ఓబీసీ బిల్లు– సామాజిక న్యాయం | Sudarshan Rao Article On OBC Reservation Bill | Sakshi
Sakshi News home page

ఓబీసీ బిల్లు– సామాజిక న్యాయం

Published Wed, Jul 24 2019 1:13 AM | Last Updated on Wed, Jul 24 2019 1:14 AM

Sudarshan Rao Article On OBC Reservation Bill - Sakshi

స్వాతంత్య్రం వచ్చిన తరువాత 1951లో జరిగిన మొదటి ఎన్నికల నుంచి ఇటీవల జరిగిన ఎన్నికల వరకు పార్లమెంట్‌లో బీసీల ప్రాతినిధ్యం ఎన్నడూ కూడా పది నుంచి ఇరవై శాతానికి మించలేదు. ఇది బీసీలకు కరువైన సామాజిక న్యాయానికి ప్రతీక. ఇది తీర్చేందుకు చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని ఎన్నో ఏళ్ల నుంచి బీసీలు కోరుతున్నా, అది పట్టిం చుకున్న నాథుడే కరువయ్యారు. కానీ, బీసీల కల నెరవేరేందుకు జూన్‌ నెల 21న వైఎస్సార్‌సీపీ రాజ్య సభ సభ్యుడు విజయసాయిరెడ్డి ప్రవేశపెట్టిన ఓబీసీ ప్రైవేటు బిల్లుతో ఆస్కారం చిక్కింది. భారత ప్రజా స్వామ్యంలో దీనిని ఒక చారిత్రక మలుపుగా పరిగణించవచ్చు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఆశించిన దాని కంటే అధిక మెజారిటీతో వైఎస్సార్‌సీపీ అధికారం లోకి వచ్చిన నెలరోజులలోపే పార్లమెంట్‌లో ఓబీసీల బిల్లు ప్రవేశపెట్టడం ఆ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి ఓబీసీల అభివృద్ధిపై ఉన్న శ్రద్ధాసక్తులను ప్రతిబింబిస్తోంది. ఈ బిల్లుకు పది రాజకీయ పార్టీలు మద్దతివ్వడం హర్షణీయం. జూలై 12న ఓబీసీ ప్రైవేటు బిల్లును రాజ్యసభ మూజువాణి ఓటుతో తిరస్కరించడం విచారకరం. ఈ నేప«థ్యంలో, రాష్ట్ర స్థాయిలో జూలై 23న ఏపీలో తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్‌ ఏర్పాటుకు చట్టం చేసి బిల్లును అసెంబ్లీ ముందుంచిన వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం దేశ చరిత్రలోనే నవశకానికి నాంది పలికింది.

దేశ జనాభాలో  దాదాపుగా 52 శాతంగా ఉన్న బీసీ కులాల్లోని అత్యధికులు సామాజికంగా, ఆర్థి కంగా, విద్య, ఉపాధి రంగాలలో వెనుకబడినవారే. ఆర్థిక, సామాజిక వెనుకబాటుతనంతో బీసీలు స్వతహాగా అగ్రకులాల వారితో పోటీపడే సత్తా లేనివారు. అందువల్ల సామాజిక న్యాయం దృష్ట్యా ఎస్సీ, ఎస్టీలకు ఉన్నట్లు జనాభా ప్రాతిపదికన వారికి చట్టసభల్లో సరైన స్థానం లభించాల్సి ఉంది. బీసీలకు చట్టసభల్లో సరైన ప్రాతినిధ్యం లభిస్తే, వారు వారి సమస్యలు, వెనుకబాటుతనంపై తగు రీతిలో ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి, అభివృద్ధికై అడుగులు వేసే ప్రయత్నం జరిగే అవకాశం ఏర్ప డుతుంది. దాంతోపాటు సమాజంలో ఇతర కులా లవలె వారికి సరైన గుర్తింపు, గౌరవప్రదమైన స్థానం లభిస్తుంది. ఎస్సీ, ఎస్టీలకు లభించిన రిజ ర్వేషన్ల వలన ఒకప్పుడు అతి దారుణమైన పరి స్థితులు ఎదుర్కొని సమాజంలో వివక్షకు గురైన వాళ్లు నేడు సమాజంలో విద్య, ఉపాధి రంగాల్లో, చట్టసభల్లో ప్రవేశం పొంది గౌరవప్రదమైన జీవితం గడిపేందుకు ఒక అవకాశం లభించింది. అట్టి అవ కాశాన్నే నేడు బీసీలు కూడా కోరుకుంటున్నారు. ‘మేమెంతో మాకంత’ అనే సామాజిక న్యాయం అమలు చేసేందుకు దోహదపడేదిగా ఈ బిల్లును పరిగణించవచ్చు. బీసీల్లోని కొన్ని కులాలవాళ్లు ఉదాహరణకు కాటికాపరి, బుడబుక్కల, గంగి రెద్దుల, బుడగజంగాల తదితర కులాల వారికి సమాజంలో సగటు మనిషికి దక్కా ల్సిన గౌరవం, ఆదరణ దక్కకపోవడం బాధాకరం.

