Tribunal orders
-
కేంద్ర, రాష్ట్రాల సఖ్యత!
సాక్షి, హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నడుమ సంబంధాలు తరచూ వివాదాస్పదమవుతున్న నేపథ్యంలో సుమారు మూడేళ్ల తర్వాత అంతర్రాష్ట్ర మండలి సమావేశం నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత జరిగే సమావేశానికి సంబంధించి కేంద్ర హోంశాఖ పరిధిలోని అంతర్రాష్ట్ర మండలి సెక్రటేరియట్ ఇప్పట్నుంచే సన్నాహాలు ప్రారంభించింది. జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర–రాష్ట్రాలకు ఉండే హక్కులకు సంబంధించి ఏకీకృత విధానం రూపొందించడంపై దృష్టి సారించింది. అయితే మండలి సమావేశం ఏకపక్షంగా జరపకూడదనే ఉద్దేశంతో ఎజెండా రూపకల్పనకు వీలుగా అంతర్రాష్ట్ర మండలిలో ప్రస్తావించాల్సిన అంశాలపై ప్రతిపాదనలు ఇవ్వాల్సిందిగా మండలి సెక్రటేరియట్ రాష్ట్రాలను కోరింది. అయితే తాము చర్చకు ప్రతిపాదించే అంశాలకు మద్దతుగా అవసరమైన పత్రాలను కూడా జత చేయాలని సూచించింది. కొత్త ట్రిబ్యునల్ లేదు.. జాతీయ హోదా రాలేదు... కేంద్ర, రాష్ట్రాల నడుమ ఉత్పన్నమయ్యే సమస్యలను పరిష్కరించేందుకు 1990లో అంతర్రాష్ట్ర మండలి ఏర్పాటైంది. దీనికి ప్రధాని అధ్యక్షుడిగా ఉంటారు. ప్రస్తుతం మండలిలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సీఎంలతోపాటు కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ, నితిన్ గడ్కరీ తదితరులు సభ్యులుగా మరో 10 మంది కేంద్ర మంత్రులు శాశ్వత ఆహ్వానితులుగా ఉన్నారు. మండలి చివరి సమావేశం 2016 జూలై 16న జరిగింది. ఆ తర్వాత ఎలాంటి సమావేశాలు జరగలేదు. 2016లో జరిగిన భేటీలో తెలంగాణ సీఎం కేసీఆర్ పాల్గొని వివిధ అంశాలపై మాట్లాడారు. ముఖ్యంగా అంతర్రాష్ట్ర నదీ జలవివాదాలపై ఏర్పాటు చేసిన ట్రిబ్యునల్స్ నిర్ణీత వ్యవధిలో ఇచ్చే విధంగా నిర్ధేశించాలని, కేంద్రం మరింత నిర్ణయాత్మక పాత్ర వహించాలని ఈ భేటీలో కోరారు. కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు సమాన హక్కులు ఉండేలా రాష్ట్ర వాదనలను ట్రిబ్యునల్ తొలి నుంచీ వినాలని, లేనిపక్షంలో కొత్త ట్రిబ్యునల్ వేసి కృష్ణా జలాలను పునఃపంపిణీ చేయాలని విన్నవించారు. దీంతోపాటే సాగునీటి రంగంలో ప్రతి ఒక్క రాష్ట్రంలో ఒక భారీ పథకానికి కేంద్రం నిధులివ్వాలని కోరిన కేసీఆర్... కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుల్లో ఒక దానిని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని విన్నవించారు. అలాగే మిషన్ కాకతీయకు ఆర్థిక సాయం, మిషన్ భగీరథకు కేంద్రం పూచీకత్తు వంటి అంశాలను మండలి భేటీలో కేంద్రం ముందుంచారు. కొత్తగా ఏర్పడిన తమ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు పెద్ద మొత్తంలో నిధులు (ఏటా రూ. 25 వేల కోట్లు) కేటాయించడంతోపాటు మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలకు తాము ఖర్చు చేస్తున్న రూ. 30–40 వేల కోట్ల వల్ల రాష్ట్రంపై పడిన ఆర్థిక భారాన్ని కొంతలో కొంత తగ్గించుకోవడానికి ద్రవ్య పరిపతి యాజమాన్య నిర్వహణ (ఎఫ్ఆర్బీఎం) పరిమితిని పెంచాలని అదే భేటీలో కోరారు. ఎఫ్ఆర్బీఎం పరిమితి పెంచితే ప్రభుత్వంపై పడే ఆర్ధిక భారాన్ని తగ్గించుకునేందుకు దోహదపడుతుందని ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. దీనిలో కొన్ని అంశాలపై కేంద్రం సానుకూలంగా స్పందించింది. అయితే నదీ జలాల విషయంలో మాత్రం సానుకూలత చూపలేదు. ఏ ప్రాజెక్టుకూ జాతీయ హోదా ప్రకటించలేదు. కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు అంశాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో కేంద్రంలో కొలువుదీరే కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసే అంతర్రాష్ట్ర మండలి సమావేశం కీలకంగా మారనుంది. ఈ నేపథ్యంలో సెక్రటేరియట్ ప్రత్యేక కార్యదర్శి సంజీవ్ గుప్తా ఇటీవల రాష్ట్ర సీఎస్ ఎస్కే జోషీకి లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది. కౌన్సిల్ భేటీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించే అంశాలకు సంబంధించిన పత్రాలతోపాటు ఇతర రాజ్యాంగ, న్యాయపరమైన సమస్యలకు సంబంధించిన వివరాలు పంపాల్సిందిగా లేఖలో కోరారు. పార్లమెంట్ ద్వారా కేంద్రం రూపొందించిన చట్టాలను రాష్ట్రాల్లో అమలు చేయడంలో ఆయా ప్రభుత్వాల సహాయ సహకారాలపై మండలి సమావేశంలో చర్చిస్తామని లేఖలో తెలిపారు. ఈ నేపథ్యంలో మళ్లీ పాత అంశాల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం మరోమారు ఒత్తిడి తెచ్చే అవకాశాలున్నాయి. -
మీథేన్‌కు బ్రేక్
రాష్ట్రంలో మీథేన్ వాయువు తవ్వకాల పనులకు తాత్కాలికంగా బ్రేక్ వేస్తూ చెన్నైలోని దక్షిణ భారత పర్యావరణ ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. అలాగే, ఈ తవ్వకాలపై పరిశీలన చేపట్టిన ఎండీఎంకే నేత వైగో సహాయాన్ని తీసుకునేందుకు నిర్ణయించింది. సాక్షి, చెన్నై: రాష్ట్రంలోని కావేరి తీర జిల్లాల్లో మిథేన్ వాయువు తవ్వకాలకు యూపీఏ హయాంలో చర్యలు చేపట్టారు. ఇందుకు కేంద్ర పెట్రోలియంశాఖ నాలుగేళ్ల క్రితం అనుమతి ఇచ్చింది. ఓ ప్రైవేటు సంస్థ నేతృత్వంలో కావేరి నదీ తీరంలోని డెల్టా జిల్లాలు తంజావూరు, తిరువారూర్, నాగపట్నంలను కలుపుతూ ఈ పనులకు చర్యలు తీసుకున్నారు. 667 కి.మీ దూరం, భూగర్భంలో 500 నుంచి పదిహేను వందల అడుగుల మేరకు తవ్వకాలు జరుపుకునే విధంగా అనుమతులు మంజూరయ్యాయి. ఆందోళన:మిథేన్ వాయువు నిక్షేపాలు తమ పరిసరాల్లో ఉండడం, వాటిని తవ్వేసి ఇక్కడి నుంచి తరలించేందుకు కేంద్రం సిద్ధం కావడంతో ఆ మూడు జిల్లాల అన్నదాతల్లో ఆందోళన బయలు దేరింది. పంట పొలాలు సర్వనాశనం అవుతాయని, వ్యవసాయం కుంటు పడి, తమ జీవనం ఆగమ్యగోచరంగా మారే ప్రమాదం ఉందన్న ఆవేదనలో పడ్డారు. ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా గళాన్ని విప్పారు. ఈ వాయువును బయటకు తీసుకెళ్లే రీతిలో పంట పొలాల మీద పైప్లైన్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టడంతో ఆందోళన రెట్టింపు అయింది. అన్నదాతల్లో బయలు దేరిన ఆందోళనను పరిగణలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ప్రయత్నాల్ని మొక్కలోనే తుంచి పడేయడానికి సిద్ధమైంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మిథైన్ తవ్వకాలకు అనుమతి ఇవ్వబోమని గత ప్రభుత్వాన్ని హెచ్చరించింది. అయితే, ఫలితం శూన్యం. చివరకు రాష్ట్ర ప్రభుత్వం ఆ పనుల్ని తాత్కాలికంగా నిలుపుదల చేయించి, ప్రత్యేక కమిటీని రంగంలోకి దించింది. అయితే, ఆ కమిటీ ఏమైందో ఏమోగానీ, కేంద్రంలో అధికారం మారినా, మిథైన్ తవ్వకాలకు వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. దీంతో అన్నదాతల్లో ఆక్రోశం రగులుతూనే ఉంది. ట్రిబ్యునల్‌కు : తమకు న్యాయం జరిగే రీతిలో చర్యలు తీసుకోవాలని కోరుతూ అన్నదాతల తరపున పర్యావరణ ట్రిబ్యునల్‌కు ఫిర్యాదు చేరింది. తిరువయ్యారుకు చెందిన పాండియన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. మిథైన్ తవ్వకాలను వివరిస్తూ తన పిటిషన్ దాఖలు చేశారు. కేంద్రం, ఓఎన్జీసీ సంస్థ కలిసి ఈ తవ్వకాలకు చర్యలు చేపట్టాయని, అయితే, రాష్ట్ర ప్రభుత్వ, పర్యావరణ అనుమతి మాత్రం ఇంత వరకు పొందలేదని ట్రిబ్యునల్ దృష్టికి తెచ్చారు. ఎలాంటి అనుమతులు లేకున్నా, ఇష్టానుసారంగా పంట పొలాల్ని తవ్వే పనుల్లో పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై తాము నిలదీస్తే, రాష్ట్ర ప్రభుత్వ అనుమతి అవసరం లేదని హెచ్చరిస్తున్నారని, దీనిపై స్పందించి అన్నదాతలకు న్యాయం చేకూర్చాలని విన్నవించారు. పనులకు బ్రేక్ : ఈ పిటిషన్‌ను బుధవారం చెన్నైలోని దక్షిణ భారత పర్యావరణ ట్రిబ్యునల్ న్యాయమూర్తి జ్యోతిమణి, సభ్యుడు ప్రొఫెసర్ నాగేంద్రన్ విచారించారు. ఆ పిటిషన్‌ను పరిగణలోకి తీసుకున్న ట్రిబ్యునల్ మిథైన్కు వ్యతిరేకంగా ఆదేశాలు జారీ చేసింది. ఎ్కడి పనుల్ని అక్కడే నిలుపుదల చేయాలని తాత్కాలిక ఉత్తర్వుల్ని జారీ చేసింది. తదుపరి విచారణ సోమవారం జరుగుతుందని, అంత వరకు అన్ని పనులు ఆపాల్సిందేనని స్పష్టం చేస్తూ, వివరణ ఇవ్వాల్సిందిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేశారు. -
బదిలీల కథ మొదటికి..!
- తహసీల్దార్ల బదిలీ ఉత్తర్వులు రద్దు చేసిన ట్రిబ్యునల్ - పాత స్థానాల్లోనే నియమించాలని ఆదేశాలు - ట్రిబ్యునల్‌ను ఆశ్రయించిన ఐదుగురు తహసీల్దార్లు - తాజాగా బదిలీల ప్రక్రియ చేపట్టేందుకు జిల్లా యంత్రాంగం మొగ్గు - ప్రభుత్వం నిర్ణయం మేరకు నడుచుకుంటామని వెల్లడి సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: తహసీల్దార్ల బదిలీల కథ అడ్డం తిరిగింది. కలెక్టర్ జారీచేసిన బదిలీ ఉత్తర్వులను రద్దు చేస్తూ ట్రిబ్యునల్ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ఇతర జిల్లాల్లో ఎన్నికల విధులు నిర్వర్తించి వెనక్కివచ్చిన తహసీల్దార్లకు పాత స్థానాల్లోనే పోస్టింగ్‌లు ఇవ్వాలని ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లు, ప్రభుత్వ పెద్దల సిఫార్సులతో బదిలీలు జరిగాయనే ఆరోపణలు రావడంతో సతమతమవుతున్న యంత్రాంగాన్ని తాజాగా ట్రిబ్యునల్ తీర్పు మరింత ఇరకాటంలో పడేసింది. సొంత జిల్లా/ మూడేళ్లు పైబడి ఒకే జిల్లాలో పనిచేస్తున్న తహసీల్దార్లకు స్థానచలనం క ల్పించాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఈ క్రమంలో ఎన్నికల వేళ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున తహసీల్దార్లు ఇతర జిల్లాలకు బదిలీ అయ్యారు. ఎన్నికల ప్రక్రియ ముగియడంతో వీరంతా జిల్లాకు తిరిగొచ్చారు. ఈ క్రమంలోనే జిల్లా కలెక్టర్ బి. శ్రీధర్ వెనక్కివచ్చిన తహసీల్దార్లకు పోస్టింగ్‌లిచ్చారు. అయితే, బదిలీల పర్వంలో రాజకీయ ఒత్తిళ్లు శృతిమించడం, సమర్థతను గాకుండా పైరవీలు చేసుకున్నవారికే పెద్ద పీట వేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. తెలంగాణ గెజిటెట్ అధికారుల(టీజీఓ) సంఘం ఏకంగా తమ అసంతృప్తిని ప్రభుత్వానికి కూడా తెలియపరిచింది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించిన వారిని కాదని, మరో సంఘం సిఫార్సులకు ప్రాధాన్యమిచ్చారని ఆ సంఘం అభ్యంతరం తెలిపింది. ఈ క్రమంలోనే 13 మంది తహసీల్దార్లు కొత్త మండలాల్లో బాధ్యతలు స్వీకరించలేదు. దీంతో జిల్లాలో రెవెన్యూ పాలనా వ్యవస్థ స్తంభించింది. ప్రభుత్వమే నేరుగా నియమించిన డిప్యూటీ తహసీల్దార్లు కూడా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించి ‘స్టే’ తెచ్చుకున్నారు. మరోవైపు తాజాగా మరో ఐదుగురు తహసీల్దార్లు వసంతకుమారి (శంకర్పల్లి), దేవుజా (ఘట్కేసర్), శ్రీనివాస్(శామీర్‌పేట), యాదయ్య (షాబాద్), ప్రేంకుమార్ (ఉప్పల్) కూడా ట్రిబ్యునల్ ద్వారా స్టే పొందారు. కలెక్టర్ ఉత్తర్వులు రద్దు చేస్తూ, పాత స్థానాల్లోనే వీరిని నియమించాలని ట్రిబ్యునల్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వులు రద్దు? ట్రిబ్యునల్ ఉత్తర్వులతో బదిలీల అంశం మొదటికొచ్చింది. కోర్టును ఆశ్రయించిన ఐదుగురికి పాత స్థానాల్లో పోస్టింగ్ ఇవ్వాలని నిర్దేశించిన ట్రిబ్యునల్.. అదేసమయంలో రెండు విడతలుగా కలెక్టర్ జారీచేసిన బదిలీ ఉత్తర్వులను సస్పెండ్ చేసింది. దీంతో బదిలీలపై మీమాంస నెలకొంది. ట్రిబ్యునల్ తీర్పును పరిశీలిస్తే బదిలీల ప్రక్రియను మళ్లీ కొత్తగా చేపట్టాలని స్పష్టమవుతుందని, దీనిపై ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని జిల్లా యంత్రాంగం స్పష్టం చేస్తోంది. మరోవైపు ఇప్పటికే ఆయా చోట్ల విధులు నిర్వర్తిస్తున్న తహసీల్దార్లకు తాజా పరిణామం మింగుడుపడడంలేదు. బదిలీల ప్రక్రియ రాద్ధాంతం సృష్టించడం, ఉద్యోగసంఘాలు రెండుగా చీలిపోవడం జిల్లా ఉన్నతాధికారులకు కూడా తలనొప్పిగా తయారైంది. మరోవైపు మునుపెన్నడూలేని విధంగా బదిలీల్లో ప్రజాప్రతినిధులు తలదూర్చడం కూడా యంత్రాంగానికి ఇబ్బంది మారింది.