Methane gas
-
గాలి నిండా మీథేన్!
పర్యావరణానికి ప్రధాన శత్రువు మనిషేనని మరోసారి రుజువైంది. శిలాజ ఇంధనాల వాడకం, పారిశ్రామికీకరణ వంటి మానవ కార్యకలాపాల వల్ల 20 ఏళ్లలోనే ఏకంగా 67 కోట్ల టన్నుల మేరకు ప్రమాదకర మీథేన్ వాయువు వాతావరణంలోకి విడుదలైందట. స్టాన్‌ఫర్డ్ వర్సిటీ సైంటిస్టుల తాజా అధ్యయనంలో తేలిన చేదు నిజమిది. ఈ దెబ్బకు పారిశ్రామికీకరణకు ముందు నాటితో పోలిస్తే గాలిలో మీథేన్ పరిమాణం ఏకంగా 2.6 రెట్లు పెరిగిపోయిందని ఆ నివేదిక పేర్కొంది. పైగా, ‘‘ఇవి 2020 నాటి గణాంకాల ఆధారంగా వేసిన లెక్కలు. ఈ నాలుగేళ్లలో పరిస్థితి మరింత దిగజారింది’’ అంటూ హెచ్చరించింది... 2000 నుంచి కొన్నాళ్ల పాటు వాతావరణంలో మీథేన్ పెరుగుదల కాస్త అదుపులోనే ఉంటూ వచ్చింది. కానీ ఆ తర్వాత పలు దేశాలు శిలాజ ఇంధనాల ఉత్పత్తి, వాడకాలను విచ్చలవిడిగా పెంచేయడంతో ప్రమాదకర స్థాయిలో పెరుగుతూ వస్తోంది. బొగ్గు, చమురు, సహజవాయువు తదితరాల వెలికితీత, వాడకం వల్ల వెలువడుతున్న మీథేన్ పరిమాణం గత 20 ఏళ్లలో ఏకంగా 33 శాతం పెరిగిపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అలాగే వ్యర్థాలు తదితరాల నుంచి మీథేన్ విడుదలవుతున్న 20 శాతం, వ్యవసాయం వల్ల మరో 14 శాతం పెరిగిందని అధ్యయనం తేలి్చంది! ‘ప్రపంచం పెద్దగా పట్టించుకోవడం లేదు గానీ, వాతావరణంలో పెరిగిపోతున్న మీథేన్ పరిమాణం పర్యావరణానికి పెద్ద విపత్తుగా పరిణమిస్తోంది’ అని అధ్యయనానికి సారథ్యం వహించిన గ్లోబల్ కార్బన్ ప్రాజెక్ట్ హెడ్, స్టాన్‌ఫర్డ్ వర్సిటీలో పర్యావరణ శాస్త్రవేత్త రాబ్ జాక్సన్ హెచ్చరించారు. ఈ ప్రాజెక్టు గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను ఎప్పటికప్పుడు గమనిస్తుంటుంది. ‘‘2000 సంవత్సరంలో వాతావరణంలోని మొత్తం మీథేన్ పరిమాణంలో మనిషి వాటా 60 శాతంగా ఉండేది. ఇప్పుడది ఎకాయెకి 65 శాతానికి పెరిగింది. భూ వాతావరణంలో మీథేన్ పెరుగుదల కార్బన్ డయాక్సైడ్ (సీఓటూ) కంటే చాలా ఎక్కువగా నమోదవుతోంది. 2015లోనైతే వాతావరణంలో మీథేన్ సాంద్రత గత 80 లక్షల ఏళ్లలో ఎన్నడూ లేనంత భారీగా నమోదైంది! వాతావరణంలో వేలాది ఏళ్లపాటు ఉండిపోయే సీఓటూతో పోలిస్తే మీథేన్ ఉండేది 12 ఏళ్లే అయినా అది కలగజేసే నష్టం మాత్రం ఎక్కువ. ఎందుకంటే పర్యావరణానికి సీఓటూ కంటే మీథేన్ 82 రెట్లు ఎక్కువ నష్టం చేస్తుంది’’ అని జాక్సన్ వివరించారు. ‘‘మీథేన్, సీఓటూ ఉద్గారాలు ఇలాగే కొనసాగితే 2050 నాటికి ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు ఏకంగా 3 డిగ్రీలకు మించి పెరిగిపోతాయి. అది వినాశనానికి దారితీస్తుంది’’ అని ఆందోళన వెలిబుచ్చారు. ఈ అధ్యయన ఫలితాలు ‘ఎని్వరాన్మెంటల్ రీసెర్చ్ లెటర్స్’లో మంగళవారం ప్రచురితమయ్యాయి.కాగితాల్లోనే లక్ష్యం...మీథేన్ ముప్పుపై అంతర్జాతీయ వేదికలపై ఎన్నోసార్లు చర్చోపచర్చలు జరిగాయి. పర్యావరణ శాస్త్రవేత్తల వరుస ఆందోళనల ఫలితంగా 2021లో దేశాలన్నీ దీనిపై లోతుగా చర్చించాయి. వాతావరణంలో మీథేన్ పరిమాణాన్ని తగ్గిస్తామంటూ ప్రతినబూనాయి. ‘గ్లోబల్ మీథేన్ ప్లెడ్జ్’గా పిలిచే ఒప్పందంపై 100కు పైగా దేశాలు సంతకాలు చేశాయి. మీథేన్ ఉద్గారాలను 2030 నాటికి 30 శాతానికి పైగా తగ్గించాలన్నది దీని లక్ష్యం. ఫలితంగా 2050 నాటికి గ్లోబల్ వార్మింగ్‌లో 0.2 డిగ్రీ సెల్సియస్ మేరకు తగ్గుదల నమోదవుతుందని అంచనా. కానీ ఆచరణలో ఏ దేశమూ చేసింది పెద్దగా ఏమీ లేకపోవడంతో ఈ లక్ష్యం కాగితాలకే పరిమితమైంది. – సాక్షి, నేషనల్ డెస్క్ మీథేన్‌తో పెను ప్రమాదమే⇒ ఏటా 5.8 కోట్ల టన్నుల మీథేన్ వాతావరణంలోకి విడుదలవుతోందని అంచనా. ఇందులో మనిషి వాటాయే ఏకంగా 60 శాతం. ⇒ వ్యవసాయం, శిలాజ ఇంధనాల వెలికితీత, వాటి వాడకం తదితరాల వల్ల 60 శాతం మీథేన్ విడుదలవుతోంది. ⇒ అమెరికాలో కేవలం గ్యాస్ డ్రిల్లింగ్ కారణంగా 2005 నుంచి ఇప్పటిదాకా ఏకంగా 1.17 కోట్ల టన్నుల మీథేన్ విడుదలై ఉంటుందని అంచనా! ⇒ గాల్లో మీథేన్ పరిమాణం పెరిగితే వచ్చే సమస్యలు అన్నీ ఇన్నీ కావు. ⇒ గ్లోబల్ వార్మింగ్‌కు ప్రధాన కారణమైన గ్రీన్‌హౌజ్ వాయు ఉద్గారాల్లో మీథేన్దే పెద్ద వాటా. ⇒ పారిశ్రామికీకరణ అనంతరం గత 150 ఏళ్లలో ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు ప్రమాదకరంగా పెరిగిపోతుండటం తెలిసిందే. అందులో మూడో వంతు పెరుగుదల మీథేన్ వల్లే సంభవిస్తోంది! ⇒ వాతావరణంలోని వేడిని మీథేన్ నిర్బంధించి దాన్ని తిరిగి భూమిపైకే పంపుతుంది. మరోలా చెప్పాలంటే భూ ఉపరితలంపై ఓజోన్ పొరలాంటి దాన్ని ఏర్పరుస్తుంది. అలా భూ ఉష్ణోగ్రతలు పైకి వెళ్లకుండా అడ్డుకుంటుంది. తద్వారా పర్యావరణం నానాటికీ వేడెక్కుతోంది. ⇒ వాయు నాణ్యతను కూడా మీథేన్ బాగా దెబ్బ తీస్తుంది. దాంతో మనుషులతో పాటు జంతువుల్లో కూడా శ్వాసకోశ సంబంధిత సమస్యలు పెరుగుతాయి. ⇒ పర్యావరణానికి కార్బన్ డయాక్సైడ్ కంటే మీథేన్ వల్ల జరిగే నష్టం ఏకంగా 82 రెట్లు ఎక్కువ! ⇒ తాజా అధ్యయనం కేవలం 2020 నాటికి అందులో ఉన్న డేటా ఆధారంగా చేసినదే. ఈ నాలుగేళ్లలో మీథేన్ ప్రభావం మరింత వేగంగా పెరుగుతూ వస్తోందన్నది పర్యావరణవేత్తల మాట. తక్షణం దిద్దుబాటు చర్యలు తప్పవని వారంటున్నారు.భూ సగటు ఉష్ణోగ్రతల పెరుగుదలను అంతర్జాతీయంగా అంగీకరించిన 1.5 డిగ్రీ సెల్సియస్ స్థాయికి పరిమితం చేయాలంటే సీఓటూ ఉద్గారాలను సగానికి, మీథేన్ ఉద్గారాలను మూడో వంతుకు తగ్గించాలి. ఈ దిశగా తక్షణ కార్యాచరణ అత్యవసరం – బిల్ హేర్, క్లైమేట్ అనలిటిక్స్ సీఈఓ, పర్యావరణ శాస్త్రవేత్త -
సూపర్ ట్రాక్టర్.. ప్రపంచంలో మొట్టమొదటిది ఇదే!
గోమయమే ఇంధనంగా నడిచే ఈ ట్రాక్టర్‌ను ఇటాలియన్ కంపెనీ ‘న్యూహాలండ్’ కంపెనీ భాగస్వామ్యంతో ‘బెన్నామాన్’ అనే బ్రిటిష్ కంపెనీ రూపొందించింది. ఆవుపేడ నుంచి వచ్చే మీథేన్ గ్యాస్‌ను మైనస్ 162 డ్రిగీల ఉష్ణోగ్రత వద్ద ద్రవరూపంలోకి మార్చి, దానిని ఇంధనంగా ఉపయోగించుకునేలా ఈ ట్రాక్టర్‌ను రూపొందించారు. వంద ఆవుల మంద నుంచి సేకరించిన పేడ నుంచి వచ్చే మీథేన్ ఈ ట్రాక్టర్‌కు ఏడాది పొడవునా ఇంధనంగా సరిపోతుంది. గోమయం నుంచి సేకరించిన మీథేన్‌తో నడిచే వాహనాల్లో ఇదే ప్రపంచంలో మొట్టమొదటిదని బెన్నామాన్ కంపెనీ సహ వ్యవస్థాపకుడు క్రిస్ మాన్ చెబుతున్నారు. ఇది సాధారణ డీజిల్ ట్రాక్టర్లకు దీటుగా పనిచేస్తుందని, డీజిల్ ట్రాక్టర్లతో పోల్చుకుంటే, దీని నుంచి విడుదలయ్యే కర్బన ఉద్గారాలు ఏడాదికి 2500–500 టన్నులు తక్కువేనని ఆయన వెల్లడించారు. అమెరికాలో గత డిసెంబర్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ ట్రాక్టర్ పనితీరును ప్రదర్శించారు. త్వరలోనే దీనిని మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. చదవండి: చాట్‌జీపీటీ సరికొత్త చరిత్ర! నెలల వ్యవధిలోనే కోట్లాది యూజర్లు -
Viral Video: చేతిపంపు నుంచి మంటలు, ఆ వెంటనే నీరు.. జనం పరుగో పరుగు!
ప్రకృతిలో వింతలు, విడ్డూరాలకు కొదవుండదు. అప్పటిదాకా మామూలుగానే ఉన్న పరిస్థితులు ఒక్కసారిగా పూర్తి భిన్నంగా మారిపోతుంటాయి. అంతా తమకు తెలిసే జరుగుతుందనుకునే మనిషి ఆ ఊహించని ఘటనలతో ఒక్కసారిగా ఉలిక్కిపడతాడు. తాజాగా మధ్యప్రదేశ్‌లోని బుక్సువా బ్లాక్, కచ్చర్ గ్రామస్తులకు అలాంటి వింతైన అనుభవమొకటి కలిగింది. చేతిపంపులో నుంచి ఒక్కసారిగా భారీ మంటలు ఆ వెంటనే నీళ్లు రావడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఆ చుట్టుపక్కల ఉన్నవారు పరుగులు పెట్టారు. అలా చాలా సేపు కొనసాగడంతో ఆ దృశ్యాలను తమ సెల్‌ఫోన్ కెమెరాల్లో బంధించారు కొందరు. దీంతో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. (చదవండి: స్టూడెంట్ రిపోర్టింగ్‌కు సోనూసూద్ ఫిదా.. నీ కోసం కొత్త స్కూల్ రెడీ అంటూ..) బుధవారం సాయంత్రం ఈ ఘటన వెలుగుచూసింది. నమ్మశక్యంగాని ఘటనతో స్థానికులు ఎవరికి వారు ఊహించుకున్నారు. తమ కళ్లను అస్సలు నమ్మలేక పోతున్నామని కొందరు అంటుండగా.. కెమికల్ లీక్ వల్లే ఇలా జరిగిందని మరికొందరు చెప్తున్నారు. ఈనేపథ్యంలో స్థానిక నేతలు కొందరు చత్తర్‌పూర్ జిల్లా అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన అధికారులు భూమి లోపలి పొరల్లోంచి మీథేన్ వాయువు వెలువడటంతో మంటలు చెలరేగాయని తెలిపారు. భోపాల్ ప్రభుత్వ సైన్స్ కాలేజీకి చెందిన డాక్టర్ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ.. బుక్సువా ప్రాంతంలోని భూమి పొరల్లో వృక్ష, జంతు వ్యర్థాలు పెద్ద ఎత్తున పోగుపడి ఉన్నాయని పేర్కొన్నారు. ఈక్రమంలోనే రసాయన చర్య కారణంగా మీథేన్ వాయువు మండుతూ పైకి చొచ్చుకొచ్చిందని, దాంతోపాటు నీరు కూడా పైకి ఎగజిమ్మిందని చెప్పుకొచ్చారు. (చదవండి: అంబులెన్స్ రాలేదు.. జేసీబీతో గర్భిణి ఆస్పత్రికి తరలింపు: వీడియో వైరల్) Hand pump spewing fire and water in Kachhar village, Buxwaha,Villagers have informed the concerned officials.Local administration is sending a team to spot#madhyapradesh pic.twitter.com/8M4c7HfRQN — Siraj Noorani (@sirajnoorani) August 25, 2022 -
ముంచుకొస్తున్న ముప్పు
పర్యావరణవేత్తల హితవు అరణ్యరోదనమవుతున్నప్పుడు పర్యవసానాలు ప్రమాదకరంగా పరిణ మించక తప్పదు. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో వాతావరణ మార్పులపై పనిచేస్తున్న ఐపీసీసీ బృందం రూపొందించిన ముసాయిదా నివేదిక భూగోళం నానాటికీ ఎలా నాశనమవుతున్నదో కళ్లకు కట్టింది. సకాలంలో మేల్కొనకపోతే అంచనాలకు భిన్నంగా త్వరలోనే తీవ్రమైన ప్రకృతి వైపరీ త్యాలు తప్పవని, తిరిగి కోలుకోలేనంత నష్టం వాటిల్లడం ఖాయమని హెచ్చరించింది. ఇప్పుడు లీకైన నివేదిక అసంపూర్ణమైనదే. వచ్చే నవంబర్‌లో గ్లాస్గోలో సమితి ఆధ్వర్యంలో జరిగే వాతావరణ సదస్సు కాప్ 26 సారథులు ఇంకా పరిశీలించాల్సివుంది గనుక అధికారికంగా నివేదికను విడుదల చేయలేదు. ఒకసారంటూ ఉష్ణోగ్రతలు నిర్దిష్ట స్థాయికి చేరాయంటే ఆ తర్వాత ఊహకందని వరుస పరిణామాలు చోటుచేసుకుంటాయని నివేదిక అంటున్నది. ఆర్కిటిక్‌లో అతిశీతోష్ణస్థితిలో ఉన్న మంచు పెను ఉష్ణోగ్రతలకు కరగడం మొదలైందంటే భారీయెత్తున మీథేన్ వాయువు వెలువడుతుం దని, శక్తివంతమైన ఈ వాయువు మరింత వేడిమికి కారణమవుతుందని నివేదిక అంచనా. పర్యావరణ పెనుమార్పుల తర్వాత జీవావరణ వ్యవస్థలోని ఇతరాలన్నీ దానికి అనుగుణంగా మారొచ్చు గానీ.. మనిషికి మాత్రం అది అసాధ్యమని, అంతరించిపోవటం ఖాయమని హెచ్చరిస్తోంది. నానాటికీ మనిషి దురాశకు అంతూ పొంతూ లేకుండా పోవడంతో ప్రకృతిలోని పంచభూతాలూ కాలుష్యం బారిన పడుతున్నాయి. కనుకనే వైపరీత్యాలు తప్పడం లేదు. త్రికాలాలూ ఉత్పాతాలను చవిచూస్తున్నాయి. అకాల వర్షాలు, వరదలు, వడగాలులు, కరువుకాటకాలు, భూకంపాలు తరచుగా వేధిస్తున్నాయి. ధ్రువప్రాంతాల్లో మంచు పలకలు కరిగి విరుగుతున్నాయి. సముద్రాలు వేడెక్కు తున్నాయి. ఫలితంగా ప్రపంచ దేశాలన్నిటా ప్రతియేటా కోట్లాదిమంది పౌరుల జీవితాలు చిన్నా భిన్నమవుతున్నాయి. పర్యావరణ పరిరక్షణ విషయంలో ప్రజలను జాగృతం చేయటం సంగతి అటుంచి, ప్రభుత్వాలే అచేతనంగా పడివుంటున్నాయి. తమ బాధ్యతలను పూర్తిగా విస్మరిస్తున్నాయి. పర్యావరణంపై అంతర్జాతీయ సదస్సులు జరిగినప్పుడు ఒకరు ముందుకు లాగితే, మరొకరు వెనక్కి లాగటం... మర్కట తర్కాలకు దిగటం అగ్ర రాజ్యాలకు అలవాటైపోయింది. 1992లో రియోడి జెనైరోలో ప్రపంచ దేశాలన్నీ తొలిసారి సభ చేసుకుని భూగోళాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరంపై అభిప్రాయాలను ఇచ్చిపుచ్చుకున్నాయి. అందరం కలిసి పర్యావరణ క్షీణతను సరిదిద్దుకుందామని సంకల్పం చెప్పుకున్నాయి. అందుకొక కార్యాచరణను సైతం రూపొందించుకున్నాయి. ఆ తర్వాత 1997లో క్యోటోలో శిఖరాగ్ర సదస్సు జరిగింది. అక్కడ కూడా ప్రపంచ దేశాలన్నీ కలిసికట్టుగా కదులుదామని తీర్మానించాయి. 1990 నాటితో పోలిస్తే 2012కల్లా 5 శాతం ఉద్గారాలను తగ్గించు కోవాలని నిర్ణయించాయి. ఇందుకు అప్పటి అమెరికా ఉపాధ్యక్షుడు అల్ గోర్ సైతం అంగీకరించి సంతకం చేశారు. కానీ ఇదంతా అశాస్త్రీయమని, చాదస్తమని అమెరికన్ కాంగ్రెస్‌లో రిపబ్లికన్లు అడ్డుకున్నారు. దాంతో ఆ వాగ్దానం కాస్తా అటకెక్కింది. క్యోటో శిఖరాగ్ర సదస్సు తీసుకున్న నిర్ణయా లన్నీ ఆవిధంగా దాదాపు దశాబ్దంపాటు స్తంభించిపోయాయి. అగ్ర దేశమే ఇలా అఘోరిస్తే వేరే దేశాల సంగతి చెప్పనవసరం లేదు. ఇతర సంపన్న దేశాలు సైతం పట్టనట్టు వుండిపోయాయి. 2015నాటి పారిస్ శిఖరాగ్ర సదస్సు ఒడంబడికపై అందరూ ఆశావహ దృక్పథంతో వుంటుండగా, అమెరికాలో ట్రంప్ మహాశయుడు పగ్గాలు చేపట్టి ఆ ఆశలపై చన్నీళ్లు చల్లారు. జో బైడెన్ అధికారం లోకొచ్చాక పారిస్ ఒడంబడికను గుర్తిస్తున్నట్టు అమెరికా తెలియజేసింది. వాస్తవానికి ఆ ఒడంబడిక లక్ష్యాలు కనీసం మూడింతలు మించితే తప్ప ప్రయోజనం శూన్యమని పర్యావరణవేత్తలు పెదవి విరిచారు. విషాదమేమంటే, కనీసం అదైనా సక్రమంగా అమలు కావటం లేదు. ఈసారి ఐపీసీసీ ముసాయిదా నివేదికలో ఉపయోగించిన భాష ఎలాంటివారికైనా దడ పుట్టి స్తుంది. ఆకలి, అనారోగ్యం, కరువు కొన్ని దశాబ్దాల్లోనే కోట్లాదిమందిని చుట్టుముడతాయని ముసా యిదా హెచ్చరించింది. 2050 నాటికి మరో 8 కోట్లమంది ఆకలి బారిన పడతారని, ఆసియా, ఆఫ్రి కాల్లో అదనంగా కోటిమంది పిల్లలు పౌష్టికాహార లోపంతో వ్యాధుల బారిన పడతారని తాజా ముసాయిదా చెబుతున్నది. గత నివేదికలు సైతం జరుగుతున్న పరిణామాలపై, రాగల ప్రమాదా లను ఏకరువు పెట్టిన మాట వాస్తవమే. కానీ ఎలాంటి మార్పుల తర్వాత ఇక వెనక్కి వెళ్లలేని స్థితికి చేరుకుంటామన్న అంశంలో శాస్త్రవేత్తలకు ఇంత స్పష్టత లేదు. అటువంటివాటిని తాజా ముసాయిదా డజనువరకూ గుర్తించింది. 2050 నాటికి భూతాపం పెరుగుదలను పారిశ్రామికీకరణకు ముందున్న ఉష్ణోగ్రతలకంటే 2 డిగ్రీల సెల్సియస్ మించకుండా చూడాలని, అది కనీసం 1.5 డిగ్రీల సెల్సియస్ కైనా పరిమితం కావాలని పారిస్ శిఖరాగ్ర సదస్సు భావించింది. తాజా ముసాయిదా భూగోళం 3 డిగ్రీల సెల్సియస్ పెరుగుదలను చవిచూడబోతున్నదని జోస్యం చెబుతోంది. 2100లోగా పర్యావ రణం పెను మార్పులు చవిచూసే అవకాశంలేదని గత నమూనాలు సూచించగా, తాజా ముసా యిదా మాత్రం అందుకు భిన్నమైన అంచనాలు చెబుతోంది. కనుక ఈ విశ్వంలో జీవరాశికి చోటి స్తున్న ఒక్కగానొక్క భూగోళాన్నీ రక్షించుకునే నిర్ణయాలు వేగిరం తీసుకోనట్టయితే, ఇది సైతం అంత రించటం ఎంతో దూరంలో లేదని అన్ని దేశాలూ... ప్రత్యేకించి సంపన్న దేశాలూ గ్రహించటం తక్షణావసరం. -
23% ఎక్కువ జీర్ణమయ్యే జొన్న!
- ఆ మేరకు పాల, మాంసం దిగుబడి పెరుగుతుంది.. - మిథేన్ విడుదలనూ గణనీయంగా తగ్గించే సూటి వంగడం.. - ఇవీ గోధుమ రంగు ఈనె కలిగిన జొన్న ‘ఎస్.పి.వి. 2018’ విశిష్టతలు - ఫలించిన ఐ.ఐ.ఎం.ఆర్. శాస్త్రవేత్త డా. ఉమాకాంత్ పన్నెండేళ్ల కృషి - వచ్చే ఖరీఫ్‌లో రైతులకు అందుబాటులోకి రానున్న విత్తనాలు బాగా జీర్ణమయ్యే పశుగ్రాసంగా, మిథేన్ విడుదలను తగ్గించడానికి ఉపకరించే సరికొత్త జొన్న రకం రైతులకు త్వరలో అందుబాటులోకి రానుంది. ‘ఎస్.పి.వి. 2018’ అనే ఈ సూటి రకం వంగడాన్ని హైదరాబాద్ (రాజేంద్రనగర్)లోని భారతీయ చిరుధాన్యాల పరిశోధనా సంస్థ (ఐ.ఐ.ఎం.ఆర్.) రూపొందించింది. ప్రధాన శాస్త్రవేత్త డా.ఆకుల వెంకట ఉమాకాంత్ 12 ఏళ్లుగా చేస్తున్న పరిశోధన ఫలించింది. కాండం, ఆకులో ఈనె గోధుమ రంగు (సాధారణ జొన్నలో తెల్లగా ఉంటాయి)లో కలిగి ఉండడం ‘ఎస్.పి.వి. 2018’ జొన్న ప్రత్యేకత. ఇదే తొలి భారతీయ బ్రౌన్ మిడ్రిబ్ సోర్గమ్ రకం కావడం విశేషం. ఈ చొప్పలో లిగ్నిన్ తక్కువగా ఉంటుంది. అందువల్ల ఇతర జొన్న రకాల కన్నా తీపిగా ఉండడంతోపాటు, పశువులకు ఎక్కువగా జీర్ణమవుతుందని డా. ఉమాకాంత్ ‘సాక్షి సాగుబడి’ ప్రతినిధికి తెలిపారు. హిస్సార్ (హరియాణా)లోని కేంద్రీయ గేదెల పరిశోధనా సంస్థ (సి.ఐ.ఆర్.బి.) అధ్యయనంలో ఈ చొప్ప మునుపటికన్నా 23 శాతం ఎక్కువగా జీర్ణమైనట్లు వెల్లడైంది. సాధారణ రకాల చొప్పను గేదెలకు మేపినప్పుడు 52% వరకు జీర్ణమైతే.. ఎస్.పి.వి. 2018 రకం చొప్ప 64% వరకు (మునుపటి కన్నా 23% ఎక్కువ) జీర్ణమైందని సి.ఐ.ఆర్.బి. గుర్తించింది. ఆ మేరకు పాల, మాంసం దిగుబడి పెరుగుతుందని డా. ఉమాకాంత్ తెలిపారు. ఖరీఫ్‌లో వర్షాధారంగా 120 రోజుల్లో 7-8 అడుగుల ఎత్తు పెరుగుతుంది. 16 టన్నుల చొప్పతోపాటు 2 టన్నుల జొన్నల దిగుబడి వస్తుందన్నారు. క్షేత్రస్థాయి పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ రకాన్ని జాతీయ మొక్కల జన్యుహక్కుల నమోదు సంస్థ (ఎన్.బీ.పీ.జీ.ఆర్.)లోనూ నమోదు చేశామన్నారు. పశువుల ద్వారా వాతావరణంలోకి విడుదలయ్యే మిథేన్ వాయువు వల్ల భూగోళం అమితంగా వేడెక్కుతోంది. సాధారణంగా పశువుల నుంచి విడుదలయ్యే వాయువుల్లో మిథేన్ వాటా 32% ఉంటుంది. కానీ, ఎస్.పి.వి. 2018 చొప్పను మేపితే ఇది 24% శాతానికి తగ్గిందని పీవీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ అధ్యయనంలో వెల్లడైందని డా. ఉమాకాంత్ తెలిపారు. ఇథనాల్ ఉత్పత్తికి తోడ్పడే రెండో తరం జొన్న ఇది.. ప్రస్తుతం తీపి జొన్న మొక్క కాండం రసంతో జీవ ఇంధనం ఇథనాల్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. ఇథనాల్ ఉత్పత్తిని పెద్ద ఎత్తున పెంపొందించడానికి ఉపకరించే రెండో తరం జొన్న వంగడంగా ఎస్.పి.వి. 2018 రకం ఉపయోగపడుతుందని డా. ఉమాకాంత్ తెలిపారు. లిగ్నిన్ తక్కువగా ఉంటుంది కాబట్టి (జొన్నలు తొలగించి చొప్పను పూర్తిగా ఇథనాల్ ఉత్పత్తిలో వాడుకోవడానికి ఈ రకం ఉపయోగపడుతుందని ఆయన అన్నారు.ఎస్.పి.వి. 2018 ప్రత్యేక జొన్న విత్తనాలను వచ్చే ఖరీఫ్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రైతులకు ఇవ్వనున్నట్లు ఐ.ఐ.ఎం.ఆర్. డెరైక్టర్ డా. విలాస్ తొనపి ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. - పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
మీథేన్‌కు బ్రేక్
రాష్ట్రంలో మీథేన్ వాయువు తవ్వకాల పనులకు తాత్కాలికంగా బ్రేక్ వేస్తూ చెన్నైలోని దక్షిణ భారత పర్యావరణ ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. అలాగే, ఈ తవ్వకాలపై పరిశీలన చేపట్టిన ఎండీఎంకే నేత వైగో సహాయాన్ని తీసుకునేందుకు నిర్ణయించింది. సాక్షి, చెన్నై: రాష్ట్రంలోని కావేరి తీర జిల్లాల్లో మిథేన్ వాయువు తవ్వకాలకు యూపీఏ హయాంలో చర్యలు చేపట్టారు. ఇందుకు కేంద్ర పెట్రోలియంశాఖ నాలుగేళ్ల క్రితం అనుమతి ఇచ్చింది. ఓ ప్రైవేటు సంస్థ నేతృత్వంలో కావేరి నదీ తీరంలోని డెల్టా జిల్లాలు తంజావూరు, తిరువారూర్, నాగపట్నంలను కలుపుతూ ఈ పనులకు చర్యలు తీసుకున్నారు. 667 కి.మీ దూరం, భూగర్భంలో 500 నుంచి పదిహేను వందల అడుగుల మేరకు తవ్వకాలు జరుపుకునే విధంగా అనుమతులు మంజూరయ్యాయి. ఆందోళన:మిథేన్ వాయువు నిక్షేపాలు తమ పరిసరాల్లో ఉండడం, వాటిని తవ్వేసి ఇక్కడి నుంచి తరలించేందుకు కేంద్రం సిద్ధం కావడంతో ఆ మూడు జిల్లాల అన్నదాతల్లో ఆందోళన బయలు దేరింది. పంట పొలాలు సర్వనాశనం అవుతాయని, వ్యవసాయం కుంటు పడి, తమ జీవనం ఆగమ్యగోచరంగా మారే ప్రమాదం ఉందన్న ఆవేదనలో పడ్డారు. ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా గళాన్ని విప్పారు. ఈ వాయువును బయటకు తీసుకెళ్లే రీతిలో పంట పొలాల మీద పైప్లైన్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టడంతో ఆందోళన రెట్టింపు అయింది. అన్నదాతల్లో బయలు దేరిన ఆందోళనను పరిగణలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ప్రయత్నాల్ని మొక్కలోనే తుంచి పడేయడానికి సిద్ధమైంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మిథైన్ తవ్వకాలకు అనుమతి ఇవ్వబోమని గత ప్రభుత్వాన్ని హెచ్చరించింది. అయితే, ఫలితం శూన్యం. చివరకు రాష్ట్ర ప్రభుత్వం ఆ పనుల్ని తాత్కాలికంగా నిలుపుదల చేయించి, ప్రత్యేక కమిటీని రంగంలోకి దించింది. అయితే, ఆ కమిటీ ఏమైందో ఏమోగానీ, కేంద్రంలో అధికారం మారినా, మిథైన్ తవ్వకాలకు వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. దీంతో అన్నదాతల్లో ఆక్రోశం రగులుతూనే ఉంది. ట్రిబ్యునల్‌కు : తమకు న్యాయం జరిగే రీతిలో చర్యలు తీసుకోవాలని కోరుతూ అన్నదాతల తరపున పర్యావరణ ట్రిబ్యునల్‌కు ఫిర్యాదు చేరింది. తిరువయ్యారుకు చెందిన పాండియన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. మిథైన్ తవ్వకాలను వివరిస్తూ తన పిటిషన్ దాఖలు చేశారు. కేంద్రం, ఓఎన్జీసీ సంస్థ కలిసి ఈ తవ్వకాలకు చర్యలు చేపట్టాయని, అయితే, రాష్ట్ర ప్రభుత్వ, పర్యావరణ అనుమతి మాత్రం ఇంత వరకు పొందలేదని ట్రిబ్యునల్ దృష్టికి తెచ్చారు. ఎలాంటి అనుమతులు లేకున్నా, ఇష్టానుసారంగా పంట పొలాల్ని తవ్వే పనుల్లో పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై తాము నిలదీస్తే, రాష్ట్ర ప్రభుత్వ అనుమతి అవసరం లేదని హెచ్చరిస్తున్నారని, దీనిపై స్పందించి అన్నదాతలకు న్యాయం చేకూర్చాలని విన్నవించారు. పనులకు బ్రేక్ : ఈ పిటిషన్‌ను బుధవారం చెన్నైలోని దక్షిణ భారత పర్యావరణ ట్రిబ్యునల్ న్యాయమూర్తి జ్యోతిమణి, సభ్యుడు ప్రొఫెసర్ నాగేంద్రన్ విచారించారు. ఆ పిటిషన్‌ను పరిగణలోకి తీసుకున్న ట్రిబ్యునల్ మిథైన్కు వ్యతిరేకంగా ఆదేశాలు జారీ చేసింది. ఎ్కడి పనుల్ని అక్కడే నిలుపుదల చేయాలని తాత్కాలిక ఉత్తర్వుల్ని జారీ చేసింది. తదుపరి విచారణ సోమవారం జరుగుతుందని, అంత వరకు అన్ని పనులు ఆపాల్సిందేనని స్పష్టం చేస్తూ, వివరణ ఇవ్వాల్సిందిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేశారు. -
ఈ సరస్సుపై మీరూ నడవగలరు..!
చూడ్డానికి లోతుగానే ఉన్నట్టుంది.. నడవడం ఎలా సాధ్యమని అనుకుంటున్నారా? నీటితో నిండుగా కళకళలాడుతున్నట్లు కనిపిస్తున్నా.. వాస్తవానికి ఈ సరస్సు గడ్డకట్టుకుపోయి ఉంది! నీటిలో మొలిచిన భారీ పుట్టగొడుగుల్లా కనిపిస్తున్నవి మీథేన్ గాలి బుడగలు. సరస్సు గడ్డకట్టుకుపోవడంతో అవి లోపలే ఇలా చిక్కుకుపోయాయి. మంచు కరిగిపోయిన తర్వాతే ఈ బుడగలు పేలి మీథేన్ గ్యాస్ విడుదలవుతుందట. ఈ బుడగలకు నిప్పును అంటిస్తే.. చిన్నపాటి బాంబుల్లా ఢామ్మని పేలిపోతాయట. ఏటా శీతాకాలంలో గడ్డకట్టుకుపోయి ఇలా.. కనువిందు చేసే ఈ సరస్సు పేరు మిన్నెవాంకా. కెనడాలోని బాంఫ్ నేషనల్ పార్కులో ఉంది. ఈ సరస్సును ఇటీవల సందర్శించిన పాల్ జిజ్కా అనే ఫొటోగ్రాఫర్ అద్భుతమైన ఫొటోలు తీయడమే కాకుండా.. అటూఇటూ నడిచి ఇలా ముచ్చట తీర్చుకున్నాడు. -
ఏటా జలమండలికి రూ.5.72 కోట్ల నష్టం
సాక్షి, సిటీబ్యూరో: విద్యుత్ కాంతులు వెదజల్లాల్సిన మురుగుశుద్ధి కేంద్రాల్లో కారుచీకట్లు కమ్ముకుంటున్నాయి. నగరంలోని అంబర్పేట్, నాగోల్, నల్లచెరువు(ఉప్పల్) మురుగు శుద్ధి కేంద్రాల్లో (ఎస్టీపీలు) స్థాపిత సామర్థ్యం మేరకు పనిచేయాల్సిన విద్యుత్ కేంద్రాలు సవాలక్ష సాంకేతిక సమస్యలతో కునారిల్లుతున్నాయి. నిత్యం మూడు ఎస్టీపీల్లో 850 కిలోవాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయాల్సిన యంత్రాలు కనాకష్టంగా 400 కిలోవాట్ల విద్యుత్‌ను మాత్రమే ఉత్పత్తి చేసి చతికిలపడుతున్నాయి. జలమండలి పర్యవేక్షణ లోపం.. అధికారుల నిర్లక్ష్యం.. అధ్వాన నిర్వహణ.. అంతులేని అవినీతి.. తదితర కారణాల వల్ల కోట్లాది రూపాయలు మురుగుపాలవుతున్నాయి. మరోవైపు చారిత్రక మూసీనదిని మురుగు కంపు నుంచి కాపాడేందుకు నూతనంగా మరో పది ఎస్టీపీలను నిర్మించే అంశంపై ఇటు జలమండలి, అటు రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో మూడేళ్లుగా ప్రతిపాదనలు కాగితాల్లోనే మగ్గుతున్నాయి. అరకొర విద్యుదుత్పత్తి ఐదేళ్ల క్రితం సుమారు రూ.25 కోట్ల అంచనా వ్యయంతో మూడు ఎస్టీపీల్లో ఏర్పాటు చేసిన ఆస్ట్రియా, జర్మనీ దేశాలకు చెందిన గ్యాస్ ఆధారిత విద్యుదుత్పత్తి యంత్రాల నిర్వహణ లోపంతో తరచూ మొరాయిస్తున్నాయి. ఏటా రూ.2 కోట్ల మేర నిర్వహణ, మరమ్మతులకు కేటాయిస్తున్నా సిబ్బంది చేతివాటంతో ఫలితం లేకుండా పోతోంది. అంబర్పేట్ మురుగు శుద్ధి కేంద్రం వద్ద రోజువారీగా మూసీలో కలుస్తున్న 340 మిలియన్ లీటర్ల మురుగు నీటిని శుద్ధి చేస్తారు. ఇక్కడ మురుగు నీటిలోని ఆర్గానిక్ పదార్థాల నుంచి విడుదలయ్యే మీథేన్ గ్యాస్‌తో 600 కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలని జలమండలి లక్ష్యం నిర్దేశించింది. కానీ ప్రస్తుతానికి 350 కిలోవాట్లే ఉత్పత్తి అవుతోంది. దీంతో నెలవారీగా ఎస్టీపీ నిర్వహణకయ్యే విద్యుత్ కోసం రూ.20 లక్షల బిల్లును జలమండలి చెల్లించాల్సి వస్తోంది. ఇక నాగోల్ మురుగు శుద్ధి కేంద్రం వద్ద నిత్యం 170 మిలియన్ లీటర్ల నీటిని శుద్ధి చేస్తారు. ఇక్కడ ఉత్పన్నమయ్యే మీథేన్ గ్యాస్ ద్వారా రోజువారీగా 200 కిలోవాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసేలా విద్యుత్ ఉత్పత్తి ఉపకరణాలను ఏర్పాటు చేశారు. కానీ కేవలం 50 కిలోవాట్లు ఉత్పత్తి చేసి ఇక్కడి కేంద్రం చతికిలపడుతోంది. ఇక్కడా షరామామూలుగానే విద్యుత్ అవసరాలకు నెలకు రూ.10 లక్షలు చెల్లించిన దుస్థితి తలెత్తింది. ఇక ఉప్పల్ నల్లచెరువు ఎస్టీపీ వద్ద 30 మిలియన్ లీటర్ల నీటిని శుద్ధి చేస్తారు. ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం 50 కిలోవాట్లు. కానీ ఉపకరణాలు పనిచేయకపోవడంతో విద్యుత్ ఉత్పత్తి జరగకపోవడం గమనార్హం. ఇక్కడా విద్యుత్ బిల్లు నెలకు రూ.లక్ష చెల్లించాల్సిన పరిస్థితి. నిర్వహణ మెరుగుపడితేనే... మొత్తంగా ఎస్టీపీల వద్ద విద్యుత్ అవసరాలకు నెలకు రూ.31 లక్షల బిల్లు జలమండలి చెల్లించాల్సి వస్తోంది. అంటే ఏటా విద్యుత్ బిల్లుల రూపేణా రూ.3.72 కోట్ల నష్టాన్ని బోర్డు భరించాల్సి వస్తోంది. ఇక నిర్వహణ మరమ్మతుల పేరిట ఏటా రూ.2 కోట్లు ఖర్చు చేస్తుంది. మొత్తంగా ఏడాదికి రూ.5.72 కోట్ల నష్టాన్ని భరించాల్సిన దుస్థితి తలెత్తింది. ఎస్టీపీల నిర్వహణ తీరు మెరుగుపడితే ఈ మొత్తాన్ని ఆదా చేసుకునే అవకాశం ఉంటుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కార్యాచరణకు నోచని ప్రతిపాదనలు చారిత్రక మూసీ నదిని మురుగుకూపం నుంచి రక్షించేందుకు గ్రేటర్ వ్యాప్తంగా నూతనంగా పది మురుగు శుద్ధి కేంద్రాలు(ఎస్టీపీ)లను నెలకొల్పాలన్న జలమండలి ఆశయం నీరుగారుతోంది. కొత్త ఎస్టీపీల ప్రతిపాదనలు గత మూడేళ్లుగా కాగితాలకే పరిమితమౌతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో పైసా నిధులు విదల్చడంలేదు. దీంతో జలమండలి నిధులు లేవని చేతులెత్తేసింది. జాతీయ నదీ పరిరక్షణ పథకం (ఎన్‌ఆర్‌సీడీ ) కింద నూతన ఎస్టీపీలను నిర్మించాలన్న ప్రతిపాదనలు కూడా కార్యాచరణకు నోచుకోలేదు. ఫలితంగా నిత్యం 900 మిలియన్ లీటర్ల శుద్ధి చేయని మురుగు నీరు చేరి మూసీ కాలుష్య కాసారమౌతోంది. -
పాక్ భూకంప మృతులు 350
ఇస్లామాబాద్: పాకిస్థాన్ నైరుతి ప్రాంతాన్ని కుదిపేసిన భారీ భూకంప మృతుల సంఖ్య 350కి పెరిగింది. క్షతగాత్రుల సంఖ్య కూడా 250కి చేరింది. బలూచిస్థాన్ రాష్ట్రంలో మంగళవారం రిక్టర్ స్కేలుపై 7.7 తీవ్రతతో సంభవించిన ఈ విపత్తులో అవారన్ జిల్లా ఘోరంగా దెబ్బతింది. ఈ జిల్లాలో అత్యధిక ప్రాణనష్టం సంభవించింది. అవారన్, కెచ్ జిల్లాలో 327 మృతదేహాలను వెలికి తీశా రు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు చెప్పారు. భూకంపం ధాటికి ఆరు జిల్లాల్లో వేలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. 3 లక్ష ల మంది ఇక్కట్లకు గురయ్యారు. తిండితిప్పలు లేకఅల్లాడుతున్నారు. ఇళ్లు కోల్పోయిన వేలాది మంది శిథిలాల మధ్యే గడుపుతున్నారు. రోడ్లు, కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతినడంతో సహాయ చర్యలకు ఆటంకం కలుగుతోంది. ‘భూక ంప ద్వీపం’ నుంచి మీథేన్ వాయువు బలూచిస్థాన్‌లో భూకంపం కారణంగా అరేబియా సముద్రంలో గ్వదర్ తీరానికి 600 మీటర్ల దూరంలో ఏర్పడిన చిన్న ద్వీపం నుంచి మీథేన్ వాయువు వెలువడుతోంది. అక్కడి నేలపై వేడి బుడగలు వస్తున్నాయని, వాటిపై అగ్గిపుల్ల అంటించగానే మంటలు వస్తున్నాయని పాక్ శాస్త్రవేత్తలు చెప్పారు.