23% ఎక్కువ జీర్ణమయ్యే జొన్న!
- ఆ మేరకు పాల, మాంసం దిగుబడి పెరుగుతుంది..
- మిథేన్ విడుదలనూ గణనీయంగా తగ్గించే సూటి వంగడం..
- ఇవీ గోధుమ రంగు ఈనె కలిగిన జొన్న ‘ఎస్.పి.వి. 2018’ విశిష్టతలు
- ఫలించిన ఐ.ఐ.ఎం.ఆర్. శాస్త్రవేత్త డా. ఉమాకాంత్ పన్నెండేళ్ల కృషి
- వచ్చే ఖరీఫ్‌లో రైతులకు అందుబాటులోకి రానున్న విత్తనాలు
బాగా జీర్ణమయ్యే పశుగ్రాసంగా, మిథేన్ విడుదలను తగ్గించడానికి ఉపకరించే సరికొత్త జొన్న రకం రైతులకు త్వరలో అందుబాటులోకి రానుంది. ‘ఎస్.పి.వి. 2018’ అనే ఈ సూటి రకం వంగడాన్ని హైదరాబాద్ (రాజేంద్రనగర్)లోని భారతీయ చిరుధాన్యాల పరిశోధనా సంస్థ (ఐ.ఐ.ఎం.ఆర్.) రూపొందించింది. ప్రధాన శాస్త్రవేత్త డా.ఆకుల వెంకట ఉమాకాంత్ 12 ఏళ్లుగా చేస్తున్న పరిశోధన ఫలించింది. కాండం, ఆకులో ఈనె గోధుమ రంగు (సాధారణ జొన్నలో తెల్లగా ఉంటాయి)లో కలిగి ఉండడం ‘ఎస్.పి.వి. 2018’ జొన్న ప్రత్యేకత. ఇదే తొలి భారతీయ బ్రౌన్ మిడ్‌రిబ్ సోర్గమ్ రకం కావడం విశేషం. ఈ చొప్పలో లిగ్నిన్ తక్కువగా ఉంటుంది.
అందువల్ల ఇతర జొన్న రకాల కన్నా తీపిగా ఉండడంతోపాటు, పశువులకు ఎక్కువగా జీర్ణమవుతుందని డా. ఉమాకాంత్ ‘సాక్షి సాగుబడి’ ప్రతినిధికి తెలిపారు. హిస్సార్ (హరియాణా)లోని కేంద్రీయ గేదెల పరిశోధనా సంస్థ (సి.ఐ.ఆర్.బి.) అధ్యయనంలో ఈ చొప్ప మునుపటికన్నా 23 శాతం ఎక్కువగా జీర్ణమైనట్లు వెల్లడైంది. సాధారణ రకాల చొప్పను గేదెలకు మేపినప్పుడు 52% వరకు జీర్ణమైతే.. ఎస్.పి.వి. 2018 రకం చొప్ప 64% వరకు (మునుపటి కన్నా 23% ఎక్కువ) జీర్ణమైందని సి.ఐ.ఆర్.బి. గుర్తించింది. ఆ మేరకు పాల, మాంసం దిగుబడి పెరుగుతుందని డా. ఉమాకాంత్ తెలిపారు. ఖరీఫ్‌లో వర్షాధారంగా 120 రోజుల్లో 7-8 అడుగుల ఎత్తు పెరుగుతుంది. 16 టన్నుల చొప్పతోపాటు 2 టన్నుల జొన్నల దిగుబడి వస్తుందన్నారు. క్షేత్రస్థాయి పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ రకాన్ని జాతీయ మొక్కల జన్యుహక్కుల నమోదు సంస్థ (ఎన్.బీ.పీ.జీ.ఆర్.)లోనూ నమోదు చేశామన్నారు.
పశువుల ద్వారా వాతావరణంలోకి విడుదలయ్యే మిథేన్ వాయువు వల్ల భూగోళం అమితంగా వేడెక్కుతోంది. సాధారణంగా పశువుల నుంచి విడుదలయ్యే వాయువుల్లో మిథేన్ వాటా 32% ఉంటుంది. కానీ, ఎస్.పి.వి. 2018 చొప్పను మేపితే ఇది 24% శాతానికి తగ్గిందని పీవీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ అధ్యయనంలో వెల్లడైందని డా. ఉమాకాంత్ తెలిపారు.
ఇథనాల్ ఉత్పత్తికి తోడ్పడే రెండో తరం జొన్న ఇది..
ప్రస్తుతం తీపి జొన్న మొక్క కాండం రసంతో జీవ ఇంధనం ఇథనాల్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. ఇథనాల్ ఉత్పత్తిని పెద్ద ఎత్తున పెంపొందించడానికి ఉపకరించే రెండో తరం జొన్న వంగడంగా ఎస్.పి.వి. 2018 రకం ఉపయోగపడుతుందని డా. ఉమాకాంత్ తెలిపారు. లిగ్నిన్ తక్కువగా ఉంటుంది కాబట్టి (జొన్నలు తొలగించి చొప్పను పూర్తిగా ఇథనాల్ ఉత్పత్తిలో వాడుకోవడానికి ఈ రకం ఉపయోగపడుతుందని ఆయన అన్నారు.ఎస్.పి.వి. 2018 ప్రత్యేక జొన్న విత్తనాలను వచ్చే ఖరీఫ్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రైతులకు ఇవ్వనున్నట్లు ఐ.ఐ.ఎం.ఆర్. డెరైక్టర్ డా. విలాస్ తొనపి ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు.
- పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్