జనహృదయమెరిగిన ప్రధాని
పోటీదారుల కన్నా మెరుగ్గా నిలవటం మోడీకి సమస్య కాదు. ఎన్నికల ప్రచారంలో తాను నెలకొల్పిన అసాధారణ ప్రమాణాలనే ఆయన అధిగమించాల్సి ఉంది. దేశానికి గమ్యాన్ని నిర్దేశించి, ప్రాధాన్యాలను ఎంచుకుని, వాటిని నెరవేర్చగలిగే రూట్ మ్యాప్‌ను తయారు చేయాల్సి ఉంది. గమ్యం లేకుండా ఎంత ఎగిరినా మిగిలేది సుదీర్ఘ ప్రయాణ ప్రయాసే.
స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటలోని ఉపన్యాస వేదికకు తరలేటప్పుడు ఏ ప్రధానమంత్రి అయినా మూడిట్లో ఏదో ఒకదాన్ని ఎంచుకోవలసి ఉంటుంది. తమ ప్రభుత్వాన్ని ఉద్దేశించే ప్రసంగించడం లేదా తమలో తాము గొణుక్కోవడం లేదా దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడటం. మొదటిది సులువు. ఎందుకంటే ప్రభుత్వమే అందులో కథనమూ, కథకుడూ కూడా. మేం ఇది చేశాం (చప్పట్లు), మేం ఇది చేయబోతున్నాం (తప్పనిసరి చప్పట్లు) అంటూ ఏకరువు పెట్టి స్వీయ ప్రశంసల మిథ్యా సౌఖ్యాన్ని అనుభవించే అవకాశం అందులో ఉంది.
ఇక రెండోది, ఆత్మవిశ్వాసం కొరవడటం పర్యవసానమే తప్ప ఆత్మావలోకనం కొరవడటం కాదు. మన్మోహన్ సింగ్ దాన్ని అలవాటుగా మార్చుకున్నారు. తాను సంకోచించవ లసినది చాలానే ఉన్నదని ఆత్మావలోకనం ద్వారానే బహుశా ఆయనకు బోధపడి ఉండాలి. అధినేతతో అనుబంధం చెడి పోయినా ఆమెకు మోకరిల్లక తప్పని విలక్షణమైన ప్రధాని మన్మోహన్. అధికారాన్ని సోనియాగాంధీ, ఆమె చపల చిత్తపు కుమారుడు రాహుల్‌గాంధీ అనుభవిస్తుండగా, ఆయన బాధ్యతలకు కట్టుబడి ఉండవలసి వచ్చింది. నష్టం వాట్లిలింది దేశానికి.
ప్రధాని నరేంద్రమోడీ దేనిని ఎంపిక చేసుకున్నారో చెప్పిన వారికి బహు మానాలు లభించే అవకాశమేమీ లేదు. ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లా డారు. పోటీదారుల కన్నా మెరుగ్గా నిలవటం ఆయన సమస్య కాదు. ముమ్మ రంగా సాగిన ఎన్నికల ప్రచారంలో తాను నెలకొల్పిన అసాధారణ ప్రమాణా లనే ఆయన అధిగమించాల్సి ఉంది. ఇప్పుడాయన గమ్యాన్ని నిర్దేశించాల్సి ఉంది. ఆ దృష్టి నుండీ ప్రాధాన్యాలను ఎంచుకోవాలి. వాటిని నెరవేర్చడానికి తగిన రూట్ మ్యాప్‌ను తయారు చేసుకోవాలి. గమ్యం అంటూ లేకుండా ఎంత ఎగిరినా సుదీర్ఘ ప్రయాణపు ప్రయాస తప్ప ఎక్కడికీ చేరలేరు.
మోడీ అసలు సారం ఏమిటో ఆగస్టు 15 ఉదయాన విన్నాం, కన్నాం. ఆయన హృదయం ఆకాశపు అంచును నిర్దేశిస్తే, బుద్ధి దిక్సూచీలోని అయస్కాంతమైంది. దేశ ప్రగతి ప్రభుత్వ కార్యక్రమమేమీ కాదు, ప్రజలందరి కార్యక్రమం అనే అంశం చుట్టే ఆయన సందేశపు ఉరవడి తిరిగింది. ఒక్క పోలికతో ఆయన ఆ విషయాన్ని చక్కగా చెప్పారు. 125 కోట్ల మంది భారతీయులు ఒక్కొక్కరూ ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తే, దేశం 125 కోట్ల అడుగులు ముందుకు పోతుంది. గత ప్రభుత్వ హయాంలో ప్రధాని ప్రసంగం షేర్ హోల్డర్ల వార్షిక సమావేశంలో సమర్పించే పద్దుల చిట్టాలా ఉండేది. మోడీ దానిని నిశిత పరిశీలన అనే ఇరుసుపై తిరుగాడే ముల్లుగా మార్చారు. మన జాతీయ స్వభావంలో ఏవైనా చెడులు ఉంటే వాటిని ఎత్తి చూపటంతోపాటు, అది పేదరికం లేదా లైంగిక వివక్షతతో కూడిన నేరాల వంటి శాపాలు లేదా అప్రతిష్టలపైకి వెలుగును ప్రసరింపచేసింది. ఇది నిరాశావాదం కాదు, వాస్తవిక వాదం. లక్ష్యం సాధించగలిగినది మాత్రమే కాదు, చేతికి అందుబాటులోనే ఉంది అనే విశ్వాసంతో మోడీ దేశ మానసిక స్థితిని మార్చేశారు. ఆ దార్శనికతనే ఆయన ప్రజలకు అందించారు. ఎర్రకోట దగ్గర మారుమోగిన చప్పట్లలో అతి గట్టిగా ధ్వనించినవి టీనేజీ బాలల చప్పట్లే. అవి దేశవ్యాప్తంగా ఉన్న నగరాలు, పట్టణాలలోని కోట్లాది మంది ప్రజల ఆశల ప్రతిధ్వనులు.
పెల్లుబికిన ఆనందోత్సాహాలు వివరణకు అందేవే. మన దేశానికి ప్రధానమంత్రి మాత్రమే కాదు, నేత దొరికాడు. ప్రధాని మోడీ ఎవరూ అడగని ప్రశ్నలను లేవనెత్తారు. కూతుళ్లను నిర్లక్ష్యం చేస్తూ మనం కొడుకుల పట్ల ఎందుకు గారం చేస్తున్నాం? ఆడపిల్లలను పిండదశలోనే చిదిమేసే అత్యంత అవమానకరమైన స్థితికి బాధ్యులు ఎవరు? మన ఇళ్లను, వీధులను, దేశాన్ని పరిశుభ్రం చేసుకోవడానికి మనకు చట్టాలు అవసరమా? కుల, మత హింస అనే కాలకూట విషానికి అంతం ఎప్పుడు? ఒక పదేళ్లపాటు సామరస్యాన్ని పాటించి ఫలితాలను మీరే చూడండి అంటూ ఆయన ప్రజలకు సవాలు విసిరారు. ఇలాంటి ప్రశ్నలను సంధించడం బహుశా ఢిల్లీ దర్బారుకు వెలుపలివారికి మాత్రమే సాధ్యమేమో. ప్రధాని మోడీ తనను తాను అలాగే అభివర్ణించుకున్నారు. అందుకే మోడీ ఢిల్లీ దర్బారు లోని భారత ప్రజాస్వామ్యపు అతి శిష్ట వర్గానికి, రాజకీయ-అధికార యంత్రాంగాన్ని నియంత్రించే వర్గం వారికి సంబంధించిన సర్వ సామాన్య సత్యాన్ని విస్పష్టంగా చూడగలరు. తీవ్ర సంస్కరణ తప్ప మరేదీ సరిదిద్దలేనంతగా వారి మధ్య సాగే అంతర్యుద్ధాలు పరిపాలనను పాడు చేశాయని చెప్పగలిగే నాయకత్వం కావాలి. మోడీ అలాంటి నాయకత్వాన్ని అందించగలరు.
ప్రణాళికా సంఘం దాని అసలు లక్ష్యానికే కొరగాకుండా పోయింది. ఆ కారణంగానే మోడీ దాని మరణ సంతాప సందేశాన్ని వినిపించారు. అత్యంత తీవ్ర జాతీయ సంక్షోభమైన పేదరికం పట్ల గత పదేళ్లుగా అనుసరించిన స్వయం సంతృప్తికర, నిస్సార వైఖరే, దాని ముఖ్య వైఫల్యం. సామాన్యమైన అంచనాకు సైతం అది కనబడుతుంది. ఆరు దశాబ్దాల ప్రణాళికా బద్ధమైన ఆర్థిక వ్యవస్థలో పేదరిక రేఖకు దిగువనే ఉన్న భారతీయుల సంఖ్య కేవలం అతి స్పల్పంగా, ఏడాదికి అర శాతం (0.5 శాతం) చొప్పున తగ్గుతూ వచ్చింది. ఇది దిగ్భ్రాంతికరమైనదీ, ఆమోదయోగ్యం కానిదీ.రాష్ట్రాలతో సహకారం ద్వారా సమస్యలకు పరిష్కారాలను అన్వేషించాల్సింది పోయి ప్రణాళికా సంఘం రాచరిక ఆదేశాల పరంపరగా శాసించింది. రాష్ట్ర ప్రభుత్వాలకు అది కేంద్రాన్ని బిచ్చమడుక్కుంటే ఒకటో రెండో మెతుకులు దక్కుతాయని బోధించేది. చట్ట రీత్యా, ఆచరణ రీత్యా కూడా మనది సమాఖ్య దేశం. కొన్ని చిన్న కేంద్రపాలిత ప్రాంతాలను మినహాయిస్తే, దేశంలోని మరే ప్రాంతాన్నీ కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్షంగా పరిపాలించడానికి వీల్లేదు. రాష్ట్ర ప్రభుత్వాల ద్వారానే అభివృద్ధి పనులు అత్యుత్తమంగా సాగుతాయి. కేంద్రం అందుకు దోహదకారే తప్ప నియంత కాదు.
ప్రపంచం మారిపోతోంది. మనం దానికి అతీతంగా ఉండలేం. సాంకేతికపరమైన నూతన ఆవిష్కరణలు, అత్యధునాతన వస్తు తయారీ ప్రధానంగా ప్రైవేట్ రంగంలోనే సాగే శకం ఇది. అందువలన మనకు అంతర్జాతీయ సహకారమనే సృజనాత్మక శక్తి అవసరం. పేదరికానికి అత్యుత్తమ విరుగుడు పారిశ్రామిక, వ్యవసాయ రంగాలలోని ఉపాధి కల్పనే. వ్యక్తిగత సంక్షేమాన్ని అది జాతీయ వృద్ధితో అనుసంధానిస్తుంది. ప్రధాని మోడీ అన్నట్లుగా భారత్ ప్రపంచ వస్తు తయారీరంగ కేంద్రంగా మారడానికి సన్నద్ధమై తీరాలి.
కలలు నిజమయ్యేది మేలుకుని ఉన్నప్పుడు మాత్రమేనని ప్రధాని మోడీకి తెలుసు. నిద్రలో నడకతో అద్భుత స్వప్నం దిశగా మీరు ముందుకు పోజాలరు. జాతిని జడత్వం నుంచి మేల్కొల్పగల అభీష్టశక్తి ఆయనకుంది. రానున్న మాసాల్లో అది ఎలాగో మీరు చూస్తారు.
(వ్యాసకర్త సీనియర్ సంపాదకులు) - ఎంజే అక్బర్