ప్రస్తుత అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం 123వ రాజ్యాంగ సవరణ ద్వారా జాతీయ బీసీ కమిషన్‌కు రాజ్యాంగబద్ధత కల్పించిన కీర్తి మూట గట్టుకుంది. అలాగే ఓబీసీ బిల్లుకు కూడా ఎలాగోలా పార్లమెంట్‌లో ఆమోద ముద్ర వేయించి బీసీల అభివృద్ధికి బాటలు వేస్తారని ఆశిద్దాం. 2019లో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో ఆశించిన దానికంటే అధిక మెజారిటీలో అధికారం కైవసం చేసుకున్న బీజేపీ (ఎన్డీయే) ఈ బిల్లును ప్రతి పాదించి ఉంటే ప్రజల్లో ఓబీసీ బిల్లుకు పార్లమెంట్‌ ఆమోదం పొందడంలో ఏ మాత్రం సంశయం ఉండేది కాదు.  

వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చిన తరువాత పార్లమెంట్‌లో ఆ పార్టీ తరఫున ప్రవేశపెట్టిన మొదటి బిల్లు ఇది. ప్రస్తుతానికి ఈ ప్రైవేటు బిల్లు వీగిపోయినప్పటికీ  వైఎస్సార్‌సీపీకి ఎన్డీయేకి మధ్యగల సుహృద్భావ సంబంధాలు, పొరుగు రాష్ట్రాలతో ఉన్న మిత్ర సంబంధాలు అన్నింటినీ సమీకరించి, బిల్లు ఆమోదం పొందేలా జగన్‌ ఇకపై కూడా కృషి చేయాల్సి ఉంది. ఈ బిల్లు గెలుపోట  ములతో సంబంధం లేకుండా, దేశంలోని ఏ రాజ కీయ పార్టీ ఎటువైపో నిర్ధారణ జరిగే గడియలు కూడా ఆసన్నమైనట్లేనని రాజకీయ విశ్లేషకులు, సామాజికవేత్తల భావన. అధికారంలో ఉన్న బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్‌ సహా అన్ని రాజకీయ పార్టీలు అదేపనిగా బీసీలు, వారి అభివృద్ధిపై ఒలకబోసే ప్రేమలోని సత్యాసత్యాలు బహిర్గతం కానున్నవి. పార్లమెంటులో వైఎస్సార్‌సీపీ ప్రవేశపెట్టిన ఈ బిల్లు వీగిపోయినంత మాత్రాన బీసీలలో చిగురిం చిన ఆశాజ్యోతి ఆరిపోయినట్లు భావించకుండా, భవిష్యత్తులో మరింత శక్తితో దీని ఆమోదం కోసం పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ప్రొ. ఎస్‌. సుదర్శన్‌రావు
వ్యాసకర్త మాజీ ప్రిన్సిపల్, ఆర్ట్స్‌ కళాశాల, ఓయూ
yesyesrao@yahoo.com

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement