మీథేన్‌కు బ్రేక్ | Methane gas extraction work temporarily break | Sakshi
Sakshi News home page

మీథేన్‌కు బ్రేక్

Published Thu, Aug 6 2015 3:15 AM | Last Updated on Sun, Sep 3 2017 6:50 AM

మీథేన్‌కు బ్రేక్

మీథేన్‌కు బ్రేక్

 రాష్ట్రంలో మీథేన్ వాయువు తవ్వకాల పనులకు తాత్కాలికంగా బ్రేక్ వేస్తూ చెన్నైలోని దక్షిణ భారత పర్యావరణ ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. అలాగే, ఈ తవ్వకాలపై పరిశీలన చేపట్టిన ఎండీఎంకే నేత వైగో సహాయాన్ని తీసుకునేందుకు నిర్ణయించింది.
 
 సాక్షి, చెన్నై: రాష్ట్రంలోని కావేరి తీర జిల్లాల్లో మిథేన్ వాయువు తవ్వకాలకు యూపీఏ హయాంలో చర్యలు చేపట్టారు. ఇందుకు కేంద్ర పెట్రోలియంశాఖ నాలుగేళ్ల క్రితం  అనుమతి ఇచ్చింది. ఓ ప్రైవేటు సంస్థ నేతృత్వంలో కావేరి నదీ  తీరంలోని  డెల్టా జిల్లాలు తంజావూరు, తిరువారూర్, నాగపట్నంలను కలుపుతూ ఈ పనులకు చర్యలు తీసుకున్నారు. 667 కి.మీ దూరం, భూగర్భంలో 500 నుంచి పదిహేను వందల అడుగుల మేరకు తవ్వకాలు జరుపుకునే విధంగా అనుమతులు మంజూరయ్యాయి.  
 
 ఆందోళన:మిథేన్ వాయువు నిక్షేపాలు తమ పరిసరాల్లో ఉండడం, వాటిని తవ్వేసి ఇక్కడి నుంచి తరలించేందుకు కేంద్రం సిద్ధం కావడంతో ఆ మూడు జిల్లాల అన్నదాతల్లో ఆందోళన బయలు దేరింది. పంట పొలాలు సర్వనాశనం అవుతాయని, వ్యవసాయం కుంటు పడి, తమ జీవనం ఆగమ్యగోచరంగా మారే ప్రమాదం ఉందన్న ఆవేదనలో పడ్డారు. ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా గళాన్ని విప్పారు. ఈ వాయువును బయటకు తీసుకెళ్లే రీతిలో పంట పొలాల మీద పైప్‌లైన్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టడంతో ఆందోళన రెట్టింపు అయింది.
 
 అన్నదాతల్లో బయలు దేరిన ఆందోళనను పరిగణలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ప్రయత్నాల్ని  మొక్కలోనే తుంచి పడేయడానికి సిద్ధమైంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మిథైన్ తవ్వకాలకు అనుమతి ఇవ్వబోమని గత ప్రభుత్వాన్ని హెచ్చరించింది. అయితే, ఫలితం శూన్యం. చివరకు రాష్ట్ర ప్రభుత్వం ఆ పనుల్ని తాత్కాలికంగా నిలుపుదల చేయించి, ప్రత్యేక కమిటీని రంగంలోకి దించింది. అయితే, ఆ కమిటీ ఏమైందో ఏమోగానీ, కేంద్రంలో అధికారం మారినా, మిథైన్ తవ్వకాలకు వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. దీంతో అన్నదాతల్లో ఆక్రోశం రగులుతూనే ఉంది.
 
 ట్రిబ్యునల్‌కు : తమకు న్యాయం జరిగే రీతిలో చర్యలు తీసుకోవాలని కోరుతూ అన్నదాతల తరపున పర్యావరణ ట్రిబ్యునల్‌కు ఫిర్యాదు చేరింది. తిరువయ్యారుకు చెందిన పాండియన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. మిథైన్ తవ్వకాలను వివరిస్తూ తన పిటిషన్ దాఖలు చేశారు. కేంద్రం, ఓఎన్‌జీసీ సంస్థ కలిసి ఈ తవ్వకాలకు చర్యలు చేపట్టాయని, అయితే, రాష్ట్ర ప్రభుత్వ, పర్యావరణ అనుమతి మాత్రం ఇంత వరకు పొందలేదని ట్రిబ్యునల్ దృష్టికి తెచ్చారు. ఎలాంటి అనుమతులు లేకున్నా, ఇష్టానుసారంగా పంట పొలాల్ని తవ్వే పనుల్లో పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై తాము నిలదీస్తే, రాష్ట్ర ప్రభుత్వ అనుమతి అవసరం లేదని హెచ్చరిస్తున్నారని, దీనిపై స్పందించి అన్నదాతలకు న్యాయం చేకూర్చాలని విన్నవించారు.
 
 పనులకు బ్రేక్ : ఈ పిటిషన్‌ను బుధవారం చెన్నైలోని దక్షిణ భారత పర్యావరణ ట్రిబ్యునల్ న్యాయమూర్తి జ్యోతిమణి, సభ్యుడు ప్రొఫెసర్ నాగేంద్రన్ విచారించారు. ఆ పిటిషన్‌ను పరిగణలోకి తీసుకున్న ట్రిబ్యునల్ మిథైన్‌కు వ్యతిరేకంగా ఆదేశాలు జారీ చేసింది. ఎ్కడి పనుల్ని అక్కడే నిలుపుదల చేయాలని తాత్కాలిక  ఉత్తర్వుల్ని జారీ చేసింది. తదుపరి విచారణ సోమవారం జరుగుతుందని, అంత వరకు అన్ని పనులు ఆపాల్సిందేనని స్పష్టం చేస్తూ, వివరణ ఇవ్వాల్సిందిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేశారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement