష్ట్రాలను కోరింది. అయితే తాము చర్చకు ప్రతిపాదించే అంశాలకు మద్దతుగా అవసరమైన పత్రాలను కూడా జత చేయాలని సూచించింది.

కొత్త ట్రిబ్యునల్‌ లేదు.. జాతీయ హోదా రాలేదు...
కేంద్ర, రాష్ట్రాల నడుమ ఉత్పన్నమయ్యే సమస్యలను పరిష్కరించేందుకు 1990లో అంతర్రాష్ట్ర మండలి ఏర్పాటైంది. దీనికి ప్రధాని అధ్యక్షుడిగా ఉంటారు. ప్రస్తుతం మండలిలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సీఎంలతోపాటు కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్, సుష్మా స్వరాజ్, అరుణ్‌ జైట్లీ, నితిన్‌ గడ్కరీ తదితరులు సభ్యులుగా మరో 10 మంది కేంద్ర మంత్రులు శాశ్వత ఆహ్వానితులుగా ఉన్నారు. మండలి చివరి సమావేశం 2016 జూలై 16న జరిగింది. ఆ తర్వాత ఎలాంటి సమావేశాలు జరగలేదు. 2016లో జరిగిన భేటీలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ పాల్గొని వివిధ అంశాలపై మాట్లాడారు. ముఖ్యంగా అంతర్రాష్ట్ర నదీ జలవివాదాలపై ఏర్పాటు చేసిన ట్రిబ్యునల్స్‌ నిర్ణీత వ్యవధిలో ఇచ్చే విధంగా నిర్ధేశించాలని, కేంద్రం మరింత నిర్ణయాత్మక పాత్ర వహించాలని ఈ భేటీలో కోరారు.

కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు సమాన హక్కులు ఉండేలా రాష్ట్ర వాదనలను ట్రిబ్యునల్‌ తొలి నుంచీ వినాలని, లేనిపక్షంలో కొత్త ట్రిబ్యునల్‌ వేసి కృష్ణా జలాలను పునఃపంపిణీ చేయాలని విన్నవించారు. దీంతోపాటే సాగునీటి రంగంలో ప్రతి ఒక్క రాష్ట్రంలో ఒక భారీ పథకానికి కేంద్రం నిధులివ్వాలని కోరిన కేసీఆర్‌... కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుల్లో ఒక దానిని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని విన్నవించారు. అలాగే మిషన్‌ కాకతీయకు ఆర్థిక సాయం, మిషన్‌ భగీరథకు కేంద్రం పూచీకత్తు వంటి అంశాలను మండలి భేటీలో కేంద్రం ముందుంచారు. కొత్తగా ఏర్పడిన తమ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు పెద్ద మొత్తంలో నిధులు (ఏటా రూ. 25 వేల కోట్లు) కేటాయించడంతోపాటు మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ పథకాలకు తాము ఖర్చు చేస్తున్న రూ. 30–40 వేల కోట్ల వల్ల రాష్ట్రంపై పడిన ఆర్థిక భారాన్ని కొంతలో కొంత తగ్గించుకోవడానికి ద్రవ్య పరిపతి యాజమాన్య నిర్వహణ (ఎఫ్‌ఆర్‌బీఎం) పరిమితిని పెంచాలని అదే భేటీలో కోరారు.

ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి పెంచితే ప్రభుత్వంపై పడే ఆర్ధిక భారాన్ని తగ్గించుకునేందుకు దోహదపడుతుందని ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు. దీనిలో కొన్ని అంశాలపై కేంద్రం సానుకూలంగా స్పందించింది. అయితే నదీ జలాల విషయంలో మాత్రం సానుకూలత చూపలేదు. ఏ ప్రాజెక్టుకూ జాతీయ హోదా ప్రకటించలేదు. కొత్త ట్రిబ్యునల్‌ ఏర్పాటు అంశాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో కేంద్రంలో కొలువుదీరే కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసే అంతర్రాష్ట్ర మండలి సమావేశం కీలకంగా మారనుంది. ఈ నేపథ్యంలో సెక్రటేరియట్‌ ప్రత్యేక కార్యదర్శి సంజీవ్‌ గుప్తా ఇటీవల రాష్ట్ర సీఎస్‌ ఎస్‌కే జోషీకి లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది. కౌన్సిల్‌ భేటీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించే అంశాలకు సంబంధించిన పత్రాలతోపాటు ఇతర రాజ్యాంగ, న్యాయపరమైన సమస్యలకు సంబంధించిన వివరాలు పంపాల్సిందిగా లేఖలో కోరారు. పార్లమెంట్‌ ద్వారా కేంద్రం రూపొందించిన చట్టాలను రాష్ట్రాల్లో అమలు చేయడంలో ఆయా ప్రభుత్వాల సహాయ సహకారాలపై మండలి సమావేశంలో చర్చిస్తామని లేఖలో తెలిపారు. ఈ నేపథ్యంలో మళ్లీ పాత అంశాల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం మరోమారు ఒత్తిడి తెచ్చే అవకాశాలున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement