భారత పార్లమెంటు ఎగువసభ, శాశ్వత సభ అయిన రాజ్యసభకు ఏప్రిల్ 3, 2023న 71 సంవత్సరాలు నిండుతున్నాయి. ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన ముఖ్యాంశం ఏమంటే గడచిన శీతాకాల సమావేశాల్లో రాజ్యసభ పనితీరు 102 శాతం. ముందు నిర్ణయించిన ప్రకారం ఈ సమావేశాల్లో రాజ్యసభకు 63 గంటల, 26 నిమిషాలు కేటాయించగా, వాస్తవానికి 13 సిట్టింగుల్లో 64 గంటల 50 నిమిషాలపాటు సభ పనిచేసింది.
కిందటేడాది 14వ రాష్ట్రపతిగా ఎన్నికైన జగదీప్ ధంఖడ్ భారత రాజ్యాంగం ప్రకారం 2022 డిసెంబర్ 7న రాజ్యసభ 14వ చైర్మన్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. కొత్త సభాధ్యక్షుడి నేతృత్వంలో రాజ్యసభ కిందటి శీతాకాలం సమావేశాల్లో సంపూర్ణస్థాయిలో కార్యక్రమాలు నిర్వహించడం విశేషం.
నలుగురు ప్రధానులను అందించిన పెద్దల సభ
రాజ్యాంగంలో రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించే బాధ్యతలు అప్పగించిన కారణంగా సభను తొలుత ఇంగ్లిష్ లో కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అని పేర్కొన్నారు. హిందీలో రాజ్య్ అంటే రాష్ట్రం అని అర్ధం. హిందీలో ఇక నుంచి పార్లమెంటు ఎగువసభను రాజ్యసభ అని పిలుస్తారని 1954 ఆగస్ట్ 23న తొలి సభాధ్యక్షుడు, ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రకటించారు.
రాజ్యాంగం ప్రకారం ప్రధానమంత్రి, కేంద్రమంత్రులు పార్లమెంటు ఉభయసభల్లో ఏదో ఒక సభ సభ్యులై ఉండాలి. దేశ ప్రధానుల్లో ఎక్కువ మంది దిగువసభ లోక్ సభ సభ్యులు. మొదటి ఇద్దరు ప్రధానులు పండిత జవహర్లాల్ నెహ్రూ, లాల్ బహాదూర్ శాస్త్రి, వారి తర్వాత తాత్కాలిక ప్రధానిగా రెండుసార్లు (13 రోజుల చొప్పున) పనిచేసిన గుల్జారీలాల్ నందా లోక్ సభ సభ్యులే.
ఇందిరా ప్రధాని అయింది రాజ్యసభ ఎంపీగానే!
రెండో ప్రధాని శాస్త్రీ జీ మంత్రివర్గంలో సమాచార, ప్రసార శాఖా మంత్రిగా ఉన్న నెహ్రూ జీ కుమార్తె ఇందిరాగాంధీ మొదటిసారి భారత ప్రధానమంత్రి పదవి చేపట్టినప్పుడు (1966 జనవరి 24న) ఆమె రాజ్యసభ సభ్యురాలు. 1964 మే నెలలో ఆమె తండ్రి మరణానంతరం రాజ్యసభకు ఇందిర యూపీ నుంచి ఎన్నికయ్యారు. రాజ్యసభ ఎంపీగానే ప్రధాని అయిన ఆమె 1967లో రాయ్ బరేలీ నుంచి లోక్ సభకు ఎన్నికయ్యాక మళ్లీ ఇందిరమ్మకు రాజ్యసభకు ఎన్నికయ్యే అవసరం రాలేదు. ఆమె తర్వాత 1996 వరకూ రాజ్యసభ ఎంపీ భారత ప్రధాని కాలేదు.
దేవేగౌడది కూడా రాజ్యసభ దారే
1996 పార్లమెంటు ఎన్నికల తర్వాత జూన్ ఒకటిన జనతాదళ్ నేతృత్వంలో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన యునైటెడ్ ఫ్రంట్ సర్కారుకు నాయకత్వం వహించారు హెచ్‌డీ దేవెగౌడ. ప్రధానమంత్రి పదవి స్వీకరించే సమయానికి దేవెగౌడ పార్లమెంటు సభ్యుడు కాకపోవడంతో తర్వాత ఆయన సొంత రాష్ట్రం కర్ణాటక నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు.
చదవండి: ప్రాంతీయ పార్టీలూ.. జాతీయ ప్రయోజనాలు
ప్రధాని పదవిలో దాదాపు 11 నెలలు కొనసాగిన దేవెగౌడ తర్వాత ఆయన పార్టీకే చెందిన విదేశాంగమంత్రి ఇందర్ కుమార్ గుజ్రాల్ 1997 ఏప్రిల్ 21న ప్రధానమంత్రి అయ్యారు. అప్పటికే బిహార్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న గుజ్రాల్ జీ 11 నెలలు పదవిలో కొనసాగారు. గుజ్రాల్ తర్వాత 2004 వరకూ రాజ్యసభ సభ్యులెవరూ ప్రధానిమంత్రి పదవి చేపట్టలేదు.
2004 మే నెల 22న ప్రధానిగా ప్రమాణం చేసేనాటికి డాక్టర్ మన్మోహన్ సింగ్ రాజ్యసభ సభ్యులు. డాక్టర్ సింగ్ రాజ్యసభ ఎంపీగానే పదేళ్లు ప్రధాని పదవిలో కొనసాగారు. ఇలా రాజ్యసభ భారతదేశానికి నలుగురు ప్రధానులను అందించింది.
-విజయసాయిరెడ్డి, రాజ్యసభ సభ్యులు, వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులు
Comments
Please login to add a commentAdd a comment