ప్రాంతీయ పార్టీలూ.. జాతీయ ప్రయోజనాలు | Regional Parties And National Benefits | Sakshi
Sakshi News home page

ప్రాంతీయ పార్టీలూ.. జాతీయ ప్రయోజనాలు

Published Fri, Mar 31 2023 8:22 PM | Last Updated on Fri, Mar 31 2023 8:41 PM

Regional Parties And National Benefits - Sakshi

‘‘ఏ ఒక్క ప్రాంతీయ పార్టీకీ దేశం మొత్తానికి అవసరమైన జాతీయ దృష్టి లేదు. అవి మహా అయితే ఒక కులానికి లేదా ఒక రాష్ట్రానికి ఉపయోగపడే అజెండాను మాత్రమే కలిగి ఉన్నాయి. మేమైతే దేశం మొత్తానికి తోడ్పడే దృష్టిని లేదా ప్రణాళికను జనం ముందుంచుతాం. మాకు జాతీయ సిద్ధాంతం ఉంది,’’ అంటూ మూడు నెలల క్రితం ఓ జాతీయపార్టీ అగ్రనేత మీడియాతో అన్నారు. కాని, ఈ ప్రకటన వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించడం లేదు.

దక్షిణాదిలోని ఐదు రాష్ట్రాల్లో మూడు (తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌) నేడు ప్రాంతీయపక్షాల పాలనలో ఉన్నాయి. ఈ మూడు ప్రాంతీయ పార్టీలూ (డీఎంకే, బీఆర్‌ఎస్‌, వైఎస్సార్సీపీ) అసెంబ్లీ ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీతో అధికారంలోకి వచ్చాయి. అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసే ఎన్నికల ప్రణాళికలతో, సమగ్ర జాతీయ దృష్టితో ఈ ప్రాంతీయపక్షాలు పనిచేస్తున్నాయని ఆయా రాష్ట్రాల ప్రజలేగాక దేశ ప్రజల్లో అత్యధిక భాగం భావిస్తున్నారు. 

సంకీర్ణాలలో ప్రాంతీయ వాటా
ఒడిశా, పశ్చిమబెంగాల్, సిక్కిం సహా దాదాపు పది రాష్ట్రాల్లో ప్రాంతీపక్షాలు జాతీయపక్షాలతో ఎలాంటి గొడవపడకుండా పరిపాలన సాగిస్తున్నాయి. 1977 నుంచీ కేంద్రంలో అధికారం చేపట్టిన అనేక సంకీర్ణ ప్రభుత్వాల్లో భాగస్వామ్యపక్షాలుగా ప్రాంతీయపార్టీలు వ్యవహరించాయి. ఇంకా గతంలో పంజాబ్, మహారాష్ట్ర వంటి అనేక రాష్ట్రాల్లో ప్రాంతీయ పక్షాల నేతృత్వంలో ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వాల్లో జాతీయ పార్టీలు భాగస్వాములుగా ఉన్న చరిత్ర మనది.

అనేక రాష్ట్రాల్లో జాతీయ ప్రయోజనాల పేరు సాకుగా చూపించి జాతీయపక్షాలు సక్రమంగా పరిపాలన సాగించకపోవడం, ప్రాంతీయ ఆకాంక్షలను విస్మరించడం, ప్రాంతీయ భాషలకు తగిన ప్రాధాన్యం ఇవ్వకపోవడం వంటి కారణాలు దేశవ్యాప్తంగా ప్రాంతీయపక్షాలు విస్తరించడానికి దారితీశాయి. ఫలితంగా అనేక ప్రాంతీయపక్షాలు అనేక సందర్భాల్లో ఉత్తర్‌ ప్రదేశ్, బిహార్‌ వంటి ప్రధాన హిందీ రాష్ట్రాల్లో సైతం అధికారంలోకి వచ్చి మంచి పాలన అందించాయి. 

ప్రపంచీకరణతోపాటే ప్రాంతీయపక్షాల ప్రాభవం
ప్రపంచీకరణ విశ్వవ్యాప్తమైన నేటి సందర్భంలో థింక్‌ గ్లోబల్లీ, యాక్ట్‌ లోకల్లీ (ప్రాపంచిక దృష్టితో ఆలోచించండి, స్థానికంగా ఆ ఆలోచనలు ఆచరణలో పెట్టండి) అనే నేటి పరిస్థితులకు అనువైన మాటలను ప్రాంతీయపక్షాలు అమలు చేసి చూపిస్తున్నాయి. ప్రజల అవసరాలు, నూతన రాజకీయ పరిస్థితులే నేడు ప్రాంతీయ పార్టీల పుట్టుకకు, వాటి ప్రాభవానికి కారణమౌతున్నాయి. ప్రాంతీయపక్షాలు జాతీయ పార్టీల కృషికి సమాంతరంగా పరిపూరక పాత్ర పోషిస్తున్నాయి.

ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు ప్రాంతీయ పార్టీల పాలనలోని రాష్ట్రాల్లో సురక్షితంగా పనిచేసుకుని బతుకుతున్నారు. ఈ రాష్ట్రాల్లో ఎలాంటి సంకుచిత ధోరణలు లేకుండా ప్రజలు సుఖసంతోషాలతో జీవిస్తున్నారని ఐక్యరాజ్య సమితి వంటి అంతర్జాతీయ సంస్థలు గుర్తించాయి.
చదవండి: పండిట్‌ నెహ్రూ, ఇందిరమ్మ రికార్డులను ఎవరు తిరగరాస్తారు!

140 కోట్లకు పైగా జనాభా, 22 అధికార భాషలు ఉన్న విశాల భారతంలో జాతీయపక్షాలు, ప్రాంతీయపక్షాలు అన్నదమ్ముల్లా పనిచేస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతం కావడానికి దోహదం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో కేవలం జాతీయ పార్టీలకే విశాల జాతీయ దృక్పథం ఉంటుందని, ప్రాంతీయపక్షాలు ఓ ప్రాంతం లేదా కులానికే ప్రాతినిధ్యం వహిస్తాయని పైన చెప్పిన జాతీయపార్టీ నాయకుడు వ్యక్తం చేసిన అభిప్రాయం నిజం కాదని రుజువవుతోంది.


-విజయసాయిరెడ్డి, రాజ్యసభ సభ్యులు, వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement